ఫెడ్ రేట్ల పెంపు భయాలు.. 224 పాయింట్లు డౌన్
ముంబై : అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలు కారణంగా గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 224 పాయింట్లు పతనమయ్యింది. గత రెండు వారాల్లో ఇదే పెద్ద క్షీణత. శుక్రవారం రాత్రి అమెరికాలో బ్యాంకర్ల సమావేశంలో అమెరికా ఫెడ్ ఛైర్‌పర్సన్ జానెట్ యెలెన్ కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లలో రేట్లు పెంచవచ్చన్న సంకేతాల్ని ఈ సందర్భంగా యెలెన్ ఇస్తారన్న అంచనాలు ఇన్వెస్టర్లలో వున్నాయి. దాంతో ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌ను అనుసరించి భారత్ మార్కెట్ కూడా తగ్గింది. సెన్సెక్స్ 224 పాయింట్ల క్షీణతతో 27,836 పాయింట్ల వద్ద ముగిసింది.
ఆగస్టు డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కూడా ప్రభావం చూపింది. ఇన్వెస్టర్లు వారి డెరివేటివ్ పొజిషన్లను సెప్టెంబర్ నెలకు రోలోవర్ చేయడానికి బదులు స్క్వేర్‌అప్ చేయడానికే మొగ్గుచూపారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దాంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,600 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈ సూచి 58 పాయింట్ల నష్టంతో 8,592 పాయింట్ల వద్ద క్లోజ య్యింది. ఆగస్టు సిరీస్‌లో నిఫ్టీ 74 పాయింట్లు, సెన్సెక్స్ 373 పాయింట్ల మేర తగ్గాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. కొద్ది వారాలు పరిమితశ్రేణిలో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని, వడ్డీ రేట్ల అంశంపై ఫెడ్ అభిప్రాయాలు వెల్లడయ్యాక మార్కెట్ ఏదో ఒకదిశగా పయనిస్తుందని ఆయన వివరించారు.
ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాలు...
ఐటీ, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్ షేర్లు స్వల్పంగా తగ్గాయి. సెన్సెక్స్-30 షేర్లలో 25 షేర్లు క్షీణించగా, అన్నింటికంటే ఎక్కువగా ఆదాని పోర్ట్స్ 3 శాతం తగ్గింది. విప్రో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్‌లు 2-3 శాతం మధ్య, హెచ్‌డీఎఫ్‌సీ, భారతి ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎంలు 1-2 శాతం మధ్య క్షీణించాయి. అయితే గెయిల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లాబ్‌లు స్వల్ప లాభాలతో ముగిసాయి.