● కానరాని 30శాతం రక్తం ఇవ్వాలన్న నిబంధన ● ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు ఎగనామం ● ఇతర అవసరాలకు విక్రయాలు ● పట్టనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు
కరీంనగర్‌టౌన్: రక్తం ఆపదలో ఉన్నవారికి అత్యవసరం.. రక్తం అందని సందర్భంలో ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. రక్తహీనత, తలసేమియాతో బాధపడేవారు చాలామంది రక్తదాతల కోసం ఎదురుచూస్తున్నారు. ఆపదలో ఉన్నవారితో పాటు దీర్ఘకాలికంగా రక్తం అవసరం ఉన్నవారి కోసం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పుట్టినరోజుల సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన రక్తంలో ప్రైవేట్ బ్లడ్‌బ్యాంక్‌లు 30శాతం అదేరోజు ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకుకు ఇవ్వాలి. కానీ ఇది జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదు. దీంతో పేదలకు అత్యవసరం అయిన సమయంలో రక్తం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులు సైతం ఈ విషయమై పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రైవేటు బ్లడ్‌బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా..
పేద రోగులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్రమంలో అసరమైనవారికి ప్రభుత్వ బ్లడ్‌బ్యాంక్ నుంచి ఉచితంగా రక్తం అందిస్తారు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన నిరుపేదలు వస్తుంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, రక్తహీనతతో బాధపడేవారు, డెలివరీల కోసం వచ్చేవారికి రక్తం అవసరం అవుతుంది. డిమాండ్‌కు సరిపడా డోనర్స్ నుంచి రక్తం అందకపోవడంతో రక్తం కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉన్నా.. వేసవిలో ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది.
15 బ్లడ్‌బ్యాంకులు
జిల్లాలో 15 బ్లడ్‌బ్యాంకులు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వాసుపత్రి బ్లడ్‌బ్యాంకు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, మైత్రి, జీవన్‌ధార వాలంటరీ, ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చల్మెడ ఆనందరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అపోలో రీచ్ హాస్పిటల్, ప్రజా బ్లడ్ సెంటర్, ఎంజీఆర్ వలంటరీ, ఆయుష్, ఆరోగ్య, లైఫ్‌కేర్, స్పందన, మదర్ థెరిస్సా వలంటరీ బ్లడ్ సెంటర్ కరీంనగర్‌లో కొనసాగుతున్నాయి.
ఒక్క రెడ్‌క్రాస్ నుంచే
జిల్లాలో ఉన్న 15బ్లడ్‌సెంటర్లలో ఒక్క రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు నుంచి మాత్రమే ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకుకు రక్తం అందిస్తున్నారు. 30శాతం కాకపోయినా రక్తదాన శిబిరాలు నిర్వహించిన ప్రతిసారి ఎంతోకొంత ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకుకు పంపిస్తున్నారు. ఇటీవల ఒక ప్రైవేటు బ్లడ్‌బ్యాంకు నుంచి మూడు యూనిట్ల రక్తం అందినట్లు అధికారులు వెల్లడించారు.
సహకరించాలి
ప్రభుత్వాసుపత్రికి నిరుపేదలైన రోగులు ఎక్కువగా వస్తుంటారు. వారికి రక్తం అందించేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రక్తదాతలు, రాజకీయ నేతల జయంతి, జన్మదినాల పేరిట జరిపేవారు ప్రభుత్వాసుపత్రి బ్లడ్‌బ్యాంకును సందర్శిస్తే క్యాంపులు నిర్వహిస్తాం. ఆ విధంగా నిరుపేదలకు ఎంతగానో ఉపయోగం జరుగుతుంది.
– డాక్టర్ ఉషాకండల్,
బ్లడ్ బ్యాంకు ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment