రేట్ల పెంపునకు సిద్ధమే కానీ.. వేచిచూస్తాం
ఫెడ్ చైర్మన్ యెలెన్
న్యూయార్క్: ఫెడ్ ఫండ్ రేటు పెంపునకు తగిన పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జానెట్ యెలెన్ పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్‌లో వెలువడనున్న ‘ఉపాధి’ గణాంకాల వరకూ వేచిచూస్తామని సూచించారు. ఫెడ్ వైస్ చైర్మన్ స్టాన్లీ ఫీచ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం ఫెడ్ ఫండ్ రేటు 0.25-0.50 శాతం శ్రేణిలో ఉన్న సంగతి తెలిసిందే. టిటాన్ కౌంటీ జాక్‌సన్ హోల్ వ్యాలీలో జరిగిన ఒక సదస్సులో జానెట్ ప్రసంగిస్తూ..
ఫండ్ రేటు పెంపునకు తగిన పరిస్థితులు ఇటీవలి నెలల్లో ఏర్పడినట్లు తెలిపారు. అయితే సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్, నవంబర్‌లలో ఫెడ్ సమావేశాలు ఉన్నాయి. అయితే అమెరికా ఎన్నికలకు ముందు రేటు పెరగకపోవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు దశాబ్దకాలం తరువాత ఫెడ్ 2015 చివర్లో రేటును స్వల్పంగా పావుశాతం పెంచింది.