
ఫెడ్ మినిట్స్‌తో లాభాలు
వడ్డీరేట్ల పెంపు విషయంలో తొందరపడకూడదని ఫెడ్ సమావేశ వివరాలు వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ కూడా శుక్రవారం లాభాల్లో ముగిసింది.
వడ్డీరేట్ల పెంపు విషయంలో తొందరపడకూడదని ఫెడ్ సమావేశ వివరాలు వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ కూడా శుక్రవారం లాభాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం 31 పైసలు పెరగడం కూడా సానుకూల ప్రభావం చూపింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 234 పాయింట్ల లాభంతో 27,080 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 8,190 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 858 పాయింట్లు (3.3 శాతం), నిఫ్టీ 3% చొప్పున లాభపడ్డాయి.
దూసుకుపోయిన వేదాంత..
కమోడిటీ కంపెనీ వేదాంత 11.6 శాతం ఎగసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. అంతర్జాతీయ లోహ దిగ్గజం గ్లెన్‌కోర్ జింక్ ఉత్పత్తిని 5 శాతం వరకూ తగ్గించనున్నామని ప్రకటించడంతో ధరల పతనానికి అడ్డుకట్ట పడుతుందన్న అంచనాలతో లోహ షేర్లు పెరిగాయి. మార్కెట్ పరిస్థితులు ఒడిదుడుకులుగా ఉండటంతో జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు మూలధన, నిర్వహణ వ్యయాలు తగ్గించుకున్నామని వేదాంత రిసోర్సెస్ పేర్కొంది.
ప్రభుత్వ రంగ సౌరశక్తి ప్రాజెక్టులకు బిడ్ చేయాలని నిర్ణయించడం కూడా ప్రభావం చూపింది. ఈ అంశాల కారణంగా వేదాంత షేర్ 11.6 శాతం వృద్ధి చెంది రూ. 104 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో(సోమవారం ఫలితాలు వెలువడతాయి) ఇన్ఫోసిస్ షేర్ 3 శాతం పెరిగింది.
టాటా స్టీల్ 4 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతం, ఓఎన్‌జీసీ, గెయిల్, హిందాల్కో, సిప్లా 2 శాతం చొప్పున, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, హీరో మోటొకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీలు 1 శాతం చొప్పున పెరిగాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే, కోల్ ఇండియా 3 శాతం, మారుతీ సుజుకీ 2 శాతం, సన్ ఫార్మా 1 శాతం, భెల్ 1 శాతం చొప్పున తగ్గాయి. ముడి చమురు ధరలు పెరగడంతో పలు కంపెనీల ఆయిల్ షేర్లు 2.7 శాతం వరకూ నష్టపోయాయి.