
మార్కెట్లకు ‘ఫెడ్’ ఫీవర్!
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలు తిరిగి తలెత్తడంతో సోమవారం స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.
♦ సెన్సెక్స్ 444 పాయింట్లు క్రాష్ నిఫ్టీ 151 పాయింట్లు పతనం
♦ జూన్ 24 తర్వాత ఇదే పెద్ద క్షీణత
♦ మెటల్, రియల్టీ షేర్లకు భారీ నష్టాలు
♦ కుదేలైన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు
ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలు తిరిగి తలెత్తడంతో సోమవారం స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 444 పాయింట్లు పతనమై 28,354 పాయింట్ల వద్దకు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 151 పాయింట్లు క్షీణించి 8,716 పాయింట్ల వద్ద ముగిసింది. బ్రెగ్జిట్ ఉదంతం సందర్భంగా జూన్ 24న జరిగిన పతనం తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. ఒక్క ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. లార్జ్‌క్యాప్ షేర్లతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు నిలువునా పతనమయ్యాయి. దాంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.95%, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.35% చొప్పున పడిపోయాయి. ఐటీ ఇండెక్స్ మాత్రం 0.87% లాభంతో ముగిసింది.
టాటా స్టీల్ టాప్ లూజర్...
తాజా మార్కెట్ పతనంలో మెటల్, రియల్టీ షేర్లు తీవ్ర నష్టాల పాలయ్యాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టాటా స్టీల్ 5.3 శాతం క్షీణించి రూ. 373 వద్ద ముగిసింది. క్షీణించిన సెన్సెక్స్ షేర్లలో అదాని పోర్ట్స్ (4.3 శాతం), ఎస్‌బీఐ (4.28 శాతం), ఎల్ అండ్ టీ (3.68 శాతం), ఎన్‌టీపీసీ (3.56 శాతం), యాక్సిస్ బ్యాంక్ (3.42 శాతం), టాటా మోటార్స్ (3.29 శాతం), మహీంద్రా (3.06 శాతం)లు వున్నాయి. సెన్సెక్స్‌లో భాగంకాని మెటల్ షేర్లు వేదాంత 5 శాతం, హిందాల్కో 8% చొప్పున పడిపోయాయి. సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 4-5 శాతం మధ్య తగ్గాయి. రియల్టీ షేర్లు డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్ రియల్టీలు 7-10 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు ఐటీ షేరు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 1.74 శాతం ర్యాలీ జరపగా, టీసీఎస్, విప్రోలు స్వల్పంగా ఎగిసాయి.
ప్రపంచ మార్కెట్లదీ అదేబాట...
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 2%పైగా క్షీణించిన నేపథ్యంలో సోమవారం ఆసియా మార్కెట్లు అదేబాటన పయనించాయి. జపాన్ నికాయ్ సూచి 1.5% క్షీణించగా, హాంకాంగ్, సింగపూర్, చైనా, తైవాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సూచీలు 1.5-3.5% మధ్య క్షీణించాయి. యూరప్ సూచీలు 1-1.5% నష్టాలతో ముగిసాయి. తాజాగా అమెరికా సూచీలు క్షీణతతో మొదలైనప్పటికీ, టెక్నాలజీ షేర్ల ఊతంతో వెనువెంటనే లాభాల బాట పట్టాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా నాస్‌డాక్ ఇండెక్స్ 0.8% లాభంతో ట్రేడవుతుండగా, డోజోన్స్ 0.4%, ఎస్ అండ్ పీ-500 సూచి 0.5% చొప్పున పెరిగి ట్రేడవుతున్నాయి.
విదేశీ నిధులు తరలిపోతాయా?
సెప్టెంబర్ 20న జరగనున్న ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాల కారణంగా స్వల్పకాలికంగా విదేశీ ఇన్వెస్టర్లు కొంత మేర పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోవచ్చన్న భయాలు మార్కెట్లో ఏర్పడ్డాయని విశ్లేషకులు చెప్పారు. ఈ మధ్యకాలంలో భారత్ మార్కెట్ జోరుగా ర్యాలీ జరపడానికి గ్లోబల్ లిక్విడిటీయే కారణమని, వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నాయని ఇటీవల ఫెడ్ అధికారులు బహిరంగంగా ప్రకటించడం, ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నిరాకరించడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి లోనుచేశాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. దాంతో అంతర్జాతీయంగా బాండ్ల ధరల పతనం ఆరంభమయ్యిందని, ఫలితంగా స్టాక్ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయని ఆయన వివరించారు.