నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో వేసిన వరి నాట్లు
యాసంగిలో వరిసాగు వద్దని ప్రభుత్వం చెప్తుండటంతో రైతులు గందరగోళంలో పడ్డారు. చెరువులు, ప్రాజెక్టుల కింద, కాల్వల వెంట ఉన్న భూముల్లో నీరు నిలిచి ఉంటోందని.. అలాంటిచోట్ల వరి తప్ప మరేం సాగుచేయలేమని స్పష్టం చేస్తున్నారు. వరి వద్దంటే వాటిని బీడుగా వదిలేయాల్సిందేనని వాపోతున్నారు. తడి ఎక్కువగా ఉండే భూముల్లో ఎలాంటి పంటలు వేయచ్చన్న దానిపై వ్యవసాయ శాఖ స్పష్టమైన ప్రణాళిక ఏదీ ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు. తెలియని కొత్త పంటలు వేయలేక.. ఒకవేళ వేస్తే ప్రభుత్వం నుంచి తగిన సాయం అందుతుందో, లేదోనన్నది తేలక.. వరిసాగువైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వరినాట్లు జోరందుకున్నాయి. గత పదిరోజుల్లోనే దాదాపు 80వేల ఎకరాల్లో నాట్లు పడినట్టు అంచనా.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో సాధారణంగా యాసంగి సీజన్‌లో 22,19,326 ఎకరాల్లో వరిసాగు చేస్తారు. అంతకుముందటి ఏడాది 38.62 లక్షల ఎకరాల్లో వరివేయగా, గతేడాది 52,78,636 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి యాసంగిలోనూ ఎక్కువ మంది రైతులు వరిసాగుకే మొగ్గుచూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై తగిన కార్యాచరణ లేకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. విత్తనాల సబ్సిడీ ఏమోగానీ అసలు ఏయే విత్తనాలు ఏమేర అందుబాటులో ఉన్నాయన్నది కూడా తెలియని పరిస్థితి ఉందని రైతులు చెప్తున్నారు.
వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇదీ..
కరీంనగర్ జిల్లాలో చెరువులు, కాల్వలను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరివేస్తున్నారు. ఇక్కడ 312 గ్రామ పంచాయతీల పరిధిలో 1,218 చెరువులు ఉన్నాయి. ఎస్సారెస్పీ కాలువలు సుమారు 120 కిలోమీటర్ల పొడవున ఉండగా.. ఉప కాలువలు మరో 500 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ప్రాజెక్టుల నుంచి నీరు వదిలినప్పుడు ప్రధాన కాల్వలను ఆనుకుని ఉన్న భూములు తడిగా మారుతున్నాయి. వాటిల్లో గత్యంతరం లేక వరి సాగు చేయాల్సి వస్తోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూరాల, భీమా, కేఎల్‌ఐ, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా ఏడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఏటా 2,500కు పైగా చెరువుల్లో కృష్ణా జలాలను నింపడంతో రైతులు వరిసాగుకే మొగ్గుచూపుతున్నారు. పొలాల్లో నీరు నిలిచి ఉండటం వల్ల పలు ప్రాంతాల్లో వరి తప్ప మరేమీ వేయలేని పరిస్థితి ఉంది. నారాయణపేట, గద్వాల, జోగుళాంబ, వనపర్తి జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలకు అవకాశమున్నా.. విత్తనాలు, మార్కెటింగ్, మద్దతు ధరపై స్పష్టత లేదని రైతులు చెప్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే వేల ఎకరాల్లో వరినాట్లు వేశారు. మిగతాచోట్ల పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఏఎమ్మార్పీ, నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద వరిసాగుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఆసిఫ్‌నగర్ కాలువ, తూములు దెబ్బతిన్నాయి. దీంతో పరిసరాల్లోని వందల ఎకరాల్లో జాలు పారుతోంది. అక్కడ వరి తప్ప మరేమీ సాగు చేయలేని పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మినహా సాగునీటి వనరులున్న నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని సరస్వతి కాలువ, కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతలు, గోదావరి తీరాల్లో రైతులు వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. ఆయా చోట్ల ఇతర పంటలు సరిగా పండవని పేర్కొంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిజాంసాగర్, శ్రీరాంసాగర్, పోచారం, కౌలాస్‌నాలా, రామడుగు ప్రాజెక్టుల కింద 2 లక్షల ఎకరాలకుపైగా వరిసాగుకు చర్యలు చేపట్టారు. ఇక్కడ వరి తప్ప ఇతర పంటలపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఖమ్మం జిల్లా రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో వరి సాగుకే సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 8 మండలాల్లో ఇప్పటికే 7,923 ఎకరాలకు సరిపడా వరి నార్లు పోశారు. ఆరు మండలాల్లో 131 ఎకరాల్లో నాట్లు కూడా వేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాల్వల ఆయకట్టు, పాలేరు రిజర్వాయర్, వైరా రిజర్వాయర్ ఆయకట్టులో తరి భూములు కావడంతో వరి తప్ప ఇతర పంటలు సాగు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరుతడి పంటలకు ఎక్కువ అవకాశం ఉంది. కానీ విత్తనాలు, మార్కెటింగ్ , మద్దతు ధర వంటి అంశాలపై స్పష్టత లేనందునే వరి సాగువైపు వెళ్లాల్సి వస్తోందని రైతులు అంటున్నారు.
జాలువారిన నేలలో మరేం వేయాలి
మా పంట పొలాలవైపు కాలువ తీశారు. అంతకుముందు మాగాణిగా ఉండగా ఏ పంటలు వేసినా పండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. నేల తడిగా ఉంటోంది. అలాంటప్పుడు వరి తప్ప ఏ పంట వేయలేం. వేసినా నష్టపోవాల్సిందే. – సింగిరెడ్డి ముత్యంరెడ్డి, మొగ్ధంపూర్, కరీంనగర్ మండలం
శనగ వేస్తే మొలక రాలేదు
కొన్నేళ్లుగా 15 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ఇటీవలి ఖరీఫ్‌లో ఐదెకరాల్లో శనగ వేశాం. భూమిలో తడి ఎక్కువగా ఉన్న కారణంగా నెల రోజులైనా మొలక రాలేదు. దాన్ని దున్నేసి వరి వేస్తున్నాం. – బోధ శైలేందర్, రుద్రూర్, నిజామాబాద్
వేరే దారి లేకనే..
నాకు మూడెకరాల భూమి ఉంది. అది కూడా చెరువు పక్కనే ఉంటుంది. వరి తప్ప వేరే పంట వేసినా పండదు. వేరే దారి లేకనే యాసంగిలో వరి వేయక తప్పడం లేదు. – సూరకంటి ప్రశాంత్‌రెడ్డి, చామన్‌పల్లి, నిర్మల్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment