
అభిప్రాయం
బియ్యం ఎగుమతులకు తెలంగాణ రాష్ట్రం శ్రీకారం చుట్టింది. ఫిలిప్పీన్స్‌కు తొలివిడత సరఫరా కూడా పూర్తయ్యింది. రాష్ట్ర వ్యవసాయ పురోభివృద్ధిలో ఇదొక మైలురాయి అంటూ ప్రశంసలు కూడా వినవచ్చాయి. నిజంగా ఇదంత సంబరపడాల్సిన పరిణామమేనా? తెలంగాణకు పది కాలాల పాటు లబ్ధి చేకూర్చేదేనా? బియ్యం ఎగుమతుల ద్వారా లభించే తక్షణ లాభాలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వవచ్చు. కాని, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ స్వస్థత, ఆహార భద్రత, పర్యావరణ సుస్థిరత దీర్ఘకాలంలో ప్రమాదంలో పడతాయి. ఫిలిప్పీన్స్ (Philippines) ఇందుకు సరైన నిదర్శనం. అక్కడి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని విశ్లేషణ చేసినట్లయితే, ఇదెంత ప్రమాదకర పరిణామమో విశదమవుతుంది.
వైవిధ్యంతో కూడిన వ్యవసాయ–వాతావరణ పరిస్థితులు తెలంగాణ (Telangana) సొంతం. కాబట్టే, ఈ రాష్ట్రం అనాదిగా పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వంటి ఉద్యాన పంటలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చింది. క్రమేణా పరిస్థితి మారింది. విధానాల ఊతంతో వరి సాగు విస్తరించింది. ముఖ్యంగా ధాన్య సేకరణ, సాగునీటి ప్రోత్సాహకాలు రాష్ట్రంలో పంటల సరళిని నాటకీయంగా మార్చేశాయి. తెలంగాణలో వరి సాగు నీటి వనరుల కల్పన మీద విపరీతంగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం (Kaleswaram) ఎత్తిపోతల ప్రాజెక్టు కమాండ్ ఏరియాల్లో మనం దీన్ని గమనించవచ్చు. ఇప్పటికే భూగర్భ జలాలు క్షీణించిపోతున్న తెలంగాణలో ఇది సుస్థిర సేద్యం కానేకాదు. రాష్ట్రంలో 70 శాతం పైగా జిల్లాల్లో భూగర్భ జలాల వాడకం మితిమీరి ప్రమాదకర స్థాయికి చేరిందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
నానాటికీ వరి సాగు (Paddy Cultivation) విస్తరిస్తోంది. 2014–15లో 41 లక్షల ఎకరాల్లో వరి పండించగా, 2023–24లో ఈ విస్తీర్ణం దాదాపు 50 శాతం పెరిగి 56 లక్షల ఎకరాలకు చేరింది. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారానే ఈ వృద్ధి సాధ్యపడింది. అయినప్పటికీ, భూగర్భ జలాలు తరిగి పోతున్నాయి. తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ప్రకటించిన 2024 అధ్యయనం ప్రకారం, వరి పండిస్తున్న జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు ఏడాదికి 1.2 మీటర్ల వంతున పడిపోతున్నాయి.
ఎగుమతులను ప్రధాన వ్యూహంగా చేసుకుని వాటి మీద ఆధారపడటం శ్రేయస్కరం కాదు. ధరల పతనం, వాణిజ్య ఆంక్షల రిస్కులకు తెలంగాణ రైతాంగాన్నీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనూ గురి చేయడం ఎంత వరకు సబబు? ఎగుమతి బియ్యం సేకరణ ధర (టన్నుకు రూ 36,000) ఇప్పుడు లాభసాటిగానే కన బడుతుంది. అంతర్జాతీయంగా గిరాకీ అటూఇటూ అయితే, అమ్ముడుబోని బియ్యం రాష్ట్రంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతాయి. దేశీయంగా ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇండియా 2023లో బాస్మతి యేతర బియ్యం ఎగుమతులపై ఆంక్ష విధించిన విషయం గుర్తు చేసుకోవాలి.
ఫిలిప్పీన్స్ పాఠాలు
ఫిలిప్పీన్స్ అనుభవం మనకు ఒక హెచ్చరిక లాంటిది. ఆ దేశం ఒకప్పుడు బియ్యం ఎగుమతిదారు. తర్వాత్తర్వాత స్వయంసమృద్ధి మీద సకలశక్తులూ ఒడ్డాల్సి వచ్చింది. పలురకాల పంటల సాగుకు స్వస్తి పలికి అన్ని వనరులనూ వరి సేద్యానికి మళ్లించింది. 2018 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా మారింది. దేశీయ గిరాకీని తట్టుకునేందుకు 31 లక్షల టన్నుల బియ్యం (Rice) కొనుగోలు చేసింది. ఆహారభద్రతా సంక్షోభంలో కూరుకుపోయి 2023లో దేశంలో రైస్ ఎమర్జెన్సీ విధించింది. వాతావరణ ప్రతికూలతలు, వాణిజ్య ఆంక్షలు, ధరల హెచ్చుతగ్గులు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఇదంతా వరి పంట మీదే అతిగా ఆధారపడటం వల్ల సంభవించిన బాధాకర పర్యవసానం. ఎగుమతి మార్కెట్లు కుప్పకూలినా, స్థానిక సరఫరాలో కొరత ఏర్పడి ఎగుమతులపై ఆంక్షలు విధించినా... తెలంగాణలోనూ ఇదే పునరావృతం అవుతుంది.
మామిడి, నిమ్మజాతి పండ్ల తోటలకు, పసుపు పంటకు, ఔషధ మెక్కల సాగుకు అనువైన భూములు, వాతావరణ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. వీటితో ఉద్యాన పంటలకు ప్రముఖ కేంద్రంగా అవతరించగల సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. నేషనల్ హార్టికల్చర్ బోర్డు గణాంకాల ప్రకారం, ఇండియా (India) సాగుభూమిలో కేవలం 15 శాతమే ఉండే ఉద్యాన పంటలు వ్యవసాయ జీడీపీలో 40 శాతం ఆక్రమి స్తున్నాయి. 2023–24లో తెలంగాణ హార్టికల్చర్ ఉత్పత్తి 120 లక్షల టన్నులు. ఈ పంటల కోసం ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి విలువైన తయారీ ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగితే ఎంతో ఆదాయం లభిస్తుంది. కాబట్టి, అధిక విలువ కలిగిన హార్టికల్చర్ (Horticulture) ఎగుమతుల మీద దృష్టి సారించాలి. తద్వారా వ్యవసాయం సుస్థిర మవుతుంది. అన్నింటి కంటే ముఖ్యమైన మరో అంశం, ఉద్యాన పంటలకు మళ్లడం ద్వారా విలువైన నీటి వనరులను నేల సారాన్ని కాపాడుకోగలం.
చదవండి: వ్యవసాయం సుంకాల కాపట్యం
తెలంగాణ తన వ్యవసాయ విధానంపై పున రాలోచన చేయాలి. భూగోళ వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో వాటిని తట్టుకుని దీర్ఘకాలిక సౌభాగ్యానికి బాటలు వేసే సుస్థిరమైన హై వ్యాల్యూ హార్టికల్చర్, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమల దిశగా దృష్టి మళ్లించాలి.
- డాక్టర్ షేక్ ఎన్. మీరా
వ్యవసాయ శాస్త్రవేత్త – డైరెక్టర్, ఐసిఎఆర్ – వ్యవసాయ సాంకేతిక అనువర్తన పరిశోధన సంస్థ