ఈ సుంకాలతో లాభనష్టాలు | US imposes 26 percent import duty on Indian exports | Sakshi
Sakshi News home page

ఈ సుంకాలతో లాభనష్టాలు

Published Sat, Apr 5 2025 3:38 AM | Last Updated on Sat, Apr 5 2025 3:38 AM

US imposes 26 percent import duty on Indian exports

భారత్‌ ఎగుమతులపై అమెరికా 26 శాతం దిగుమతి సుంకాన్ని విధించడం ఆర్థిక ఆందో ళనలకు దారి తీసింది. భారత్‌తో పోల్చిన ప్పుడు అధికంగా చైనాపై 40–60 శాతం (కొన్ని ఉత్పత్తులపై 100 శాతం వరకు), వియత్నాంపై 30–45 శాతం, థాయ్‌లాండ్‌పై 35–50 శాతం దిగుమతి సుంకాలను అమె రికా విధించింది. భారత్‌కన్నా తక్కువగా యూరోపియన్‌ యూనియన్‌పై 20 శాతం, జపాన్‌పై 24 శాతం, దక్షిణ కొరియాపై 25 శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధించింది.

అమెరికా వాదన
2024లో అమెరికాకు సంబంధించి భారత్‌ ఎగుమతుల విలువ 91.23 బిలియన్‌ డాలర్లు. భారత్‌ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా వాటా 18 శాతం. ఇదే సంవత్సరం అమెరికా ఉత్పత్తుల దిగుమతులలో భారత్‌ వాటా 2.6 శాతం. మొత్తంగా భారత్‌తో వాణి జ్యానికి సంబంధించి అమెరికా వాణిజ్య లోటు 2023–24లో 45.7 బిలియన్‌ డాలర్లు కాగా, 2024–25 (జనవరి వరకు) 22.9 బిలియన్‌ డాలర్లుగా నమోదయింది. 

అమెరికాకు సంబంధించిన పాసింజర్‌ వాహనాలపై 70 శాతం, యాపిల్స్‌పై 50 శాతం, ఆల్కహాల్‌పై 100 –150 శాతం దిగుమతి సుంకాలను భారత్‌ విధిస్తున్నప్పుడు, ప్రస్తుతం భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం సమంజసమేనని అమెరికా వాదిస్తున్నది. ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య నియమావళికి విరుద్ధంగా భారత్‌ వ్యవహరిస్తున్నదని అమెరికా భావిస్తున్నది.

దిగుమతి సుంకాల పెంపు కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50తో పాటు చైనా, థాయ్‌లాండ్‌కు సంబంధించిన ముఖ్య సూచీల లోనూ క్షీణత ఏర్పడింది. 2023–24లో అమెరికాతో వాణిజ్యంలో చైనా మార్కెట్‌ వాటా 21.6 శాతం కాగా, వియత్నాం వాటా 19.3 శాతంగా, భారత్‌ వాటా 6 శాతంగా నిలిచింది. వివిధ దేశాలపై అమె  రికా దిగుమతి సుంకాల పెంపు కారణంగా చైనా, వియత్నాంలతో పోల్చినప్పుడు భారత్‌ ఎగుమతులలో పోటీతత్వం పెరుగుతుందని భావించవచ్చు.

సగటు అమెరికా దిగుమతి సుంకాల కారణంగా– భారత్‌లో రొయ్యలు, వస్త్రాలు, స్టీల్‌ రంగాలపై; చైనాలో సోలార్‌ పానల్స్, సెమీ కండక్టర్, స్టీల్, ఎలక్ట్రిక్‌ వాహనాలపై; వియత్నాంలో ఫుట్‌వేర్, ఎల క్ట్రానిక్స్, ఫర్నీచర్‌పై; థాయ్‌లాండ్‌లో ఆటో పరికరాలు, రబ్బరు ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని అంచనా.

భారత్‌పై ప్రభావం
ప్రాథమిక కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్‌ పరిక రాలు, ఫార్మా ఉత్పత్తులు, విలువైన రాళ్ళు భారత్‌ నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మార్చి 2025లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకొనే చర్యలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై భారత్‌ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వలన రెండు దేశాలకు పరస్పర ప్రయోజనం చేకూరుతుంది. ఆసియా ఖండంలోని ఇతర దేశాలతో పోల్చినప్పుడు సౌరవిద్యుత్, ఫార్మాసూటికల్స్, టెక్స్‌టైల్స్‌ – అప్పారెల్‌  రంగాలలో భారత్‌కు అధిక ప్రయోజనం ఉంటుందని అంచనా. 

ప్రపంచవ్యాప్తంగా టెక్స్‌టైల్‌ – అప్పారెల్‌ రంగాలకు సంబంధించి పోటీ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దిగు మతి సుంకాల నిర్ణయం కారణంగా అమెరికా మార్కెట్‌లో ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్‌కు పోటీ తగ్గుతుంది. చైనాకుసంబంధించిన సౌర ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం కారణంగా చైనా సౌర ఉత్పత్తుల ధరలు పెరగడం వలన భారత్‌కు ప్రయోజనం చేకూరుతుంది. చైనాపై అమెరికా అధికంగా ఆధార పడటం తగ్గి భారత్‌ – అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠమయ్యే అవకాశం ఉంది.

భారత్‌ నుండి రొయ్యల ఎగుమతుల విలువ రూ. 22,000 కోట్లు కాగా, ఈ మొత్తంలో అమెరికా వాటా 44 శాతంగా ఉంది. ప్రస్తుతం అధిక సుంకాల కారణంగా భారత్‌ నుండి అమెరికా రొయ్యల ఎగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడవచ్చు. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులకు సంబంధించి అమెరికాలో భారత్‌ మార్కెట్‌ వాటా తగ్గుతుంది. వజ్రాలు, ఆభరణాల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. భారత్‌లో అనేక సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు హ్యాండిక్రాఫ్ట్‌ గార్మెంట్స్‌ ఎగుమ  తులపై అధికంగా ఆధారపడ్డాయి. అధిక సుంకాల నేపథ్యంలోఎం.ఎస్‌.ఎం.ఇ. సంస్థల ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గుతుంది. తద్వారా ఆ యా సంస్థలలో లే ఆఫ్‌ కారణంగా ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది.

సిద్ధించే ప్రయోజనాలు
అమెరికా దిగుమతి సుంకాలను ముఖ్యంగా వస్తువులపై విధించినందువలన భారత్‌లో పటిష్ఠంగా ఉన్న ఐటీ, సేవల రంగంపై ఈ ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. భారత్‌ నుండి సాఫ్ట్‌వేర్‌ సర్వీ సులు, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, బిజినెస్‌ అవుట్‌ సోర్సింగ్‌కు సంబంధించి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌ వస్తువులకు సంబంధించి భారత్‌తో పోల్చినప్పుడు చైనా, యూరప్‌లపై అధిక సుంకాలు విధించిన కారణంగా అమెరికా కొనుగోలుదారులు భారత్‌ ఇంజినీరింగ్‌ ఉత్పత్తులపై దృష్టి సారించే వీలుంది. దానివల్ల భారత్‌ ఎగుమతులలో పెరుగుదల ఏర్పడుతుంది.

చైనా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాల కారణంగా బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తిని భారత్‌లో చేపట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్‌ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే అవ కాశం ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే అమలులో ఉన్న ‘ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెన్టివ్‌ స్కీమ్‌’ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం) కారణంగా ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, సెమీ కండక్టర్‌లకు సంబంధించిన సంస్థలు భారత్‌లో అధికంగా ఏర్పాటవుతాయి. తద్వారా భార త్‌లో పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి, ఎగుమతుల విలువలో పెరుగు దల కనబడుతుంది. అది స్థూల దేశీయోత్పత్తిలో కూడా పెరుగు దలగా ప్రతిఫలిస్తుంది.

అమెరికా దిగుమతి సుంకాల కారణంగా ఇతర దేశాల వ్యవ సాయ ఉత్పత్తుల ధరలలో పెరుగుదల ఏర్పడుతుంది. తద్వారా భారత్‌ నుండి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు అమెరికా మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతోపాటు భారత్‌ ఎగుమతుల విలువలో పెరుగుదల ఏర్పడుతుంది. ఎగుమతుల పరంగా ఇబ్బంది ఎదుర్కొనే నేపథ్యంలో (కొన్ని ఉత్పత్తులకు సంబంధించి) భారత్‌ లోని ఉత్పత్తి స్వదేశీ డిమాండ్‌ను తీర్చడానికి ఉపకరిస్తుంది. ఈ స్థితి దేశంలో కొన్ని ఉత్పత్తుల కొరతను నివారించడం ద్వారా సాధారణ ధరల స్థాయి తగ్గుదలకు దారితీస్తుంది.

చేయాల్సింది
అయితే, అమెరికా ఆటో పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఒత్తిడిని భారత్‌ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే అమెరికాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించు కోవాలి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలతో భారత్‌ నూతన వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి.

-వ్యాసకర్త ప్రొఫెసర్‌ అండ్‌ డీన్, ఇక్ఫాయ్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ఐ.ఎఫ్‌.హెచ్‌.ఇ., హైదరాబాద్‌
- డా‘‘ తమ్మా కోటిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement