
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్– తన ఫెడ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 12.30 నిముషాలకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ఫెడ్ రేటు 1.25%–1.50% శ్రేణికి మారింది. దీనితో గృహాల నుంచి కార్ల వరకూ రుణ రేటు పావుశాతం పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికా వృద్ధి తీరు, ఉపాధి అవకాశాలు బాగుండడంతో అమెరికా క్రమంగా ఆర్థిక సంక్షోభంనాటి ఉద్దీపన చర్యలను వెనక్కు తీసుకోడానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
2017లో ఫెడ్ రేటు 3 దఫాలుగా ముప్పావు శాతం పెరిగింది. వచ్చే ఏడాదీ మూడు దఫాలుగా రేటు పెరిగే అవకాశంఉందన్న అంచనాలు ఉన్నా, ఇంత దూకుడు నిర్ణయాలు ఉండకపోవచ్చని ఫెడ్ తాజాగా సూచించడం గమనార్హం. ఉపాధి మెరుగుపడుతున్నా, ద్రవ్యోల్బణం అనుకున్నంతగా పెరక్కపోవడం పట్ల విధాన నిర్ణేతల్లో ఇరువురు అనుమానాలు వ్యక్తం చేశారు. డిమాండ్ బలహీనతకు అద్దం పడుతోందని భావించి.. రేట్ల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు చేశారు. రేటు పెంపునకు వ్యతిరేకత వ్యక్తం చేసిన వారు ఒకటికన్నా ఎక్కువ ఉండడం 2016 నవంబర్ తరువాత ఇదే తొలిసారి. కాగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ యథాతథ రేటు విధానాన్ని అనుసరిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment