చైనాను మించాం.. ప్రపంచాన్ని గెలిచాం! | business Revind of 2015 | Sakshi
Sakshi News home page

చైనాను మించాం.. ప్రపంచాన్ని గెలిచాం!

Published Thu, Dec 31 2015 12:02 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM

చైనాను మించాం.. ప్రపంచాన్ని గెలిచాం! - Sakshi

చైనాను మించాం.. ప్రపంచాన్ని గెలిచాం!

దశాబ్దాల నుంచి ఆర్థిక పరంగా ఉరుకులు, పరుగులు పెరుగుతున్న చైనా వృద్ధిరేటును భారత్ అధిగమించడం 2015లో చెప్పుకోదగ్గ ఘటన. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపుతో ఘనంగా ప్రారంభమైన 2015 ఏడాది అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుతో నిరుత్సాహకరంగా ముగిసింది. ఏడాది మొత్తంలో భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఫలితాలను అందిం చింది. ఈ ఏడాది ఆర్‌బీఐ ఆశ్చర్యకరంగా తన పాలసీ రేట్లను నాలుగు సార్లు తగ్గించింది.

15 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలు సరళించడం, రియల్టీ బిల్లు ఆమోదం వంటి కీలక సంస్కరణలకు కేంద్రం తెరలేపింది. విదేశీ పెట్టుబడులకు భారత్‌ను గమ్యస్థానం మార్చడం కోసం ప్రధాని మోదీ వివిధ దేశాలు తిరిగి వాటితో పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అలాగే ఈ ఏడాది సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, మార్క్ జుకర్‌బర్గ్ వంటి తదిరత ప్రముఖ సీఈవోలు భారత్‌లో పర్యటించారు.  తద్వారా ప్రపంచమంతా మన దేశం పేరు మార్మోగింది.
 
  మార్చిలో 30,000 ఆల్‌టైం గరిష్ట స్థాయిని తాకి న సెన్సెక్స్.. చివరికి 26,000 స్థాయికి తగ్గింది. రూపాయి మారక విలువ రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. క్రూడ్ ధరలు దశాబ్ద కాల కనిష్టానికి పడ్డాయి. ఇది భారత్‌కు బాగా కలిసొచ్చిన అంశం. ఇలా పలు జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి 2015లో జరిగిన కీలక ఘటనల సమాహారమిది...
 
  గ్లోబల్ సీఈవోలు భారత్ వచ్చారు...
 ఈ ఏడాదిలో పలువురు గ్లోబల్ సీఈవోలు భారత్‌ను సందర్శించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, పెప్సికో సీఈవో ఇంద్రనూయి,  ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా వంటి తదిత రులు ఉన్నారు. వీరందరూ భారత్‌లో వారి వారి కంపెనీల భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కి భారతీయుడైన సుందర్ పిచాయ్ (43) సీఈవోగా నియమితులు కావడం ఈ ఏడాది ప్రపంచం దృష్టిని భారత్ ఆకర్షించేలా చేసింది.
 
 ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు పరంపర..
 జనవరి 17న దాదాపు ఏడాదిన్నర తర్వాత (2013, మే అనంతరం) ఆర్‌బీఐ రెపో రేటును 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గించింది. అటుతర్వాత వరుసగా .....మార్చి, జూన్, సెప్టెంబర్ నెలల్లో రేట్లు తగ్గించింది. ఈ ఏడాది జరిగిన నాలుగు తగ్గింపుల్లో రేపో రేటు 6.75 శాతానికి దిగింది. రెపోకు అనుగుణంగా రివర్స్ రెపో రేటు కూడా 5.75 శాతానికి చేరుకుంది. కాగా సీఆర్‌ఆర్ 4 శాతంగా... ఎస్‌ఎల్‌ఆర్ 21.5 శాతంగా ఉంది.
 
 ఫెడ్ పెంచింది... ఇసీబీ తగ్గించింది
 తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా 2015 డిసెంబర్‌లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. దీంతో 0-0.25 శాతంగా వున్న ఫెడ్ ఫండ్స్ రేటు 0.25-0.50 శాతానికి చేరింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కల్పించడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) తన కీలక డిపాజిట్ రేటును ప్రస్తుత మైనస్  0.20 శాతం నుంచి మైనస్ 0.30 శాతానికి తగ్గించింది. ఇంకోవైపు పలు దఫాలు వడ్డీ రేట్లను తగ్గించిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించింది. యువాన్ విలువ తగ్గింపుతో కొద్దికాలంపాటు ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో ప్రకంపనాలు కలిగాయి.
 
 బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావం...
 చైనా రాజధాని షాంఘై కేంద్రంగా మంగళవారం నేషనల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) ఆవిర్భవించింది. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల కూటమి 100 బిలియన్ డాలర్ల మూలధనంతో ఈ బ్యాంకును ఏర్పాటు చేసింది. భారత్ మదిలో మెదిలిన ఈ ఆలోచన అటు తర్వాత మూడేళ్లకు కార్యరూపం దాల్చింది. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వంటి పశ్చిమదేశాల ఆధిపత్య ధోరణి బహుళజాతి బ్యాంకులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం ఈ బ్యాంక్ ఏర్పాటు లక్ష్యం. షాంఘై కేంద్రంగా ఏర్పాటుకానున్న బ్రిక్స్ బ్యాంకు తొలి ప్రెసిడెంట్‌గా కేవీ కామత్ పేరు ఖరారైంది. ఆయన ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లకు చైర్మన్‌గా పనిచేశారు.
 
 డిజిటల్ ఇండియాకు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు
 ప్రధాని మోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా వీక్ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్, సైరస్ మిస్త్రీ, కుమార మంగళం బిర్లా, అజీం ప్రేమ్‌జీ, అనిల్ అంబానీ, బెర్న్‌హార్డ్ గెర్వర్ట్ తదితర దేశ విదేశ దిగ్గజాలు దాదాపు 18 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా డిజిటల్ రంగంపై సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో బిర్లా 7 బిలియన్ డాలర్లు, మిట్టల్ రూ. 1 లక్ష కోట్లు, అనిల్ అంబానీ రూ. 10,000 కోట్లు, కుమార మంగళం బిర్లా 9 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని వెల్లడించారు.
 
 30,000 శిఖరంపై సెన్సెక్స్..
 మార్చి4న రికార్డు గరిష్టస్థాయి సెన్సెక్స్ 30,025 స్థాయిని తాకి, ఆ రోజున చివరగా 29,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 9,100 స్థాయిని తాకి చివరకు 8,923 వద్ద ముగిసింది. ఈ ఏడాది పలు కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. అందులో రూ. 3 వేల కోట్ల ఇండిగో ఐపీవో కీలకం.
 
 

తగ్గిన పుత్తడి తళుకు..

 బంగారం ధరల పతనం 2013 నుంచి మొదలై 2015లో కూడా కొనసాగింది. ఈ ఏడాది 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 మేర (దాదాపు 5 శాతం) క్షీణించింది. ఏడాది ప్రారంభంలో రూ.26,700గా ఉన్న 10 గ్రాముల బంగారం ధర సంవత్సరాంతానికి రూ.25,500 స్థాయికి దిగింది. అలాగే వెండి ధర కూడా రూ.37,200 నుంచి రూ.34,300కు పడింది. రూపాయి మారక విలువ విపరీతమైన ఒడిదుడుకులు, అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెలకొని ఉన్న సందిగ్ధత వల్ల ఏడాది మొత్తం బంగారం ధర ఊగిసలాటకు గురయ్యింది. చైనా ఆర్థిక మాంద్యం కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.
 
గోల్డ్ బాండ్స్‌కు ఓకే...డిపాజిట్‌కు నో
 ప్రభుత్వం ప్రారంభించిన పసిడి పథకాల విషయంలో... బాండ్లకు మంచి స్పందన లభించింది. వీటికి రూ. 246 కోట్ల విలువైన దరఖాస్తులు రాగా, గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద ఒక నెలలో 400 గ్రాముల బంగారాన్నే బ్యాంకులు సమీకరించగలిగాయి.
 
 పేమెంట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు ఓకే...
 రిలయన్స్ ఇండస్ట్రీస్, పోస్టల్ డిపార్ట్‌మెంట్ సహా 11 సంస్థలు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. మొత్తం 41 సంస్థలు పేమెంట్ బ్యాంకు పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అలాగే  సూక్ష్మ పరిశ్రమలు, సన్నకారు రైతులకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవల్ని అందించే లక్ష్యంతో చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి 10 సంస్థలకు ఆర్‌బీఐ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. ఈ జాబితాలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ వంటివి ఉన్నాయి.
 
 గ్రీసు సంక్షోభం..
 ఐఎంఎఫ్ రుణం చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో గ్రీసు ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరింది. ఐఎంఎఫ్ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన తొలి అభివృద్ధి చెందిన దేశంగా గ్రీస్ నిలిచింది. అలాగే గ్రీసులో కొద్దిరోజులపాటు బ్యాంకులు మూసివేశారు. ప్రపంచవ్యాప్తంగా గ్రీసు సంక్షోభ ప్రభావం ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రసరించి, కొద్దిరోజుల పాటు ఇవి పతనమయ్యాయి. అటుతర్వాత దాదాపు 12 బిలియన్ యూరోల బెయిలవుట్ రుణ మొత్తం విడుదలకు సంబంధించి రుణదాతలతో ఒప్పందం కుదుర్చుకోవడంతో తాత్కాలికంగా గ్రీసుకు ఊరట లభించింది.   దీని కింద మరో 48 సంస్కరణలను గ్రీస్ అమలు చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పెన్షన్ల తగ్గింపు, వ్యాట్ పెంపు వంటివి ఉన్నాయి.
 
 ఫోక్స్ వ్యాగన్‌పై ‘కాలుష్య’ మేఘాలు...
 ఫోక్స్‌వ్యాగన్ కార్ల కాలుష్య ప్రమాణాలపై భారత్‌లో కూడా దర్యాప్తు మొదలైంది. ఈవిషయమై దర్యాప్తు చేయాలని ఆటోమోటివ్ రీసెర్చ్  అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్‌ఏఐ)ను  భారీ పరిశ్రమల శాఖ ఆదేశించింది. అమెరికాతో సహా పలు కంపెనీల్లో కాలుష్య నిబంధనల విషయంలో ఫోక్స్‌వ్యాగన్ మోసాలకు పాల్పడిందన్న విషయం వెలుగులోకి వచ్చి, ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టించింది.
 
 యాపిల్‌కొత్త ఐఫోన్లు వచ్చాయ్...
 టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఐఫోన్‌కి సంబంధించి 6 ఎస్, 6 ఎస్ ప్లస్ వెర్షన్లను ప్రవేశపెట్టింది. సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ రంగుల్లో వీటిని విడుదల చేసింది. 3డీ టచ్, అయాన్ ఎక్స్ గ్లాస్ డిస్‌ప్లే తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి.


 
 టాప్ ఇంటర్నేషనల్ డీల్స్
 ప్రపంచంలోనే అతి పెద్ద కెమికల్ కంపెనీ ఏర్పాటుకు తెరతీస్తూ డో కెమికల్, డ్యుపాంట్ సంస్థలు విలీనం కానున్నాయి. దీంతో కొత్తగా ఏర్పడే కంపెనీ విలువ ఏకంగా 130 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 8.7 లక్షల కోట్లు) ఉండనుంది.
 ఫార్మా రంగంలో అత్యంత భారీ డీల్‌కు తెరతీస్తూ బొటాక్స్ తయారీ సంస్థ అలెర్గాన్, అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఫైజర్ విలీనం కానున్నాయి. ఈ డీల్ విలువ దాదాపు 160 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 10,40,000 కోట్లు) ఉండనుంది.
 ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్‌కు తెరతీసింది టెక్నాలజీ దిగ్గజం డెల్. ఏకంగా 67 బిలియన్ డాలర్లు వెచ్చించి ఈఎంసీ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement