దాదాపుగా పూర్తికావచ్చిన వానాకాలం కోతలు
నవంబర్ ఒకటో తేదీ నుంచే మొదలైన యాసంగి సీజన్
రాష్ట్రంలో యాసంగి పంట సాగు అంశం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. సర్కారు నుంచి అందాల్సిన రైతుభరోసాపై అస్పష్టత నెలకొనడం.. రుణమాఫీ పూర్తిగాక బ్యాంకుల నుంచి కొత్త రుణాలు అందే పరిస్థితి లేకపోవడంతో... యాసంగికి పెట్టుబడులు ఎలాగని రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ప్రైవేటు అప్పుల బాటపట్టాల్సిన దుస్థితి వస్తుందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంట కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తోంది. మరోవైపు నవంబర్ ఒకటి నుంచే యాసంగి (రబీ) సీజన్ మొదలైంది. నిజామాబాద్, నల్లగొండ వంటి జిల్లాలతోపాటు పంట కోతలు పూర్తయిన ప్రాంతాలన్నిటా రైతులు యాసంగి సాగు మీద దృష్టి పెట్టారు. దుక్కులు దున్ని, పొలాలను సిద్ధం చేస్తున్నారు. కొన్నిచోట్ల నారు పోస్తున్నారు. కానీ పంట సాగుకు పెట్టుబడులు ఎలాగని వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
‘రైతుభరోసా’పై అస్పష్టత..: రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా 2018 ఖరీఫ్ నుంచి ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2023–24 వానాకాలం సీజన్ వరకు 11 విడతలుగా రైతుబంధు మంజూరు చేసింది. చివరిసారిగా 2023–24 వానాకాలం సీజన్‌లో 68.99 లక్షల మంది రైతులకు రూ.7,624.74 కోట్లు రైతుబంధు సాయంగా అందజేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సాయాన్ని ఏటా రూ.15 వేలకు పెంచి ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. కానీ 2023–24 యాసంగికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో ఐదెకరాలలోపు భూమి ఉన్న వారికి ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.5,575 కోట్లు విడుదల చేసింది. తర్వాత ఐదెకరాలపైన ఉన్న వారికి కూడా పెట్టుబడి సాయం విడుదల చేసినట్టు ప్రకటించింది.
అయితే.. 2024–25 వానాకాలానికి సంబంధించి ‘రైతు భరోసా (రైతుబంధు)’ పెట్టుబడి సాయం రైతులకు అందలేదు. దీనిపై ఇటీవల వ్యవసాయ మంత్రి తుమ్మలను ప్రశ్నిస్తే.. వానాకాలం సీజన్ అయిపోయిందని, యాసంగి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ యాసంగి సీజన్ మొదలై నెలరోజులు గడుస్తున్నా పెట్టుబడి సాయం ఊసే లేదు. దీనితో పంట పెట్టుబడులు ఎలాగని రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. పెట్టుబడి సాయం పెంచి ‘రైతు భరోసా’ ఇవ్వడమేమోగానీ.. రైతు బంధుకూ దిక్కులేకుండా పోయిందని వాపోతున్నారు.
రైతులందరికీ ‘భరోసా’ అందేనా?
యాసంగి నుంచి పెట్టుబడి సాయం ఇస్తామని మంత్రి తుమ్మల ప్రకటించినా.. ఎవరెవరికి అందుతుందన్న దానిపై స్పష్టత లేని పరిస్థితి. గుట్టలు, రోడ్లు, సాగులో లేని భూములకు పెట్టుబడి సాయం ఇచ్చేది లేదని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దానికితోడు గరిష్టంగా ఐదెకరాలకే పెట్టుబడి సాయం ఇచ్చే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రైతుల సాగుభూములపై ఇప్పటికే సర్వే చేపట్టినట్టు తెలిసింది.
సాగు జరిగిన భూముల లెక్కలు తేలితేనే పెట్టుబడి సాయం అందించే రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది. దీనిలో ఎంత మంది రైతులకు, ఎంత వరకు పెట్టుబడి సాయం అందుతుందన్న దానిపై అస్పష్టత నెలకొంది. ఈ నెల 28 నుంచి 30 వరకు మహబూబ్‌నగర్‌లో రైతు సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అప్పుడైనా పెట్టుబడి సాయంపై ప్రకటన వెలువడుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
రుణమాఫీ పూర్తవక రుణాలకు ఇబ్బంది
కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చిన మేరకు రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తిస్థాయిలో అమలుకాలేదు. రాష్ట్రంలో రూ.2లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులు సుమారు 40 లక్షల మందికాగా.. ప్రభుత్వం 22 లక్షల మందికి సంబంధించి రూ. 18 వేల కోట్లను మాఫీ చేసింది. మిగతావారికి రుణమాఫీ జరగాల్సి ఉంది. రేషన్‌కార్డు లేకపోవడం, ఆధార్, పాస్ పుస్తకాల్లో పేర్లు తప్పుగా ఉండటం, కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మందికి రుణాలు ఉండటంతోపాటు పలు సాంకేతిక కారణాలతో వారికి రుణమాఫీ జరగలేదు.
వ్యవసాయ శాఖ వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించింది కూడా. అయితే పంట పెట్టుబడుల కోసం రుణం కావాలని వెళితే.. పాత రుణాలు ఇంకా మాఫీ కానందున కొత్త రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయని రైతులు వాపోతున్నారు. అంతేకాదు మాఫీకాని రుణాలకు సంబంధించి వడ్డీలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయని పేర్కొంటున్నారు. వానాకాలం ధాన్యానికి సంబంధించిన సొమ్ము కూడా ఇంకా అందలేదని కొందరు రైతులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment