క్రూడ్, ప్రపంచ మార్కెట్లే దిక్సూచి..
పరిధికి లోబడి గమనం
స్వల్ప రికవరీకి అవకాశం
జీఎస్టీ, రూపాయి ప్రభావం సైతం
ఈ వారం స్టాక్ మార్కెట్లపై నిపుణుల విశ్లేషణ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఓ పరిధికి లోబడి చలిస్తాయని, స్టాక్స్ విలువలు ఆకర్షణీయ స్థాయిలో ఉన్నందున స్వల్ప రికవరీకి అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా క్రూడాయిల్ ధరలు, అంతర్జాతీయ మార్కెట్ల కదలికల ఆధారంగా దేశీయ మార్కెట్ల గమనం ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో జీఎస్టీ అమలుపై ప్రభుత్వ చర్యలు, రూపాయి మారకం విలువల్లో హెచ్చుతగ్గులు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తాయంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు చాలా వరకు తగ్గినందున మార్కెట్లలో పెద్దగా కదలికలు ఉండకపోవచ్చని, దీంతో మార్కెట్లు ఓ పరిధిలో చలిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘‘డీమోనిటైజేషన్ ప్రభావం స్వల్పకాలం పాటు మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుంది. దీని పరిణామాలపై మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది’’ అని అమ్రపాలి ఆద్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ హెడ్ అబనీష్‌కుమార్ సుదాన్షు తెలిపారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం అనంతరం రూపాయి కదలికలపై కన్నేసి ఉంచాలని ఇన్వెస్టర్లకు సూచించినట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వం డిజిటల్ ఇండియాపై దృష్టి పెట్టడంతోపాటు రూపాయి బలహీనత కారణంగా ఐటీ షేర్లు వెలుగులో ఉండవచ్చని తాము అంచనా వేస్తున్నట్టు అబనీష్ పేర్కొన్నారు. ఇక చమురు కంపెనీల షేర్లతోపాటు టాటా గ్రూపు కంపెనీల ఈజీఎంలు ఈ వారంలో ఉన్నందున వీటి ధరలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి ధరల పతనం కారణంగా కొన్ని షేర్లు ఆకర్షణీయ స్థాయిలో ఉన్నాయని, ఫలితంగా వీటికి కొనుగోళ్ల మద్దతు లభించవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
స్వల్పకాలం ప్రతికూలంగానే
ఫెడ్ దూకుడైన విధానం కారణంగా మార్కెట్ ఆటుపోట్లకు గురికావచ్చని, డాలర్ బలపడడం, పెరుగుతున్న క్రూడాయిల్ ధరల కారణంగా స్వల్పకాలం పాటు మార్కెట్ ప్రతికూలంగానే కొనసాగవచ్చని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ ఫైనాన్షియల్ సేవల విభాగం రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి అంతర్జాతీయంగా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ముగిసినందున దేశీయ మార్కెట్లలో వాల్యూమ్స్, అస్థిరత తగ్గుముఖం పట్టవచ్చని, షేరు వారీ వార్తల ఆధారిత గమనం కొనసాగవచ్చని జిఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్లలోకి ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని ట్రేడ్‌బుల్స్ సీఈవో ధ్రువ్ దేశాయ్ తెలిపారు. ఇక, గత వారం దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,610 కోట్లు ఉపసంహరించుకున్నట్టు గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.
విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల 13–16 మధ్య ఈక్విటీ, డెట్ మార్కెట్లలో రూ.2,341 కోట్ల మేర అమ్మకాలు జరిపినట్టు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ వెల్లడించింది. అధిక శాతం విక్రయాలు డెట్ మార్కెట్లోనే ఉన్నాయని తెలిపింది. ఇక సాంకేతికంగా చూస్తే నిఫ్టీ కొంత కరెక్షన్‌కు గురికావచ్చనే అంచనాలు ఉన్నాయి. నిఫ్టీ తక్షణ మద్దతు స్థాయిలైన 8127–8105 వద్ద నిలదొక్కుకుంటుందా, లేదా అన్నది గమనించాలని లేదంటే వారం ప్రారంభంలో మరికొంత దిద్దుబాటుకు గురికావచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ విభాగం హెడ్ దీపక్ జసాని తెలిపారు. గత వారం సెన్సెక్స్ 257.62 పాయింట్లు, నిఫ్టీ 122.30 పాయింట్ల మేర నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నవంబర్ 18 తర్వాత ఒక వారంలో గరిష్ట నష్టాలు ఎదురుకావడం మళ్లీ ఇదే.