
అమెరికా ‘ఫెడ్’ వడ్డీరేట్లు యథాతథం
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.75 – 0.1 శాతం శ్రేణిలో ఉంది. రెండు రోజుల పాటు సమావేశమైన అమెరికా, ప్రపంచ ఆర్థిక అంశాలు, పరిణామాలను చర్చించిన జానెట్ యెలెన్ నేతృత్వంలోని ఫెడ్, ప్రస్తుతానికి రేటు పెంపు నిర్ణయాన్ని పక్కనబెట్టాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.
మార్చి నెల సమావేశంలో ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెరిగిన సంగతి తెలిసిందే. క్రమేపీ రేట్లు పెంచే ప్రక్రియను కొనసాగిస్తామని తాజాగా ఫెడ్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. దేశంలో ఉపాధి కల్పన పటిష్టంగా వుందని, ఆర్థికాభివృద్ధి ఓ మోస్తరుగా వుండవచ్చని ఫెడ్ పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మందగమనం తాత్కాలికమేనని కూడా ఫెడ్ తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్‌లో రేట్ల పెంపు నిర్ణయం ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.