ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రితో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి పంపించే ప్రక్రియకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొలి అడుగు వేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి ఏటా సగటున 70 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో రాష్ట్ర అవసరాలకు 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వినియోగించుకొంటుండగా, మిగతా మొత్తాన్ని ఎఫ్‌సీఐకి లెవీ కింద పెడుతున్నారు.
కాగా ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో నాణ్యమైన సన్నబియ్యం ఉత్పత్తి పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో నేరుగా విదేశీ ఎగుమతులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. నాణ్యతా కారణాల వల్ల ఫిలిప్పియన్లు గత కొన్నేళ్లుగా భారతదేశం నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం నిలిపివేశారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులపై ఆ దేశ వ్యవసాయ మంత్రి రోజేర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఫిలిప్పీన్‌లకు ప్రతి సీజన్‌లో 3 టన్నుల వరకు బియ్యం ఎగుమతి చేసే అవకాశాలపై చర్చించారు. ఇద్దరు మంత్రుల చర్చలు స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో సాగాయి. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడినందున ఎగుమతి కోసం ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు మంత్రి ఉత్తమ్‘సాక్షి’కి తెలిపారు.
త్వరలో ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని, అనంతరం ఫిలిప్పీన్స్ వెళ్లి నేరుగా ఆ దేశంతో చర్చలు జరుపనున్నట్లు చెప్పారు. అది కార్యరూపం దాల్చితే తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఇది మరో మంచి అవకాశం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment