వరినాట్లకు ఇతర రాష్ట్రాల కూలీలు
బిహార్, కోల్‌కతా, మహారాష్ట్ర నుంచి రాక
స్థానికంగా కూలీలు దొరక్క రైతుల పాట్లు
స్థానిక కూలీలతో ఎక్కువ వ్యయం
వలస కూలీలతో ఖర్చు తక్కువ.. సమయం ఆదా
వేగంగా నాట్లు వేస్తున్న పొరుగు కూలీలు
సాక్షి, పెద్దపల్లి: యాసంగి సాగు పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. పల్లెల్లో కూలీల కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో రైతులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వలస కూలీలను తీసుకొస్తున్నారు. స్థానిక కూలీలకు రెట్టింపు కూలి చెల్లిస్తేనే వ్యవసాయ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం పెరిగిన డిమాండ్ మేరకు స్థానిక మహిళలకు రూ.500 నుంచి రూ.600, పురుషులకు రూ.1,000 వరకు కూలి చెల్లిస్తున్నారు. గతంతో పోల్చితే రెట్టింపు కూలి చెల్లించాల్సి రావడంతో అన్నదాతలపై పెట్టుబడి పెరుగుతోంది.
పొలాలు దూరంగా ఉండడంతో.. ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించడం, అదనంగా అల్పాహారం, టీ సమకూర్చడం రైతులపై ఆర్థిక భారానికి కారణమవుతోంది. మరికొన్నిచోట్ల పురుషులకు ఇతర ఖర్చుల కింద రూ.100 చెల్లిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఎకరాలో వరి నాట్లు వేసేందుకు రూ.4,000 – రూ.4,500 వరకు ఖర్చు ఉండేది. ప్రస్తుతం రూ.6 వేలకు పైగా అవుతోంది. అదికూడా కేవలం కూలీలకు చెల్లించాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు.
స్థానిక మహిళలకు రూ.5,500 చొప్పున.. ఎకరాలో వరి నాట్లు వేసేందుకు గంపగుత్తకు ఇస్తున్నా.. అదనంగా నారు పంచేందుకు రూ.1,000తో పురుషులను ఏర్పాటు చేయాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. అదే వలస కూలీలకు.. వరి నాట్ల బాధ్యత గంపగుత్తకు ఇస్తే.. ఎకరాకు రూ.5,500తోనే మొత్తం పనులు చూసుకుంటున్నారు. దీంతో అదనపు భారం తగ్గడంతోపాటు, తక్కువ సమయంలోనే నాట్లు పూర్తవుతున్నాయి. ఫలితంగా రైతులు పక్కరాష్ట్రాల కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు.
యంత్రాలు, వలస కూలీలే ఆధారం..
కూలీల కొరతతో రైతులు వరినాట్లు వేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు అన్నదాతలు కొన్నేళ్లుగా వలస కూలీలు, యంత్రాలపై ఆధారపడుతున్నారు. యంత్రాల కొరతతోపాటు కొన్ని నేలల్లో నాట్లు వేసే పరిస్థితి లేక.. మనుషులతో నాట్లు వేయిస్తే అధిక దిగుబడి వస్తుందని రైతులు వలస కూలీల కోసం ఎదురు చూస్తున్నారు. కోల్‌కతా, మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి, చంద్రాపూర్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కార్మికులు వరి నాట్లు వేసేందుకు జిల్లాకు వలస వస్తున్నారు.
కొంతమంది స్థానికులు ఆయా ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను గ్రామాలకు తీసుకొచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారు. వారితో ఎకరాకు ఒక ధరను ఒప్పందం చేసుకొని.. రైతుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేసుకుని వరి నాట్లు వేయిస్తున్నారు.
వలస కూలీలకు డిమాండ్
జిల్లాలో ఈ యాసంగిలో 2,04,433 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, 1,91,351 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా సిద్ధం చేశారు. వలస కూలీల గ్రూపులుగా వచ్చి తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేస్తుండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంది.
నాట్లు వేసేందుకు ఎకరాకు రూ.5,000 నుంచి రూ.5,500 వసూలు చేస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉన్న గ్రామాల్లో రూ.6 వేల వరకు తీసుకుంటున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క తేదీ ఇస్తూ బుక్ చేసుకొని వరి నాట్లు వేస్తున్నారు. వీరి రాకతో కూలీల కొరత తీరుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రోజూ రూ.2 వేలు వస్తాయి
పొద్దున్నుంచి సాయంత్రం వరకు నాలుగు ఎకరాల్లో వరి నాట్లు వేస్తాం. నాకు రోజూ రూ.2 వేల కూలి గిట్టుబాటవుతుంది. ప్రతీ సీజన్‌లో రెండునెలలు ఇక్కడే మాకు పనులు దొరకుతాయి. రైతులు బాగా చూసుకుంటున్నారు.– బబుల్, కూలీ, కోల్‌కత్తా
పది రోజులైంది వచ్చి..
నేను కోల్‌కత్తా నుంచి వచ్చి పదిరోజులైంది. తెల్లారగానే పంట పొలాల్లోకి వెళ్తాం. రాత్రి వరకూ నాట్లు వేస్తాం. అందరం కలసికట్టుగానే ఉంటాం. ఇక్కడి వారికంటే మంచిగా నాట్లు వేస్తాం. మా రాష్ట్రంలో పనులు లేవు. –మంగళ్, కూలీ, కోల్‌కత్తా
మంది కూలీలను తీసుకొస్తా..
యాసంగి, వానాకాలంలో వరినాట్ల కోసం ఏటా పశ్చిమబెంగాల్, కోల్‌కత్తా నుంచి సుమారు 560 మందికి కూలీలను తీసుకొస్తా. రైతులకు ఎదురవుతున్న కూలీల కొరతను అధిగమించేందుకు ఎనిమిదేళ్లుగా ఏటా ఇలాగే చేస్తున్నా.– కసిరెడ్డి మల్లారెడ్డి, ఏజెంట్, గుండ్లపల్లి
Comments
Please login to add a commentAdd a comment