జీఎస్‌టీ బిల్లు, రూపాయి కీలకం | D-Street week ahead: Fate of GST bill, macro data to decide market direction | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ బిల్లు, రూపాయి కీలకం

Published Mon, Dec 7 2015 4:19 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM

జీఎస్‌టీ బిల్లు, రూపాయి కీలకం - Sakshi

జీఎస్‌టీ బిల్లు, రూపాయి కీలకం

ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ప్రపంచ మార్కెట్ల దృష్టి
* విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుపై పార్లమెంట్ ఏవిధంగా స్పందిస్తున్నది ఈ వారం మార్కెట్‌కు కీలకమైన అంశమని నిపుణులంటున్నారు. అలాగే డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనే అంశాలు కూడా స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు.

వచ్చే శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడే అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాల కారణంగా షేర్లు ఒడిదుడుకులకు గురి కావచ్చని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
 
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై స్పష్టత వచ్చే వరకూ ఇన్వెస్టర్లలో ఆందోళన కొనసాగుతుందని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ (రీసెర్చ్) హితేశ్ అగర్వాల్ చెప్పారు. రూపాయి బలహీనత విదేశీ ఇన్వెస్టర్లను మరింతగా ఆందోళనకు గురి చేస్తోందని ఆయన చెప్పారు.  ఒక వేళ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందితే మార్కెట్ దూసుకుపోతుందని పేర్కొన్నారు.
 
వేచి చూసే ధోరణి..
జీఎస్‌టీ బిల్లుతో పాటు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల పోకడ, రూపాయి కదలికలు స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేస్తాయని ట్రేడ్ స్మార్ట్‌ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో మార్కెట్ వేచి చూసే ధోరణిలో ఉందని సామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జేమ్స్ మోడీ చెప్పారు. వడ్డీరేట్లు పెంచుతామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ పర్సన్ జానెట్ యెలెన్ సూచనప్రాయంగా గత వారంలో వెల్లడించారని, ఫలితంగా విదేశీ నిధులు తరలిపోయే అవకాశాలున్నాయనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొన్నదని పేర్కొన్నారు.  

చెన్నై వరదలు కొన్ని వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపించడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా హెడ్(టెక్నికల్ రీసెర్చ్ హెడ్) ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు.
 
గత వారం మార్కెట్..
గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 490 పాయింట్లు(1.87 శాతం), నిఫ్టీ 161 పాయింట్లు (2 శాతం) చొప్పున నష్టపోయాయి. గత శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం రెండేళ్ల కనిష్ట స్థాయి(67.01)కి క్షీణించింది.
 
విక్రయాల బాటలోనే విదేశీ ఇన్వెస్టర్లు
విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాల బాటలోనే ఉన్నారు. వడ్డీరేట్ల పెంపు తప్పదంటూ అమెరికా ఫెడరల్ చైర్‌పర్సన్ జానెట్ యెలెన్ సూచనప్రాయంగా వెల్లడించిన నేపథ్యంలో ఈ నెల 1-4 తేదీల్లో ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 2,300 కోట్ల విక్రయాలు జరిపారు. ఇదే కాలానికి డెట్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడులు రూ. 2.81 కోట్లుగా ఉన్నాయి. గత నెలలో  విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ. 7,074 కోట్ల అమ్మకాలు జరిపారు.

జానెట్ యెలెన్ వ్యాఖ్యల కారణంగా సున్నా వడ్డీరేట్ల శకం ముగిసినట్లేనని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ. 18,260 కోట్లుగా, డెట్ మార్కెట్లో రూ. 51,347 కోట్లు నికరంగా పెట్టుబడులు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement