మార్కెట్ పంచాంగం
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు ప్రతి నెల బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవహింపజేసే నిధుల్ని (ఉద్దీపన ప్యాకేజీ) నిలిపివేయనున్నట్లు 2013 ప్రథమార్థంలో సంకేతాలు ఇచ్చింది. అప్పట్లో ఈ సంకేతాలకు ప్రపంచ స్టాక్ మార్కెట్లన్ని కొద్ది వారాలు పాటు క్షీణించాయి. దాదాపు అదే తరహాలో ఇప్పటి డౌన్‌ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సెప్టెంబర్ 17 నాటి ఫెడ్ సమావేశంలో వ డ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చనే భయాలతో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు పడుతున్నాయి. ఒకరకంగా ఇది ఫెడ్‌కు మార్కెట్ శక్తుల బెదిరింపు అస్త్రం కావచ్చు. 2013లో డౌన్‌ట్రెండ్ దెబ్బకు ఉద్దీపన ప్యాకేజ్ ఉపసంహరణను కొద్ది నెలలపాటు ఫెడ్ వాయిదా వేసింది. ఈ దఫా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయించేందుకే ఇప్పటి ఈక్విటీల పతనమన్న విశ్లేషణలను అత్యధిక మార్కెట్ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. ఇక భారత్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 4.5 శాతం నష్టపోయి 25,202 వద్ద ముగిసింది. ఈ క్రమంలో గత మార్కెట్ పంచాంగంలో దీర్ఘకాలిక మద్దతుగా ప్రస్తావించిన 25,300 పాయింట్ల స్థాయి దిగువున ముగిసింది. గతేడాది ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన రోజైన మే 16 నాటి గరిష్ట స్థాయే ఈ 25,300 పాయింట్ల స్థాయి. రానున్న రోజుల్లో సెన్సెక్స్ మరింత పతనమైన తిరిగి వేగంగా ఈ స్థాయి పైకి వచ్చి స్థిరపడగలిగితే కొద్ది వారాల్లో అప్‌ట్రెండ్‌లోకి మళ్లే వీలుంటుంది. లేకపోతే కొద్ది నెలలపాటు మార్కెట్ బేర్ కక్ష్యలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 24,745 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,420-24,160 పాయింట్ల శ్రేణి వద్దకు పతనం కావచ్చు. ప్రస్తుత స్థాయి నుంచి లేదా పైన ప్రస్తావించిన తొలి మద్దతు నుంచి సెన్సెక్స్ కోలుకుంటే 25,550 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 25,840 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. అటుపైన 26,140 పాయింట్ల వరకు ర్యాలీ జరిపే అవకాశం ఉంటుంది.
నిఫ్టీ మద్దతు 7,563-నిరోధం 7,750
క్రితం వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 347 పాయింట్ల నష్టంతో 7,655 పాయింట్ల వద్ద ముగిసింది. 2014 మే 16 నాటి గరిష్ట స్థాయిని సెన్సెక్స్ కోల్పోయినా, నిఫ్టీ ఇంకా ఆ స్థాయిని (7,563 పాయింట్లు) పరీక్షించలేదు. ఈ కారణంగా నిఫ్టీకి ఇదే తక్షణ మద్దతు స్థాయి. ఈ మద్దతును కోల్పోతే 7,380 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈలోపున 7,200-7,118 పాయింట్ల మద్దతు శ్రేణికి పతనం కావచ్చు. ఈ వారం తొలి రెండు మద్దతు స్థాయిల్లో ఏదోఒక స్థాయి నుంచి నిఫ్టీ పెరిగితే 7,750 పాయింట్ల నిరోధ స్థాయిని చేరవచ్చు. ఈ స్థాయిని అధిగమించి స్థిరపడితే 7,845 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన ముగిస్తే 7,930 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చు.
సెన్సెక్స్ కీలక స్థాయి 25,300 పాయింట్లు
Published Mon, Sep 7 2015 1:25 AM | Last Updated on Mon, Oct 1 2018 5:28 PM
Advertisement
Advertisement