గతమంతా రాజ్‌భవన్‌ గండాలే! | Criticisms On Governors Decisions In India | Sakshi
Sakshi News home page

గతమంతా రాజ్‌భవన్‌ గండాలే!

Published Tue, May 22 2018 1:33 AM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM

Criticisms On Governors Decisions In India - Sakshi

రెండో మాట

ఫెడరల్‌ దృక్పథం దేశంలో సర్వత్రా వికసించకుండా చేసేందుకు భారత ‘ఫెడరేషన్‌’ దృక్పథాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాల ప్రత్యేక ఉనికికి గుర్తింపు లేకుండా చేశారు పాలకులు. ఇందులో భాగమే ఉత్తర–దక్షిణ భారతాలను వేర్వేరుగా చీల్చే ప్రయత్నాలూ మొగ్గ తొడుగుతున్నాయి. ‘బొంక నేర్చినవాడు వంకలూ నేరుస్తాడన్న’ట్టు ‘ఉత్తరాదిని చేజిక్కించుకున్నాం, దక్షిణాది రాష్ట్రాలను చేజిక్కించుకోవాల’ని ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్‌ షాలు యూపీ ఎన్నికల తర్వాత కొత్త నినాదాన్ని ‘మౌర్య సామ్రాజ్య విస్తరణ’ కాంక్షతో వ్యాప్తిలోకి తెచ్చారు. మరో వైపున దళితులు, మైనారిటీలపైన దాడులు చేయడానికి వెనుకాడటం లేదు.

‘రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో గవర్నర్‌ అనే వ్యక్తి రాజ్యాంగ చట్టాన్ని అమలు చేయడంలో కీలక ఇరుసు వంటివాడు. కనుకనే అతని పాత్ర కేంద్ర–రాష్ట్ర సంబంధాలలో ఒక కీలక సమస్యగా మారింది. తరచుగా అతడిని యూనియన్‌ ప్రభుత్వం తన సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నందుకు, అందుకు తగినట్టుగానే గవర్నర్‌లో నిష్పాక్షికత, వివేకం లోపించబట్టే విమర్శలకు గురి కావలసి వస్తున్నది.’ – సర్కారియా కమిషన్‌ నివేదిక (1988)

‘చివరికి గవర్నర్ల నియామకాలకు, వారి ఉద్వాసనలకు రాష్ట్రపతికి ఉన్న అధికారం సహితం కేంద్ర–రాష్ట్రాలను బంధించే సమాఖ్య స్ఫూర్తి సూత్రీకరణ నుంచి కూడా దూరంగా జరిగిపోయింది. క్రమంగా గవర్నర్లు రాజకీయ పక్షపాతానికి లోనై కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారేగానీ స్వతంత్ర రాజ్యాంగ కార్యాలయ నిర్వాహకులుగా వ్యవహరిం చలేకపోతున్నారు.’ – ఎల్‌.పి. సింగ్‌ (కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, మణిపూర్‌ మాజీ గవర్నర్‌)

గవర్నర్ల వ్యవస్థ 1988 నాటికే తీవ్ర విమర్శల పాలైంది. ఆ వ్యవస్థ రాజ్యాంగ నిబంధనలకూ, పరిధికీ తూట్లు పొడిచిన మాట వాస్తవమని ముప్పయ్‌ ఏళ్ల నాడే సర్కారియా కమిషన్‌ బాహాటంగా చెప్పింది. ఫెడరల్‌ రాజ్యాంగ స్ఫూర్తిని గవర్నర్లు యథేచ్ఛగా ఉల్లంఘించారని పరిపాలనా సంస్కరణల కమిషన్‌ (ఎంఆర్‌సీ) కూడా వెల్లడించింది. అయినా రాజకీయ పార్టీలు, గవర్నర్ల పాత్రలో ఆవగింజంత మార్పు కూడా రాలేదు. ఈ విషయం ఇటీవల కర్ణాటకలో ఆ రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌ వాలా ద్వారా తాజాగా నిరూపితమైంది. సర్కారియా కమిషన్‌ విధించిన మూడు షరతులలో ఏ ఒక్కటీ ఆ రాష్ట్ర గవర్నర్‌ సంతృప్తికరంగా పాటించలేదు. పైగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీని సాధించడంలో విఫలమైన బీజేపీకి పట్టం కట్టేందుకు ఆయన నడుం కట్టారు. నిజానికి బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సొంత పార్టీ వారినే గవర్నర్లుగా నియమిస్తున్నది. ఈ సంప్రదాయంలో బీజేపీ కూడా కాంగ్రెస్‌ కంటే తక్కువ తినలేదు.

ఈ బాగోతం ఇప్పటిది కాదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆరంభమైన పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది : ‘సంప్రదాయం వేరు, చట్టం వేరు’ అని. నిజానికి ఈ వేళ కాదు. ఈ దురవస్థను సర్కారియా కమిషన్‌ వెల్లడించడానికి ముందే కొన్ని దుష్ట సంప్రదాయాలు ప్రవేశించాయి. అప్పటికి మరో 32 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే, అంటే స్వాతంత్య్రం లభించిన తొలినాళ్ల చరిత్రను గమనిస్తే కళ్లు చెదురుతాయి. మరోమాటలో చెప్పాలంటే స్వాతంత్య్రం వచ్చిన తరువాత కేవలం ఐదేళ్లకే (1952) మన రిపబ్లిక్‌ కొత్త రాజ్యాంగానికి తొలిసారి తూటు పడింది. అదికూడా భారీగానే పడిందని మరచిపోరాదు. అది ఫెడరల్‌ (రాష్ట్రాల సమాఖ్య భారతం) రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించిన సంవత్సరం. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఆచరణకు నాటి పాలక పక్షం కాంగ్రెస్‌ తొలిసారి పాల్పడింది. అది తొలి జనరల్‌ ఎన్నికలలోనే అని గమనించాలి.

ఉమ్మడి మద్రాసు శాసనసభకు జరిగిన ఆ ఎన్నికలలో మొత్తం 375 స్థానాలలో కాంగ్రెస్‌ 152 చోట్ల విజయం సాధించింది. టంగుటూరి ప్రకాశం నాయకత్వంలోని ఐక్య సంఘటన కాంగ్రెస్‌ పార్టీ కన్నా 14 స్థానాలు అధికంగా గెలుచుకుంది. కానీ నిన్నటి కర్ణాటక నాటకంలో మాదిరిగానే 152 స్థానాలు గెలిచిన తనకే ప్రభుత్వ ఏర్పాటు హక్కు ఉందని మొండి పట్టు పట్టింది. యునైటెడ్‌ ఫ్రంట్‌ పేరుతో ఎక్కువ స్థానాలు గెలిచిన ప్రకాశం కూటమికి అవకాశం లేకుండా చేశారు. నాటి మద్రాసు గవర్నర్‌ శ్రీప్రకాశ్‌ సాయంతో రాజాజీని దొడ్డిదారిన కౌన్సిల్‌ సభ్యుడిని చేసి, కాంగ్రెస్‌ శాసన సభాపక్షానికి నాయకుడిగా ప్రకటించారు. ఇంకా, ప్రతిపక్షంలోని పదహారు మంది విభీషణ సంతతి చేత ప్లేటు ఫిరాయించేటట్టు చేశారు. ఆ ప్రకారం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ రాజాజీని ప్రతిష్టించింది. స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్లకు కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజల సాక్షిగా చేసిన నిర్వాకమిది. రుచిమరిగిన పిల్లి ఉట్టి మీదకి ఎగ బాకినట్టు అది మొదలు ప్రతిపక్షాలు ఐక్య ఘటన ద్వారా అధికారంలోకి వచ్చినా కుట్రలు, కూహకాలతో పడగొట్టే దాకా నిద్రపోని ఒక లక్షణం కాంగ్రెస్‌ పట్టుకుంది. అసలే బ్రిటిష్‌ పాలన అవశేషంగా వచ్చిన గవర్నర్‌ వ్యవస్థను కాంగ్రెస్‌ క్రమంగా కుమ్మరి పురుగులా తొలిచేసింది.

ఇదే సంప్రదాయాన్ని మతోన్మాద రాజకీయాలు తప్ప మరొక వ్యాపకం లేని బీజేపీ–ఆరెస్సెస్‌ కూటమి పాలక పక్షాలు కొనసాగిస్తున్నాయి. కానీ ఈ అనుభవంతో ఒకటి రుజువైంది. ఇటీవల కేంద్ర పాలక పక్షం బీజేపీ అనేక విషయాలలో నర్మగర్భంగా పెడుతున్న ఆరళ్లకూ, సన్నాయి నొక్కుళ్లకు సుప్రీంకోర్టుపై ఇబ్బందుల పాలవుతున్నా న్యాయవ్యవస్థ చైతన్యం ‘కొడిగట్టిపోలేద’ని ఒక మేరకు రుజువయింది. కానీ సుప్రీంకోర్టు భావిస్తున్నట్లు ‘సంప్రదాయం వేరు, చట్టం వేరు’ అన్న వాస్తవాన్ని చెరిపేయటంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తేడా లేదని గమనించాలి. పాలక విధానాల ఫలితంగా దారి తప్పిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ (ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, దళిత, మైనారిటీల హక్కుల రక్షణ, లౌకిక జనతంత్ర రిపబ్లిక్‌ రక్షణ హామీలు, సమాచార హక్కు చట్టం వగైరా) ‘గుంటపూలు పూసే’ స్థితికి చేరుకున్నాయి.

రాజ్యాంగం మీద నిరంతర దాడి
రాజ్యాంగం ప్రజలకు హామీ పడిన హక్కుల పరిరక్షణ కోర్టుల బాధ్యత. వాటిని ఆచరణలో ప్రజల అనుభవంలోకి తీసుకురావడానికి బీజేపీ పాలకుల నుంచి పౌర సమాజం ఎదుర్కొంటున్న ప్రత్యక్ష పరోక్ష దాడులను కట్టడి చేసే బాధ్యత మరొకటి. అన్నింటికీ మించి, రాజ్యాంగాన్ని మరింత మెరుగు పరిచేందుకు రావలసిన మార్పులకు శ్రీకారం చుట్టగల ప్రజాహిత సవరణ అవసరం ఎంతో ఉండగా, ఆ ప్రయత్నాన్ని వదిలి పాలక శక్తులు ప్రజాస్వామిక సెక్యులర్‌ రాజ్యాంగం స్థానంలో ఏకమతాభినివేశ రాజ్యాంగ వ్యవస్థ నిర్మాణానికి పునాదులు వేసే ప్రయత్నంలో ఉన్నారు. సచేతనమైన, ప్రజాహితమైన తీర్పుల ద్వారా న్యాయస్థానాల ధర్మాసన చైతన్యం దేశ ప్రజలకు ప్రస్ఫుటం కాకుండా కేంద్ర పాలకులు ‘పుల్లలు’ పెడుతున్నారు. ప్రభుత్వాల, శాసన వేదికల నిర్ణయాలను పరిశీలించి, భాష్యం చెప్పి, తన తీర్పుల ద్వారా విధానంలో మార్పులకు దోహదం చేయగల హక్కును న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడా హక్కును కూడా కాలదన్నే ప్రయత్నంలో పాలకులున్నారు. చివరికి న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాల్ని కూడా శాసించజూచే ‘పిదప బుద్ధులకు’ పాలకులు అలవాటు పడుతున్నారు. తమ విచక్షణాధికారాలను చలాయించేందుకు గవర్నర్లకు ఉన్న అధికారాన్ని అదుపు చేస్తూ సుప్రీం 2016లోనే ఒక తీర్పు ఇచ్చింది. గవర్నర్ల నిర్ణయాలు నిరంకుశంగానో లేదా తమకు తోచినట్లుగానో ఉండకూడదని శాసించింది. రాజ్య వ్యవహారాల్లో, పాలనా బాధ్యతల నిర్వహణలో గవర్నర్లు ‘ఇష్టారాజ్యం’గా వ్యవహరించరాదని తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ ‘కరస్పాండెన్స్‌’లో సంకలనకర్త వాల్మీకి చౌదరి పేర్కొన్నారు. ఈ ‘ఇష్టారాజ్య’ ప్రవర్తనకు మూల కారణం గవర్నర్లను కేంద్ర పాలకులు రాజకీయ ప్రయోజనాలకు ‘పార్టీ పావు’ లుగా వాడుకోవడం. అందుకనే కశ్మీర్, గుజరాత్‌ మాజీ గవర్నర్‌ బి.కె. నెహ్రూ గవర్నర్లను ‘పాలక పార్టీలో శక్తులుడిగిపోయి చేవ చచ్చిన వ్యక్తులకు గవర్నర్‌ పోస్టు లివ్వడం ఖుషీలోక బాంధవుల్నిగా చూడటమే అవుతుంద’ని అన్నాడు. అలాగే, ఒకసారి కాదు, అనేకసార్లు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ ఏజెం ట్లుగా వ్యవహరించేటట్లు చేశార’ని ‘నిపుణుల బెంగాల్‌ సదస్సు’ వాపోయింది (1983 సెమినార్‌ ప్రత్యేక సంచిక, పే.400).

విస్తరణ కాంక్ష
గవర్నర్ల పదవులకు పాలకపక్షం తమ సభ్యుల్నే ఎంపిక చేయడం కాదు. అలాగే గవర్నర్లు రాజ్యాంగ అవసరాలకు అనుగుణంగా నడుచుకోగలిగిన రాజ్యాంగాధినేతలుగా క్రమశిక్షణతో మెలగాలి. అప్పుడే కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పరం సహకారం స్థిరపడుతుందని ప్రసిద్ధ రాజ్యాంగ నిపుణుడు గ్రాన్‌ విల్లీ ఆస్టిన్‌ ‘భారత ప్రజాస్వామిక రాజ్యాంగం పనితీరు’ అనే గ్రంథంలో రాశాడు. ఇందుకు ఫెడరల్‌ సంబంధాలు అనివార్యంగా సుస్థిరం కావలసిందేనన్నాడు (‘వర్కింగ్‌ ఎ డెమోక్రటిక్‌ కాన్సిట్యూషన్‌: ది ఇండియన్‌ ఎక్స్‌పీరియన్స్‌’). కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 1991లోనే దేశాన్ని ‘భారత సంయుక్త రాష్ట్రాలు’గా ప్రకటించాలని కోరాడు. ఫెడరల్‌ (సమాఖ్య) దృక్పథం దేశంలో సర్వత్రా వికసించకుండా చేసేం దుకు భారత ‘ఫెడరేషన్‌’ దృక్పథాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాల ప్రత్యేక ఉనికికి గుర్తింపు లేకుండా చేశారు పాలకులు. ఇందులో భాగమే ఉత్తర–దక్షిణ భారతాలను వేర్వేరుగా చీల్చే ప్రయత్నాలూ మొగ్గ తొడుగుతున్నాయి. ‘బొంక నేర్చినవాడు వంకలూ నేరుస్తాడన్న’ట్టు ‘ఉత్తరాదిని చేజిక్కించుకున్నాం, దక్షిణాది రాష్ట్రాలను చేజిక్కించుకోవాల’ని ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్‌ షాలు యూపీ ఎన్నికల తర్వాత కొత్త నినాదాన్ని ‘మౌర్య సామ్రాజ్య విస్తరణ’ కాంక్షతో వ్యాప్తిలోకి తెచ్చారు. మరో వైపున దళితులు, మైనారిటీలపైన దాడులు చేయడానికి వెనుకాడటం లేదు. ఇంతకూ ఉత్తరాదిపై కాంగ్రెస్‌కుగానీ, బీజేపీకిగానీ వల్లమాలిన ప్రేమకు కారణం ఏమై ఉంటుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం– ఇతర ఏ భారత రాష్ట్రానికీ కల్పించని 80 పార్లమెంటు (లోక్‌సభ) సీట్లు అనే ‘స్వీటు’. ఆ ఆధిపత్యంతోనే దక్షిణాదిపై సవారీ!!

-ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు(abkprasad2006@yahoo.co.in)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement