
ఫెడ్ వడ్డీరేటు పావు శాతం పెంపు
అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. దీనితో ఈ రేటు 0.50–0.75% శ్రేణికి ఎగసింది.
• 0.50 శాతం – 0.75 శాతం శ్రేణికి రేటు
• అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అంచనా
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. దీనితో ఈ రేటు 0.50–0.75% శ్రేణికి ఎగసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉండడమే రేటు పెంపు నిర్ణయానికి కారణమని ఫెడ్ పేర్కొంది. వచ్చే మూడేళ్లూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు పుంజుకునే అవకాశం ఉందనీ ఫెడ్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఏడాదికి మూడు దఫాలుగా రేట్ల పెంపు అవకాశం ఉండవచ్చని ప్రకటించింది.
ఫెడ్ రేటు పెంపు వార్త వెలువడిన వెంటనే అమెరికా ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. కడపటి సమాచారం అందే సరికి డౌజోన్స్ కొత్త రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాది ఇదే నెల 16న ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెరిగింది. దీనితో ఈ రేటు 0.25–0.50% శ్రేణికి మారింది. అప్పట్లోనూ ఫెడ్ నిర్ణయం తరువాత అమెరికా స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేశాయి. అయితే 2 నెలలు తిరిగే సరికి అమెరికా ఎస్‌అండ్‌పీ సూచీ 11%పైగా పడిపోయింది. కాగా రేటు పెంచితే ఔన్స్ (31.1గ్రా) వెయ్యి డాలర్ల లోపునకు పడిపోతుందన్న అంచనాలకు భిన్నంగా అప్పట్లో పసిడి ర్యాలీ జరిగింది. 2006 తరువాత రేట్ల పెంపు ఇది రెండవసారి.