ప్రపంచ మార్కెట్లకు దిశానిర్దేశం చేసే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది మూడు దఫాలు మాత్రమే వడ్డీ రేట్లు పెంపు ఉండొచ్చని ముందస్తుగా అనుకున్నప్పటికీ.. అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో ఈ పెంపు నాలుగుసార్లయినా లేదా అయిదుసార్లయినా కావొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.
ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత జెరోమ్ పావెల్ తొలిసారిగా పరపతి విధాన సమీక్ష జరుపుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపు విడతలపై ఉత్కంఠ నెలకొంది. మాజీ చైర్మన్ జేనెట్ యెలెన్‌లాగా క్రమానుగతంగా పెంచుకుంటూ వెళ్లే విధానాలనే కొనసాగిస్తారా.. లేక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను ప్రతిబింబించేలా దూకుడు ప్రదర్శిస్తారా అన్నది మార్కెట్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.
ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) బుధవారం వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. అదే సమయంలో ఆర్థిక అంచనాలను కూడా వెలువరిస్తుంది. ఇందులోనే వడ్డీ రేట్ల పెంపు ఎన్ని దఫాలు ఉండొచ్చన్నదీ వెల్లడి కానుంది. ఏదైతేనేం పావెల్ మాటలు బట్టి, అమెరికా సానుకూల ఆర్థిక పరిస్థితులు బట్టి చూస్తే వడ్డీ రేట్లను పెంచే క్రమం పెరగడమే తప్ప.. తగ్గే అవకాశాల్లేవని విశ్లేషకులు అంటున్నారు.
సానుకూల పరిస్థితులు..
ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత గణాంకాలు మొదలైన వాటికి సంబంధించిన సానుకూల అంశాలు మరిన్ని దఫాలు వడ్డీ రేట్ల పెంపునకు దోహదపడే అవకాశాలు ఉన్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం పెరగడంతో.. వచ్చే ఏడాదిలోగా రెండు శాతం టార్గెట్‌ను సులువుగా చేరొచ్చని ఫెడరల్ రిజర్వ్‌కు కొంత భరోసానిస్తోంది. మరోవైపు, నిరుద్యోగిత స్థిరంగా 4.1 శాతంగా కొనసాగుతోంది. మెరుగుపడుతున్న ఎకానమీకి అనుగుణంగా ఉద్యోగాల కల్పనలో వృద్ధి కూడా క్రమంగా పెరుగుతోంది.
రిస్కులూ ఉన్నాయి..: ఇవన్నీ నాణేనికి ఒకవైపు కాగా.. దీనికి మరోవైపు కూడా చూడాలంటున్నారు మరికొందరు విశ్లేషకులు. ఇప్పుడున్నంత తక్కువ స్థాయిలో నిరుద్యోగిత సుదీర్ఘకాలం కొనసాగడం.. దాని ప్రభావాలు ఎలా ఉంటాయన్నది ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడలేదన్నది వారి వాదన. చాన్నాళ్ల క్రితం 1960ల ఆఖర్లో నిరుద్యోగిత 4 శాతం కన్నా తక్కువ స్థాయిలో ఉండేది. అయితే, అది 1970ల నాటికి భారీ ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారి తీసింది.
వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి ప్రస్తుత ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత అంశాలను ఈ కోణంలో కూడా చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే పన్ను కోతలు, వ్యయాల పెంపుతో భారీ ఊతం లభించిన ఎకానమీకి.. అంతర్జాతీయంగా పటిష్ట వృద్ధి, బలహీన డాలరు, మెరుగుపడుతున్న పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా తోడైతే ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అస్థిరతకు లోనయ్యే అవకాశాలూ ఉన్నాయన్న అభిప్రాయం కూడా నెలకొంది.
ప్రస్తుతం ఫెడ్ రేట్లు 1.25 శాతం – 1.50 శాతం శ్రేణిలో ఉన్నాయి. తాజా సమీక్షలో వీటిని పావు శాతం పెంచవచ్చని అంచనా. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 1.5 శాతం – 1.75 శాతానికి చేరుతుంది. గతేడాది మూడు దఫాలుగా వడ్డీ రేట్లు పెంచిన ఫెడరల్ రిజర్వ్ .. ఈ ఏడాది మరో మూడు దఫాలు పెంచే అవకాశాలు ఉన్నాయంటూ డిసెంబర్‌లో సూచనప్రాయంగా వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జనవరిలో సమీక్ష జరిపినప్పటికీ.. రేట్లు మాత్రం యధాతథంగానే ఉంచింది. 2007–09 మధ్య కాలంలో ఆర్థిక మాంద్యం దరిమిలా ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సున్నా స్థాయికి తగ్గించేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment