భారీగా పడిన బంగారం
న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నెమైక్స్ కమోడిటీ డివిజన్ కామెక్స్‌లో బంగారం ధర గురువారం భారీగా పడింది. కడపటి సమాచారం మేరకు క్రితం ముగింపుతో పోల్చితే ఔన్స్ (31.1గ్రా) ధర 3%(దాదాపు 40 డాలర్లు) వరకూ నష్టపోయి 1,195 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్) నిర్ణయం దీనికి ప్రధాన కారణంగా కనబడుతోంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లోనూ పతనం కొనసాగుతోంది.
కడపటి సమాచారం అందే సరికి (రాత్రి 10 గంటలు) ఇక్కడ 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.487 వరకూ నష్టపోయి రూ.28,380 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీకి ఏకంగా 3 శాతంపైగా (రూ.1,467) నష్టపోయి రూ.43.880 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ధర ఇదే నష్టాల బాటన కొనసాగి (రూపాయి కదలికలకు లోబడి) నష్టాల్లో ముగిస్తే- శుక్రవారం స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడే అవకాశాలు ఉన్నాయి.