రూ. 31 వేల చేరువలో పసిడి
ముంబై: అమెరికా రిజర్వు, ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందో లేదో తెలియక సతమతమైన బులియన్ మార్కెట్ కు తీపి కబురు అందించింది. ఫెడ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఫెడరల్ రిజర్వు ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటనతో సానుకూలంగా స్పందించింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి మెరుపులు మెరిపిస్తోంది. బుధవారం నష్టాల్లోకదలాడిన పుత్తడి ధరలు ఫెడ్ ప్రకటనలతో పరుగులు పెడుతూ భారీ లాభాలతో దూసుకుపోతోంది. దాదాపు 500 రూ. కు పైగా లాభపడింది. ప్రస్తుతం 526 రూపాయల లాభంతో 30,970 దగ్గర ట్రేడవుతూ 31 వేల మార్క్ కు చేరువలో ఉంది. అటు డాలర్ తో పోలిస్తూ భారత కరెన్సీ రూపాయి 2 పైసలు బలపడింది. ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే అమెరికా కరెన్సీ బలహీనపడి నేల చూపులు చూస్తూ వుండడంతో రూపాయి క్రమేపీ బలపడుతోంది.
కాగా ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగుతున్నప్పటికీ, ఉద్యోగాల వృద్ధి తక్కువగా నమోదైందని ఫెడ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినట్టు తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పాలసీ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని ఫెడ్ గవర్నర్ జానెట్ యెల్లెన్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్లో కొనసాగడమా..వైదొలగడమా.. అనే నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.అయితే వడ్డీ రేట్ల పెంపు ఎపుడు ఉంటుందున్నది పేర్కొనలేదు.