
మార్కెట్లపై ఆ మూడింటి ప్రభావం !
- ఫెడ్ రేట్ల పెంపు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, బిహార్ ఎన్నికలు
- బీఓఎఫ్‌ఏ-ఎంఎల్ తాజా నివేదిక
న్యూఢిల్లీ: ఫెడ్ రేట్ల పెంపు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, బిహార్ ఎన్నికలు భారత మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) తాజా నివేదిక పేర్కొంది. వచ్చే నెల 17న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే అది భారత్‌కు ప్రయోజనకరమేనని. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీకి సూచనగా ఫెడ్ రేట్ల పెంపును పరిగణించాలని వివరించింది. అమెరికా వృద్ధి ఎగుమతులకు ఊతం ఇస్తుందని, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు నియంత్రణలో ఉంటాయని, రూపాయి బలపడటానికి తోడ్పడుతుందని పేర్కొంది.
ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపును మార్కెట్ స్వీకరిస్తే, వచ్చే నెల 29న తన పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించడానికి మార్గం సుగమమవుతుందని వివరించింది. ఒక వేళ ఫెడ్ వడ్డీరేట్లను పెంచకపోతే, ద్రవ్యోల్బణ ఒత్తిడులు కారణంగా డిసెంబర్‌లోపే ఆర్‌బీఐ పాలసీ రేట్లను తగ్గించవచ్చని పేర్కొంది. కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు విదేశీ నిధుల ప్రవాహం భారత్‌లోకి రావడానికి తోడ్పడుతాయ ని, బిహార్ ఎన్నికల ఫలితాలు సంస్కరణల వేగం పై ప్రభావం చూపుతాయని నివేదిక పేర్కొంది.
సెన్సెక్స్ 517 పాయింట్లు అప్
- 2 శాతం పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీలు
- ప్రభావం చూపిన షార్ట్ కవరింగ్
- అమెరికా వడ్డీరేట్ల పెంపు లేదనే సంకేతాలు కూడా...
- 517 పాయింట్ల లాభంతో 26,231కు సెన్సెక్స్
- 157 పాయింట్ల లాభంతో 7,949కు నిఫ్టీ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబరులో వడ్డీ రేట్లు పెంచకపోవచ్చన్న వార్తలకు... ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు తోడయింది. ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టులకు గురువారం చివరిరోజు కావటంతో ట్రేడర్లంతా భారీ ఎత్తున షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకునే పనిలో పడ్డారు. ఫలితం... సెన్సెక్స్ రయ్యిమంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఇన్ఫోసిస్ వంటి అధిక వెయిటేజీ ఉన్న షేర్లలో కొనుగోళ్లు జరగటంతో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2 శాతం పెరిగి... సెన్సెక్స్ 26,000 పాయింట్లను, నిఫ్టీ 7,900 పాయింట్లను అధిగమించాయి. చివరికి సెన్సెక్స్ 517 పాయింట్ల లాభంతో 26,231 పాయింట్ల వద్ద... నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 7,949 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక్క సెషన్లో సెన్సెక్స్ ఈ స్థాయిలో లాభపడటం గడిచిన రెండు వారాల్లో ఇదే తొలిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఈ రికవరీ ర్యాలీకి కన్సూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, ఫార్మా రంగాల్లోని బ్లూ చిప్ షేర్ల మద్దతు లభించింది.
రేట్ల పెంపు ఇప్పుడే కాదు...
బుధవారం అమెరికా స్టాక్ సూచీలు దాదాపు 4 శాతం పెరిగాయి. ఈ స్థాయిలో సూచీలు పెరగటం గడిచిన నాలుగేళ్లలో ఇదే ప్రథమం. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రెసిడెంట్ విలియం డడ్లీ సెప్టెంబర్‌లో వడ్డీరేట్ల పెంపు లేదని సూచనప్రాయంగా వెల్లడించడమే దీనికి కారణం. ముడి చమురు ధరలు తగ్గుతుండడం, చైనా భయాలు కొనసాగుతుండడం వంటి అంశాల నేపథ్యంలో రేట్ల కోత ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో చైనా భయాలు వెనక్కివెళ్లిపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 26,303 గరిష్ట స్థాయిని తాకింది.
‘స్మార్ట్’ కంపెనీలకు లాభాలు...
స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద 98 నగరాల పేర్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించడంతో వీటితో సంబంధం ఉన్న ఎన్‌బీసీసీ, డి లింక్, స్మార్ట్ లింక్ నెట్‌వర్క్, హెచ్‌సీసీ, హెచ్‌డీఐఎల్ షేర్లు 2-9 శాతం రేంజ్‌లో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో కెయిర్న్ ఇండియా 7.6 శాతం ఎగసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 21 షేర్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ షేర్లలో హెచ్‌డీఎఫ్‌సీ అత్యధికంగా లాభపడింది.
నెల రోజుల్లో 19 శాతం పతనం కావడం, స్టాండర్డ్ లైఫ్ పీఎల్‌సీతో జీవిత బీమా జాయింట్ వెంచర్‌ను నిర్వహిస్తున్న కంపెనీ అనుబంధ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు రానున్నదన్న కారణాల వల్ల హెచ్‌డీఎఫ్‌సీ 8.4 శాతం లాభంతో రూ.1,195 వద్ద ముగిసింది. వేదాంత, టాటా స్టీల్, లుపిన్, సిప్లా, ఐటీసీ, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ షేర్లు 2.6-6.6 శాతం రేంజ్‌లో పెరిగాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 6 శాతం పెరిగింది. వాహన షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఆటో 2.4 శాతం క్షీణించగా, టాటా మోటార్స్, హీరోమోటొకార్ప్, మారుతీ సుజుకీ కూడా నష్టపోయాయి.
కొనసాగుతున్న విదేశీ విక్రయాలు...
వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్‌లోనూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) అమ్మకాలను కొనసాగించారు. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. కాగా టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,015 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.26,117 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.5,33,805 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,347 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.2,577 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఐదు రోజుల చైనా షాంఘై స్టాక్ సూచీ నష్టాలకు బ్రేక్ పడింది. ఈ సూచీ 5% పెరిగింది. అన్ని ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ఆసియా మార్కెట్ల దన్నుతో యూరప్ మార్కెట్లు భారీ లాభాల్లోనే ముగిశాయి. అమెరికా స్టాక్ సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.
అధ్వాన సిరీస్...
గురువారంతో ముగిసిన ఆగస్టు సిరీస్ గత రెండేళ్లలో అత్యంత అధ్వానమైనదని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఆగస్టు సిరీస్‌లో నిఫ్టీ 5.3 శాతం, సెన్సెక్స్ 5.6 శాతం, బ్యాంక్ నిఫ్టీ 6.6 శాతం, సీఎన్‌ఎక్స్ మిడ్‌క్యాప్ 3.4 శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ 6.3 శాతం చొప్పున నష్టపోయాయి. షార్ట్ కవరింగ్ కారణంగా రోల్‌ఓవర్లు పెరిగాయని, సెప్టెంబర్‌లో మరో భారీ పతనం ఉందనడానికి ఇదొక సూచిక అని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.