
మన మార్కెట్లు కంచుకోటలు!
ఎంత భారీ ఒడిదుడుకులనైనా తట్టుకుని నిలబడేలా భారత మార్కెట్లు కంచుకోటల్లా తయారయ్యాయని,
ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే సత్తా ఉంది...
► ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావం తక్కువే ఉంటుంది
► కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా...
► ప్రభావం ఉన్నా.. తక్కువేనంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: ఎంత భారీ ఒడిదుడుకులనైనా తట్టుకుని నిలబడేలా భారత మార్కెట్లు కంచుకోటల్లా తయారయ్యాయని, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం వాటిపై తక్కువే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు వల్ల భారత మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున విదేశీ నిధులు తరలిపోతాయనేది సరికాదని పేర్కొంది. సుదీర్ఘకాలం పాటు సున్నా స్థాయిలోనే ఉంచిన వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ పెంచడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, గురువారం దేశీ మార్కెట్లు అందుకు భిన్నంగా లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రస్తుతం సస్పెన్స్ తొలగిపోవడంతో కొత్త పరిణామాలకు మార్కెట్లు సర్దుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రాబోయే రోజుల్లో ఫెడ్ రేట్లను మరింతగా పెంచే తీరును పరిశీలించాల్సి ఉంటుందని, అయితే దీని వల్ల ఎటువంటి సంక్షోభం ఎదురైనా తట్టుకునేందుకు భారత మార్కెట్లు సిద్ధంగా ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మరోవైపు, రేట్ల పెంపు భారత్‌పై పెద్దగా ప్రభావం చూపకపోయినా, రూపాయి సహా వర్ధమాన మార్కెట్ల కరెన్సీలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఎ. దీదార్ సింగ్ చెప్పారు. రూపాయి మరింత బలహీనపడటం, ఫలితంగా దేశీ యంగా ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాలను పరిశీలించాల్సి ఉంటుందని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు.
అనిశ్చితి తొలగింది..
భారత్ సర్వసన్నద్ధంగా ఉండటంతో దేశీ మార్కెట్లలో ఫెడ్ రేట్ల పెంపు ప్రభావం చాలా తక్కువకే పరిమితం అయిందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఆస్తులు, అప్పుల ఖాతాలు పటిష్టంగా ఉన్నాయి. ద్రవ్య నిర్వహణ మెరుగ్గా ఉంది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి కూడా బాగుంది. వడ్డీ రేట్ల మార్పుల విషయంలో కరెన్సీ మార్కెట్లు అత్యంత వేగంగా స్పందించే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక శాఖ వాటిని నిరంతరం పరిశీలిస్తోంది’’ అని చెప్పారాయన. రాబోయే మరికొన్ని రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదురుకాకపోవచ్చని స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్‌ఈ సీఈవో ఆశీష్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఫెడ్ సరళ ద్రవ్యపరపతి విధానం.. భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు మేలు చేసేదేనని, భారత్‌లో విదేశీ ఫండ్స్ భారీ అమ్మకాలు జరపకపోవచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. అనిశ్చితి తొలగడంతో వ ర్ధమాన దేశాలు తగు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లభిస్తుందని ఆయన మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో పేర్కొన్నారు.
కొంత నిధులు తరలిపోవచ్చు: రంగరాజన్
ఫెడ్ రేట్ల పెంపుతో దేశీ స్టాక్స్ కొంత బలహీనపడొచ్చని, అమెరికాలో మంచి రాబడులు రావొచ్చన్న అంచనాలతో భారత్ నుంచి కొంత పెట్టుబడులు తరలిపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ చెప్పారు. అలాగే, పెట్టుబడుల రాక గతంలో కన్నా కొంత తగ్గొచ్చన్నారు. ఫెడ్ ప్రభావం మరీ తీవ్రంగా ఉండక పోవచ్చన్నారు. ‘‘భారత్ పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉంది. గతంలో మాదిరి చెల్లింపుల సంక్షోభం వంటి సందర్భాలు రావు. ఎగుమతులు తగ్గినా దానికి తగ్గట్లు చమురు రేట్ల పతనంతో దిగుమతులు కూడా తగ్గాయి. ఫలితంగా కరెంటు ఖాతా లోటు 2% కన్నా తక్కువే ఉంది. దీనర్థం అదుపులో ఉన్నట్లే’’ అని వివరించారు.
ఫెడ్ ప్రభావాలకు భారత్ అతీతం కాదు: ఫిచ్
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం వల్ల మార్కెట్లలో తలెత్తే హెచ్చుతగ్గుల ప్రభావాలకు భారత్ అతీతం కాదని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. అయితే, సానుకూల ఆర్థిక వృద్ధి అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయంగానే ఉండగలదని పేర్కొంది. ఎగుమతులపై తక్కువగా ఆధారపడి ఉండటం, విదేశీ మారక నిల్వలు మెరుగుపడటం తదితర అంశాల కారణంగా మిగతా పోటీ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందని ఫిచ్ వివరించింది. సమీప భవిష్యత్‌లో రూపాయి మారకం విలువ మెరుగుపడగలదని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. రేట్ల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి వస్తున్నదానికి సంకేతమని, ఇది దేశీ ఫారెక్స్.. బాండ్స్ మార్కెట్లకు సానుకూల అంశమని సంస్థ అనలిస్టు బన్సీ మధ్వానీ పేర్కొన్నారు.