సాగు ప్రణాళికను ఖరారు చేసిన వ్యవసాయ శాఖ
అత్యధికంగా 63.20 లక్షల ఎకరాల్లో వరి సాగు
సాధారణంకంటే 16 లక్షల ఎకరాలు అధికం
7.18 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అంచనా
అవసరానికంటే అధికంగానే విత్తనాలు, ఎరువులు సిద్ధం
వ్యవసాయశాఖ అధికారుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. మొత్తం 79,40,520 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో ఒక్క వరి పంటే 63,54,288 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 47,27,000 కాగా, ఈసారి అదనంగా 15.86 లక్షల ఎకరాల్లో సాగవుతుందని లెక్కగట్టింది.
వరి తరువాత మొక్కజొన్న 7,18,100 ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 5,89,098 ఎకరాలు కాగా.. ఈసారి అదనంగా 1.30 లక్షల ఎకరాల్లో సాగవుతుందని లెక్కలు వేశారు. స్వీట్‌కార్న్ (తీపి మొక్కజొన్న) కూడా 950 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు తెలిపారు.
వీటి తరువాత స్థానంలో వేరుశనగ ఉంది. ఈ పంట సాధారణ సాగుకన్నా కొంచెం ఎక్కువగా 2,57,600 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. జొన్నలు 1,42,900 ఎకరాల్లో, మినుములు 49,250 ఎకరాల్లో, కుసుమలు 23,100 ఎకరాల్లో సాగు కానున్నట్లు ప్రతిపాదించారు.
గత యాసంగి కన్నా అధికం..
గత సంవత్సరం యాసంగితో పోలిస్తే ఈసారి దాదాపు 12 లక్షల ఎకరాలకుపైగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 2023 యాసంగిలో 67,83,358 ఎకరాల్లో పంటలు వేయగా, అందులో వరి వాటా 55 లక్షల ఎకరాలు. మొక్కజొన్న, పప్పులు, చిరుధాన్యాలు, నూనె గింజలు తదితర అన్ని పంటలు కలిపి 12 లక్షల ఎకరాలకు పైగా సాగైనట్లు వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి.
గడిచిన వానాకాలం సీజన్‌లో సుమారు కోటి ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా, అందులో వరి ఒక్కటే 66.78 లక్షల ఎకరాల్లో వేశారు. వానాకాలం సాగుకు దాదాపు సమానంగా ఈసారి యాసంగిలో వరి సాగు ఉంటుందని వ్యవసాయ శాఖ చెబుతోంది.
పెరిగిన సన్నాల సాగు..
వానాకాలం సీజన్‌లో సన్నాల సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. సన్న వడ్లకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్‌ప్రకటించడమే అందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. 2023 వానాకాలం సీజన్‌లో కేవలం 25.05 లక్షల ఎకరాల్లో (మొత్తం సాగులో 38 శాతం) సన్న రకం వరి పండించారు.
2024 వానాకాలం సీజన్‌లో ఏకంగా 40.55 లక్షల ఎకరాల్లో సన్న ధాన్యం వేశారు. ఈ నేపథ్యంలో యాసంగిలో కూడా సన్నాల సాగు గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. యాసంగిలో సాగుకు అనువైన వడ్ల రకాలను సీడ్ కార్పొరేషన్, ప్రైవేటు సీడ్ కంపెనీలు విడుదల చేయటంతో రైతులు ఎక్కువగా అటువైపే మొగ్గుచూపుతున్నారు.
అందుబాటులో 30 లక్షల క్వింటాళ్ల విత్తనాలు
యాసంగి సాగు కోసం 18,10,438 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, 30,11,119 క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. ఇందులో సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 52,850 క్వింటాళ్లు, ఎన్‌ఎస్‌సీ 27,308 క్వింటాళ్లు, ప్రైవేటు సంస్థలు 29,30,962 క్వింటాళ్లు అందుబాటులో ఉంచాయి.
అలాగే యాసంగి సీజన్‌కు 19.60 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, యూరియా, ఎన్‌పీకే, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ ఎరువులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment