దశాబ్దాలుగా రాజ్యాంగ మౌలిక స్వరూపం చెదరకుండా ప్రజలు కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ‘ఒకే దేశం – ఒకే ప్రజ’ వంటి ఆకర్షణీయ నినాదాలతో దేశ సమాఖ్య తత్వాన్నీ, లౌకిక స్వభావాన్నీ దెబ్బతీసే ప్రతిపాదనలను కేంద్రపాలకులు ముందుకు తెస్తున్నారు. మెజారిటీ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ధోరణి పెరిగిపోతోంది. ఫలితంగా రాజకీయాలు నేరమయం, ధనమయం అయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ‘జమిలి ఎన్నికలు’ అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలనే ఆలోచన ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాదు. దీనివల్ల రాజ్యాంగ పరమైన సమస్యలు తలెత్తుతాయి.
‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అన్న ఎజెండా ద్వారా, ‘ఒకే పన్ను, ఒకే రేషన్ కార్డు’ ఇత్యాది నినాదాలూ, విధానాల ద్వారా దేశంలో ఐక్యతను కాపాడగలమన్న సరికొత్త భావనను ప్రవేశపెట్టడానికి కేంద్ర పాలకులు ప్రయత్నిస్తు న్నారు. తద్వారా కేంద్ర పాలకులు తమ చేతుల్లో పరిపాలనా, రాజకీయ అధికారాన్ని బహుముఖంగా కేంద్రీకరించుకుని, రాష్ట్రాల అధికారాలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తతంగం 2014 నుంచే ప్రారంభమైందని మరవరాదు. ఈ తంతులో భాగంగానే పార్లమెంటును పాలకులు విస్పష్ట నిర్ణయాలు తీసుకోకుండా తటస్థపరిచారు. ఇక మీడియా దాదాపు పాలకుల సేవికగా మారింది. న్యాయ వ్యవస్థను చాలావరకు మెడలు వంచారు, పౌర సమాజాన్ని నిర్వీర్యపరిచారు.’’
– సీనియర్ జర్నలిస్టు సి. రాం మనోహర్ రెడ్డి (11.9.2023)
దేశ తొలి అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్, ఆయన ఆధ్వర్యంలో నియమితులైన నాటి రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరించిన తీరుతో ఇటీవలి కాలంలో మన దేశ అధ్యక్షులు, గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుతెన్నులను పోల్చి చూస్తే రాజ్యాంగం ఏ విధంగా అతిక్రమణకు గురవుతోందో అర్థమవుతుంది. రాజ్యాంగ ప్రవేశికలో ‘భారత ప్రజలమైన మేము రూపొందించుకొని, అంకితమిచ్చుకున్న ప్రజా రాజ్యాంగం’ అని సగర్వంగా ప్రకటించుకున్న మనం ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘనలను చూసి తల దించుకోవలసి వస్తోంది.
ఆ తొల్లింటి రాజ్యాంగ హామీలు, ఇంకా ఇప్పుడు అమలు జరుగు తున్నా యనుకోవడం ప్రజల భ్రమ అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని, విధానాలను మనసారా అభిలషించి ‘దేశంలో కొలది మంది మోతుబరుల చేతుల్లో దేశ సంపద, అధికారాలు కేంద్రీకృతం కారాదని’ శాసించిన జాతిపిత గాంధీజీని ప్రేమించినట్టు నటించి ఆయనను హతమార్చినవాళ్లే గాంధీ బొమ్మలు పెట్టుకుని ఊరేగు తున్నారు.
దేశ స్వాతంత్య్ర తొలి సంవత్సరాల్లో కేంద్రంలోనూ, రాష్ట్రాల లోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేవారు. కానీ 1960లలో కేంద్ర (కాంగ్రెస్) పాలకులు రాజ్యాంగంలోని 356వ నిబంధనను తమ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుని రాష్ట్రాలలో తమకు ఇష్టం లేని ప్రభుత్వాలను కూల్చడానికి జంకలేదు. శాసనసభ విశ్వాసాన్ని చూరగొన్న రాష్ట్ర ప్రభుత్వాలే పాలనలో ఉండాలి. ఆ విశ్వాసం సడలి నప్పుడు అవి దిగిపోయి, తిరిగి ప్రజల విశ్వాసం చూరగొనేందుకు ఎన్నికలకు వెళ్లాలి.
ఈ పద్ధతిని తారుమారు చేసి, కేంద్ర పాలనను (రాష్ట్రపతి పాలన) రుద్దడానికి పాలకులు అలవాటు పడటం ద్వారా అటు ఫెడరల్ వ్యవస్థ లక్ష్యాలనూ, ఇటు ప్రజాస్వామ్య విలువల్నీ ఏకకాలంలో ధ్వంసం చేయడానికి తెగబడ్డారు. అదే సమయంలో రాష్ట్రాలూ, కేంద్రానికీ ఎన్నికలు వేరు వేరు సమయాల్లో జరప వలసిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు కేంద్రం ‘జమిలి ఎన్నికలు’ అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలనే ఆలోచన ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదు. దీనివల్ల అనేక రాజ్యాంగ పరమైన సమస్యలు తలెత్తుతాయి.
తొలినాటి ప్రజాస్వామిక విలువలు మచ్చుకు కూడా కానరాకుండా పోవడం నేటి రాజకీయాల్లో మనం చూస్తున్న విషాదం. ఎవరు ఎంత డబ్బు ఖర్చుపెడితే అంతగా ఎన్నికల్లో గెలవవచ్చు అనే నమ్మికతో రాజకీయపార్టీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ధనవంతులూ, నేరప్రవృత్తి కలిగినవారూ రాజకీయాల్లో అత్యధికంగా పాల్గొనడం కళ్లెదుట కనిపిస్తున్న రాజకీయ చిత్రం. తాజా ఏడీఆర్ రిపోర్ట్‌ను గమనిస్తే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత ‘నిఖార్సు’గా పరిఢవిల్లుతోందో అర్థమవుతుంది.
రాజ్యాంగం ప్రకారం ఏమాత్రం మన రాజకీయపార్టీలు నడుచుకోవడం లేదనీ, అవి కేవలం ఏదో విధంగా అధికారంలోకి రావడానికే ప్రయత్నిస్తున్నాయనీ... పైకి మాత్రం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాజ్యాంగ సూత్రా లనూ, సమాఖ్య తత్వాన్నీ, లౌకికత్వాన్నీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అనేక ప్రతిపాదనలు బహిరంగంగానే ముందుకొస్తున్నాయి. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే వ్యక్తి పాలన’ అటువంటిదే.
చైతన్యశీలి, ప్రజాస్వామ్యవాది అయిన నేటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీ స్వీకారం చేసిన తర్వాత అడుగ డుగునా కేంద్ర పాలకుల దుందుడుకు విధానాలను వ్యతిరేకిస్తూండటంతో కొంతలో కొంత వారు దూకుడు తగ్గించుకుంటున్నారు. అయితే మళ్లీ అధికారం చేజిక్కించుకోవడానికి ఎప్పటిలాగే తమ పాత విధానాన్ని అనుసరించి కుల, మత, వర్గ సంఘర్షణలకు ప్రజల మధ్య ‘చిచ్చు’ రగిలిస్తున్నారు. ఇదేమాత్రం వారికి అమానవీయం అనీ, రాజ్యాంగ విరుద్ధమనీ అనిపించడంలేదు.
మెజారిటీ వాదాన్ని ముందుకు తెచ్చి తమ చర్యలను ప్రతిభావంతంగా సమర్థించుకుంటున్నారు. బహుశా అందుకే మహాకవి దాశరధి కృష్ణమాచార్యులు ఒక పాత్ర ద్వారా చెప్పించిన మాటలు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి:
‘నేను చేసిన పాపాలు అనేకమయినా, నా జిహ్వకు మాత్రం అవి పానకాలే!’ అందుకే, అలాంటి ‘పానకాల రాయుళ్ల’ను పాలకులుగా పెరగనివ్వకుండా ఉంచడానికే నేటి చైతన్యశీలమైన సుప్రీంకోర్టు విశ్వ ప్రయత్నం! దాని కృషికి చేదోడు వాదోడుగా నిలవడం – బాధ్యతగల భారత పౌర సమాజ ధర్మం!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment