అమెరికా ఫెడ్ నిర్ణయం కీలకం
• 25 బేసిస్ పాయింట్ల ఫెడ్ పెంపు అంచనాలు
• అంతకు మించితే అమ్మకాల ఒత్తిడి
• ద్రవ్యోల్బణ గణాంకాలూ కీలకమే
• ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకోబోయే చర్యలు.. ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకమని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. దీంతోపాటు దేశీయంగా నవంబర్ నెల వినియోగదారుల, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు, వివిధ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ల పోకడలు ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు.
అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం.. తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. పెద్ద నోట్ల కరెన్సీ రద్దు కారణంగా పార్లమెంట్‌లో ఏర్పడిన ప్రతిష్టంభన, జీఎస్‌టీ సంబంధిత అంశాలపై నెలకొన్న స్తబ్దతను తొలగించే ప్రభుత్వ చర్యలు తదతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.
అమ్మకాల ఒత్తిడి
రెండు రోజుల పాటు జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఈ మంగళవారం(ఈ నెల 13న)మొదలవుతుంది. ఈ సమావేశంపై ప్రపంచమంతా ఆసక్తి నెలకొన్నది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే, భారత్ వంటి వర్ధమాన దేశాల నుంచి భారీగా విదేశీ పెట్టుబడులు తరలిపోతాయనే అంచనాలున్నాయి. ఫెడ్ రిజర్వ్ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసుకుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అబ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. అంతకంటే ఎక్కువ కోత ఉంటే మాత్రం అమ్మకాల ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్ రేట్ల కోతకు సంబంధించి ఫెడ్ అందించే సంకేతాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని కొటక్ సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు.
ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు ప్రకటిస్తే, డాలర్‌తో రూపాయి మారకం తిరిగి 68 స్థాయికి పతనమవుతుందని కొటక్ సెక్యూరిటీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్(కరెన్సీ డెరివేటివ్) అనింద్య బెనర్జీ చెప్పారు. ఇక దేశీయంగా చూస్తే మంగళవారం(ఈ నెల13న) నవంబర్ నెల వినియోగదారుల ద్రవ్యోల్బ ణం, బుధవారం (ఈ నెల 14న) టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు ఈ వారం ప్రారంభంలో స్టాక్ సూచీలు స్పందిస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ చెప్పారు.
తరలిపోతున్న విదేశీ నిధులు
ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్ నుంచి రూ. 17,392 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లో రూ.138 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.28,881 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్‌నుంచి రూ.42,101 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు