న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలితాలు వీలైనంత ఎక్కువమంది లబ్ధిదారులకు చేరడంలో గవర్నర్లు సహాయం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండ్రోజులపాటు జరగనున్న 49వ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ప్రధాని సోమవారం ప్రారంభోపన్యాసం చేశారు.
ఆదివాసీ జనాభా చెప్పుకోదగినంత ఉన్న రాష్ట్రాల గవర్నర్లు విద్య, క్రీడ తదితర రంగాలతోపాటు సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్యక్రమాల ప్రయోజనాలు ఈ వర్గాలకు అందేట్లు చూడటంలో చేయూతను అందించాలని ప్రధాని కోరారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆదివాసీల పాత్ర కీలకమని.. దీనిని గుర్తించి, భావితరాల వారికి అందించేందుకుగాను డిజిటల్ మ్యూజియమ్‌లు మొదలైన పద్ధతుల్లో వీటిని భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు.
వివిధ అంశాల్లో గవర్నర్లు తమ అధికారాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందేవారి సంఖ్యను పెంచాలన్నారు. ‘భారతదేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ పరిధిలో గవర్నర్ పాత్ర చాలా కీలకం’ అని మోదీ పేర్కొన్నారు. గవర్నర్లు తమ పరిధిలోని యూనివర్సిటీలకు చాన్స్‌లర్లన్న విషయాన్ని మోదీ గుర్తుచేస్తూ.. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదిక ద్వారా యువతలో యోగాపై అవగాహన పెంచేందుకు కృషిచేయాలని కోరారు. వర్సిటీలు మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలకు కేంద్రాలు కావాలన్నారు.
65వేల పల్లెలకు గ్రామస్వరాజ్
వెనుకబడిన జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసిన జాతీయ పౌష్టికాహార మిషన్, గ్రామాల విద్యుదీకరణ ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ఇటీవలే విద్యుదీకరణ పూర్తయిన గ్రామాలను గవర్నర్లు సందర్శించి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు.
ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు ప్రభుత్వం చేపట్టిన గ్రామ్ స్వరాజ్ అభియాన్ ద్వారా ఏడు ముఖ్యమైన ప్రభుత్వ పథకాలను 16వేల గ్రామాల్లోని ప్రజలకు అందజేసిన విషయాన్ని ప్రధాని వెల్లడించారు. ఆగస్టు 15 వరకు గడువు నిర్దేశించుకుని ఈసారి 65వేల గ్రామాలకు చేరాలని సంకల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే 50వ గవర్నర్ల సదస్సుకు ఇప్పటినుంచే ప్రణాళికలు ప్రారంభించాలని కోరారు. తద్వారా ఈ వార్షిక సదస్సు ఫలప్రదమయ్యేలా ప్రయత్నిం చాలన్నారు.
మార్పుకు వారధులవ్వాలి: రాష్ట్రపతి
పేదలు, అణగారిన వర్గాల విద్యాప్రమాణాలను పెంచడం, వీరి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో గవర్నర్లు వారధుల్లా నిలవాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. సమాఖ్య వ్యవస్థలో కీలకమైన గవర్నర్లు.. రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకుడిగా, సంరక్షకుడిగా ఉండాలన్నారు. రాజ్‌భవన్‌లు విలువలు, సిద్ధాంతాలకు కేంద్ర స్థానాలుగా ప్రజలు భావిస్తారన్నారు. ‘భారత్‌లో 10 కోట్ల మంది ఆదివాసీలున్నారు.
స్వాతంత్య్రం సిద్ధించినప్పటినుంచి నేటి వరకు ఈ వర్గం, మిగిలిన వారిలాగా సంక్షేమ పథకాల లబ్ధిని పొందలేకపోయింది. వీరి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు గవర్నర్‌లు చురుకైన పాత్ర పోషించాలి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘గవర్నర్లు అంటే యువతకు గార్డియన్లు. మీరు యువత సరైన నైతికవిలువలతో ముందుకెళ్లేలా ప్రభావితం చేయగలరు.
దేశంలోని 69 శాతం యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నాయి. యువతలో భారత సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆధునిక విద్యను అందుకునేలా మీరు స్ఫూర్తిని పెంచండి. ఈ వర్సిటీలు జాతీయ సమగ్రతను పెంచాలి. మహాత్ముని జయంతి సందర్భంగా ఆయన బోధనలు ఎక్కువగా ప్రసారమయ్యేలా చూడాలి’ అని కోవింద్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment