
అభిప్రాయం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల ‘కంచ గచ్చి బౌలి’ భూమిని, రేవంత్ రెడ్డి సర్కార్ వేలానికి పెట్టింది. వేలం వద్దని విద్యార్థులు జేఏసీగా ఏర్పడి కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఉగాది పండగ రోజున ఆ ప్రాంతపు చెట్లను తొలగించి, మట్టిని చదును చేయడానికై 50 భారీ బుల్డోజర్లు, పొక్లైన్లతో, వందలాది మంది పోలీసులు ఆ భూమిలోకి వెళ్లారు. వాటిని అడ్డుకోవడానికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. జుట్టు పట్టి ఈడ్చి వాహనాల్లో పడేశారు. 200 మందిని, 4 పోలీస్ స్టేషన్లకు తరలించారు. చివరికి ఈ వ్యవహారం దేశ అత్యు న్నత న్యాయస్థానానికి చేరడంతో జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఆదేశాలు జారీ చేసింది.
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను 100 కోట్లకు ఎకరం అమ్మింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మకానికి పూనుకున్న కంచ గచ్చి బౌలి భూమి ఎకరాకు 100 కోట్ల పైమాటే. 400 ఎకరాలను వేలం వేస్తే 40 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం దృఢంగా భావించింది.
అందుకే ఆందోళన చేస్తున్న విద్యార్థులపై తీవ్ర హింసకు పూనుకుంది. తద్వారా ఎన్నికల ప్రణాళి కలో ఇచ్చిన 7వ హామీ ‘ప్రజాస్వామ్య హక్కుల రక్షణను పాతిపెట్టినట్లే’!
‘ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది మొత్తం బడా సంపన్నుల సమష్టి వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ మాత్రమే’ అని ఒక జర్మన్ తత్వ వేత్త అంటారు. అంటే సామాన్య మెజారిటీ ప్రజలు కేంద్రంగా ప్రభుత్వాలు పనిచేయవని ఉద్దేశం. హెచ్‌సీయూ భూములను అమ్ముతున్న తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ పరిశ్రమ లను అమ్ముతున్న మోదీ ప్రభుత్వ విధానాలకు పైవాక్యం సరిగ్గా సరిపోతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ లను కారు చౌకగా బడా పెట్టుబడిదారులకు అమ్ముతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూములను బడా కార్పొరేట్లకు అమ్మకానికి పూనుకుంది. ఇది ఈ దేశ విద్యార్థుల వైజ్ఞానిక భవిష్యత్తుకు విద్రోహం తలపెట్టడమే! ఉన్న ప్రభుత్వ వనరులను తెగనమ్మడానికి బదులు.... ప్రత్యామ్నాయంగా మోదీ–రేవంత్ బడా సంపన్నులపై ‘ప్రగతిశీల పన్ను’ ఎందుకు వేయకూడదు? అవినీతి సొమ్మును, లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రజల ప్రయోజనం కొరకు వెలికి తీసి, ఎందుకు వినియోగించకూడదు?
పాలకులు ప్రజల ఆస్తులు అమ్మడమే ఏకైక పనిగా సాగుతున్నారు. దశాబ్దాలుగా పథకం ప్రకారం విశ్వవిద్యాలయం భూములకు కోత విధిస్తున్నారు. కేసీఆర్... ప్రభుత్వ భూములను అమ్మితే దునుమాడిన రేవంత్ రెడ్డి... అదే పనికి ఇప్పుడు పూనుకున్నారు. ఈ చర్య అక్కడి జీవా వరణ – పర్యావరణ స్థితిని నాశనం చేస్తుంది.
హెచ్‌సీయూ వెల్లడించిన సమాచారం ప్రకారం 734 రకాల పూల మొక్కలు, 10 క్షీరద జాతులు, 15 రకాల సరీసృపాలు, నెమళ్లు లాంటి 220 రకాల పక్షులు, రెండు చెరువులు ఇక్కడ ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పోలి ఉండే ప్రకృతి సిద్ధమైన భారీ బండరాళ్ల అమరికలు ఈ 400 ఎకరాలలో ఉన్నాయి. ఈ ప్రకృతి వైవిధ్యాన్నీ, దేశ భవిష్యత్తునూ ప్రభుత్వం విధ్వంసం చేయతల పెట్టింది. విశ్వవిద్యాలయ భూమిలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని బుకాయిస్తోంది.
ఇటీవలే చైనాలో మన హెచ్‌సీయూ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులే ‘డీప్ సీక్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ను, అతి చౌకగా ఆవిష్కరించారు. అమెరికా టెక్ ఆధిపత్యాన్ని కూల్చారు. భూములను అమ్మడం కంటే, ప్రపంచ ప్రమాణా లతో కూడిన, ఆధునిక మానవ అవసరాలను నెరవేర్చే చదు వులు మరింత భారీ డబ్బును సమీకరిస్తాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల్లో నెలకొల్పుదామనే ప్రపంచ కంపెనీలు, ఈ విశ్వ విద్యాలయాల్లో చదివిన విద్యా ర్థులు సృష్టించే సంపద కంటే గొప్పవేం కాదు. ‘అక్కడ పులులు జింకలు లేవు. కొన్ని నక్కలు మాత్రమే అభివృద్ధిని అడ్డుకోవడానికి చూస్తున్నాయి. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చ గొడుతున్నాయ’ని ముఖ్య మంత్రి మాట్లాడడం అత్యంత దురదృష్టకరం. గురువారం (ఏప్రిల్ 3వ తేదీ) సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం అసలు అది అటవీ భూమికాద’ని బుకాయించడమూ తెలిసిందే.
ప్రభుత్వ విలువైన భూములను, సహజ వనరులను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ధారా దత్తం చేయకూడదని 2012 సెప్టెంబర్ 14న విడుదలైన జీఓఎమ్‌ఎస్ నం. 571 స్పష్టంగా చెబుతోంది. వనరుల సమీకరణ కొరకు ప్రభుత్వ భూములను అమ్మడం, వేలం వేయడం వల్ల భూమి తీవ్రంగా తగ్గిపోయి అన్యాక్రాంతమవు తుంది. దీనివల్ల సమాజ భవిష్యత్తు, ప్రజా ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఈ జీవో పేర్కొంటున్నది. ప్రభుత్వ భూముల వినియోగం, అత్యంత శాస్త్రీయంగా న్యాయబద్ధంగా ఉండాలని ఈ జీఓ చెబుతోంది. ప్రజల ప్రయోజనం కొరకే భూములను కేటాయించాలి.
ఆ భూమి వల్ల వచ్చే భవిష్యత్ ప్రయోజనాలన్నీ ప్రజలకే చెందాలి. ప్రజా ప్రయోజనాలకు ఇవ్వ వలసి వస్తే బంజరు భూములను, డ్రై ల్యాండ్స్‌ను మాత్రమే కేటాయించాలి. రెండు పంటలకు సాగు నీటి వసతి గల భూములను అసలు కేటాయించడానికి వీలు లేదు. పర్యావరణపరంగా సున్నితమైన భూములను, ట్యాంక్ బెడ్స్‌ను, రివర్ బెడ్స్‌ను, కొండలను, అడవులను ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు. ప్రభుత్వ భూము లను, నిధుల సమీకరణ కొరకు, ఎట్టి పరిస్థితులలో వేలం వేయరా దని ఈ జీఓ స్పష్టం చేస్తోంది.
హెచ్‌సీయూ భూమి పర్యావరణపరంగా సున్నితమైంది. హైదరాబాద్ మహానగరానికి ఊపిరితిత్తి లాంటిది. నీరు ఇంకడానికి భూగర్భ నీటిమట్టాన్ని పెంచడానికి ఇతోధికంగా తోడ్పడుతోంది. ఇంత విలువైన భూములను, ప్రైవేట్ బడా కంపెనీలకు ధారాదత్తం చేయడం భావ్యమా? ఈ సంగతులన్నింటినీ గ్రహించింది కాబట్టే సుప్రీం కోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది.
ఈ భూముల్లో ప్రభుత్వం ఎటువంటి కార్యకలాపాలనూ నిర్వహించకుండా స్టే విధించింది. ఈ నెల 16న తిరిగి ఈ కేసుపై వాదనలు వింటామనీ, అప్పటికి ఈ భూములపై సమగ్ర నివేదికను తయారుచేసి తమకు సమర్పించాలనీ ఆదేశించింది. ఈ ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని వేరే చెప్పనవసరం లేదు కదా!
నైనాల గోవర్ధన్
వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ ‘ 97013 81799