మార్కెట్‌కు ఫెడ్ ఫీవర్ | Asian markets down ahead of Federal Reserve meeting | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు ఫెడ్ ఫీవర్

Published Wed, Sep 17 2014 12:37 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM

మార్కెట్‌కు ఫెడ్ ఫీవర్ - Sakshi

మార్కెట్‌కు ఫెడ్ ఫీవర్

 అంచనాలకంటే ముందుగానే అమెరికా కేంద్ర బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ వడ్డీ రేట్లను పెంచవచ్చునన్న అంచనాలు దేశీ స్టాక్ మార్కెట్లను ఒక కుదుపు కుదిపాయి. పాలసీ సమీక్షలో భాగంగా రెండు రోజుల ఫెడ్ సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి.  

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఫెడ్ అమలు చేస్తున్న 80 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీ ముగింపునకు రావడంతో ఇక వడ్డీ రేట్లు పెంచడంపై దృష్టి పెడుతుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో చెలరేగాయి. ఇది జరిగితే విదేశీ పెట్టుబడులు నిలిచిపోవడంతోపాటు, వెనక్కి తరలిపోవచ్చునన్న భయాలు ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు ఎగదోశాయి. దీంతో నిఫ్టీ సైతం 109 పాయింట్లు దిగజారి 7,933 వద్ద నిలిచింది. ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం కూడా సెంటిమెంట్‌ను బలహీనపరచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, ఇంతక్రితం ఆగస్ట్ 1న మాత్రమే సెన్సెక్స్ 414 పాయింట్లు పడింది.

 6 సంవత్సరాల తరువాత: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం చెలరేగడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2008 డిసెంబర్ నుంచీ వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలోనే కొనసాగిస్తూ వస్తోంది. దీంతోపాటు మందగించిన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు సమకూర్చే బాటలో సహాయక ప్యాకేజీల ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లను వ్యవస్థలోకి పంప్ చేస్తూ వస్తోంది. ఇటీవల ప్యాకేజీల ఉపసంహరణను చేపట్టడంతోపాటు, వడ్డీ రేటు పెంపుపై పునరాలోచన చేసే సంకేతాలు ఇస్తూ వస్తోంది. ఈ బాటలో తాజాగా పరపతి సమీక్షను చేపట్టడంతో ఆరేళ్ల తరువాత ఫెడ్ మళ్లీ వడ్డీ పెంపు విధానాలను ప్రకటించవచ్చునన్న భయాలు మార్కెట్లలో చెలరేగాయి. ఫలితంగా ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం బలహీనపడ్డాయి.

 మరిన్ని విశేషాలివీ...
 అన్నింటా అమ్మకాలే: బీఎస్‌ఈలో అన్ని రంగాలూ అమ్మకాలతో నీరసించాయి. ప్రధానంగా రియల్టీ, పవర్, ఆయిల్, మెటల్, బ్యాంకింగ్, ఆటో 3.5-2% మధ్య పతనమయ్యాయి.

 బ్లూచిప్స్ బోర్లా: సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్ 6% పతనంకాగా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, రిలయన్స్, కోల్ ఇండియా, గెయిల్, హిందాల్కో, భెల్, ఐసీఐసీఐ, సిప్లా, విప్రో 3.5-1.5% మధ్య నష్టపోయాయి. ఏడు మాత్రమే అది కూడా నామమాత్ర లాభాలతో ముగిశాయి.


 పవర్ షాక్: విద్యుత్ రంగ షేర్లలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా 10% పడిపోగా, టొరంట్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, సీఈఎస్‌సీ, క్రాంప్టన్ గ్రీవ్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ పవర్, ఎన్‌హెచ్‌పీసీ 7-4% మధ్య తిరోగమించాయి.

 రియల్టీ దిగాలు: రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్, యూనిటెక్, అనంత్‌రాజ్, డీబీ, ఒబెరాయ్, ఇండియాబుల్స్, ప్రెస్టీజ్, డీఎల్‌ఎఫ్ 8-3% మధ్య క్షీణించాయి.

 చిన్న షేర్లు విలవిల: ప్రధాన సూచీలను మించుతూ మిడ్ క్యాప్ 3.5% పతనమైతే, స్మాల్ క్యాప్ మరింత అధికంగా 4% దిగజారింది. ట్రేడైన షేర్లలో ఏకంగా 2,230 నష్టపోతే, కేవలం 803 లాభపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

 ఎఫ్‌ఐఐల యూటర్న్: ఇటీవల వరకూ నికర పెట్టుబడిదారులుగా నిలుస్తూ వచ్చిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 829 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం.

 నేలచూపులే: కాలపరిమితి రుణం చెల్లింపులో ఆలస్యం కారణంగా కంపెనీ రేటింగ్‌ను క్రిసిల్ డౌన్‌గ్రేడ్ చేయడంతో వీనస్ రెమిడీస్ షేరు 20% కుప్పకూలింది. ఇక ఎంఎస్‌సీఐ మిడ్ క్యాప్ సూచీలో స్థానం కోల్పోవడంతో యస్ బ్యాంక్ షేరు 4% పతనమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement