
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం ఖాయం అయినప్పటికీ అది ఈ ఏడాది మధ్యలోనా లేక చివర్లో ఉండొచ్చునా
ఏడాది మధ్యలోనా.. చివర్లోనా!
వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం ఖాయం అయినప్పటికీ అది ఈ ఏడాది మధ్యలోనా లేక చివర్లో ఉండొచ్చునా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇటు భారత్ వంటి వర్ధమాన దేశాలతో పాటు అటు సంపన్న దేశాలపైనే ప్రభావం చూపే విధంగా అమెరికా ఫెడ్ ఈ ఏడాది మధ్యలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే, పరిస్థితిని బట్టి పెంపుపై నిర్ణయాన్ని ఈ ఏడాది ఆఖరు దాకా వాయిదా వేసే అవకాశాలూ ఉన్నాయంటూ పాలసీ సమీక్ష సమావేశం తర్వాత ప్రకటనలో పేర్కొంది. దీంతో పెంపు ఎప్పుడు ఉండొచ్చన్న దానిపై ఆసక్తి నెలకొంది. రేట్ల పెంపు నిర్ణయానికి నియామకాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధితో పాటు డాలర్ మారకం విలువపైనా ఫెడ్ నిశితంగా దృష్టిపెట్టనుంది.
కాగా, బుధవారం నాటి పాలసీ సమీక్ష సమావేశంలో 0.25 శాతం స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లను ఫెడ్ రిజర్వ్ యథాతథంగానే ఉంచినప్పటికీ విధాన ప్రకటనలో ‘ఓపిక’ పదాన్ని తొలగించింది. వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇన్నాళ్లూ ‘ఓపిక’గా వ్యవహరిస్తున్నామంటూ ఫెడ్ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పదం తొలగించడం వల్ల పరిస్థితిని బట్టి వడ్డీ రేట్లను ఎప్పుడైనా పెంచేందుకు వెసులుబాటు లభించగలదని ఫెడ్ చైర్‌పర్సన్ జేనెట్ యెలెన్ పేర్కొన్నారు. అంతే తప్ప ‘ఓపిక’ పదాన్ని తొలగించినంత మాత్రాన తాము వడ్డీ రేట్లను ఎప్పుడెపుడు పెంచుదామా అన్నంత ‘అసహనం’గా లేమని ఆమె స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో జరిగే తదుపరి సమావేశంలో పెంచే అవకాశాలు లేవని పేర్కొన్నారు.