2017లో ఈ మూడు ఎటు?
హెచ్చుతగ్గుల బాటలోనే బంగారం!
అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినపుడు సురక్షితంగా ఉంటుందని అంతా బంగారంవైపు పరుగులెడతారు. అమెరికా ఆర్థిక సంక్షోభం తర్వాత 1900 డాలర్ల వరకూ పెరిగిపోయిన పుత్తడి ధర... అమెరికా కుదుటపడిందనగానే మళ్లీ 1000 డాలర్ల స్థాయికి పడిపోయింది. 2016లో కూడా బ్రెగ్జిట్, ట్రంప్ గెలుపు, ఫెడ్ రేట్ల పెంపు వంటి సంఘటనలతో 1060–1372 డాలర్ల మధ్య తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయింది. 2017లోనూ ఇదే తరహా ఊగిసలాట ఉంటుందనే అంచనాలున్నాయి. ఇటలీలో రాజకీయ సంక్షోభం, జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఎన్నికలు పుత్తడి ధరను ప్రభావితం చేస్తాయనేది బులియన్ విశ్లేషకుల మాట. బ్రెగ్జిట్ ఇంకా జరగలేదని, ట్రంప్ ఇంకా అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించలేదని, కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు షాక్‌లుండవనే అంచనాలకు అప్పుడే రాలేమని, ఆయా పరిణామాలకు అనుగుణంగానే బంగారం కదలవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. కానీ 2017లో ఫెడ్ వడ్డీ రేట్లను జోరుగా పెంచడం, డాలరు మరింత బలపడటం జరిగితే బంగారం మరింత తగ్గొచ్చన్నది కూడా వారి అభిప్రాయం. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల అంచనాలు ఎలా వున్నాయంటే....
పెద్దగా పెరుగుదల ఉండదు
గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు తగ్గినందున (2016 నవంబర్ 8 నుంచి ఈ అమ్మకాలు 7 శాతం తగ్గాయి), 2017లో పుత్తడి అంచనాల్ని, మా గత అంచనాలతో పోలిస్తే 1,438 డాలర్ల నుంచి 1,338 డాలర్లకు తగ్గిస్తున్నాం. కానీ మొత్తంమీద సరఫరా– డిమాండ్ మధ్య వ్యత్యాసం వల్ల ప్రస్తుత ధరతో పోలిస్తే కొత్త ఏడాదిలో కొంత పెరుగుతుంది.
– క్రెడిట్ సూసీ అనలిస్టులు
వృద్ధికి దోహదపడే విధానాల్ని ట్రంప్ అనుసరి స్తారు. ఈ కారణంగా 2017 సంవత్సరానికి పుత్తడి అంచనాల్ని 1,280 డాలర్ల నుంచి 1,200 డాలర్లకు కుదిస్తున్నాం.
– గోల్డ్‌మాన్ శాక్స్ విశ్లేషకులు
ముడిచమురు 51–69 డాలర్ల మధ్యే?
డాలరు పెరగడంతో ఆ కరెన్సీకి అభిముఖంగా పయనించే కమోడిటీలు తగ్గుతాయన్న సహజ అంచనాలు క్రూడ్‌పై కూడా ఉన్నాయి. అమెరికాలో క్రూడ్, గ్యాసోలిన్ నిల్వలు పెరగడం, చమురు అన్వేషణకు మరిన్ని రిగ్గులు అందుబాటులోకి రావడంతో అక్కడ ఉత్పత్తి పెరుగుతుందన్న అంచనాలు క్రూడ్ ధర పెరుగుదలకు బ్రేక్ వేస్తాయనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అయితే చమురు ఉత్పాదక దేశాల మండలి ఒపెక్ క్రూడ్ ఉత్పత్తిలో కోత విధించడం, అమెరికా, ఆసియాలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వంటి అంశాలతో క్రూడ్ ర్యాలీ కొనసాగుతుందని ఇంకొందరు చెబుతున్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వేలో వివిధ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు కొత్త సంవత్సరంలో బ్రెంట్ క్రూడ్ ధర సగటున 54–56 డాలర్ల మధ్య కదలవచ్చని అంచనా వేశాయి. వివిధ అంశాలు ఇందుకు దోహ దపడేవిగా ఉన్నాయని ఈ సర్వేలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు పేర్కొన్నాయి.
అంచనాలు ఇలా...
2017 జూన్‌కల్లా క్రూడ్ ధర 69 డాలర్లకు చేరుతుంది. చమురు, గ్యాస్ అన్వేషణ రంగంలో పెట్టుబడులు తగ్గుతున్నందున క్రూడ్ ధర పెరిగే అవకాశం ఉంది.
–బ్యాంక్ ఆఫ్ అమెరికా
సగటు క్రూడ్ ధర 2017 ప్రధమార్థంలో 55 డాలర్లు, ద్వితీయార్థంలో 57.5 డాలర్ల చొప్పున ఉండవచ్చు. అయితే ట్రంప్ విధానాల కారణంగా అమెరికాలో చమురు ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గొచ్చు.
–గోల్డ్‌మాన్ శాక్స్
2017లో నైమెక్స్ క్రూడ్ ధర సగటున 55 డాలర్ల వద్ద ట్రేడ్ కావొచ్చు.
–ప్రపంచ బ్యాంక్
బ్రెంట్ ధర 51–52 డాలర్ల మధ్య స్థిరపడవచ్చు.
–అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్
రూపాయి.. 70 వరకూ తగ్గవచ్చు..
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై తీసుకునే నిర్ణయాలు, కొత్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించే విధానాల ఆధారంగా డాలరు కదులుతుందని, ఇది పెరుగుతుంటే భారత్ రూపాయితో సహా ఇతర వర్థమాన దేశాల కరెన్సీలు ఒత్తిడికి లోనవుతాయని, డాలరు ర్యాలీకి బ్రేక్ పడితే మన కరెన్సీ విలువ మెరుగుపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు డాలరు పటిష్టంగా వున్నందున, వర్థమాన మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం నెమ్మదిస్తుందని, ఈ కారణంగా 2017 ప్రధమార్థంలో రూపాయి బలహీనంగానే వుండవచ్చని, మెరుగుదల ఏదైనా వుంటే అది ద్వితీయార్థంలోనే సాధ్యపడుతుందని నిపుణులు అంటున్నారు. డాలరుతో రూపాయి మారకపు విలువ 66.50/66.05 నుంచి 69.80/70 శ్రేణిలో కదలవచ్చని అధికశాతం మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విశ్లేషకుల అంచానా..
డీమానిటైజేషన్ తర్వాత పోలిస్తే రూపాయి బలపడింది. ఆర్‌బీఐ డాలర్లను విక్రయించడమే ఇం దుకు కారణం. కానీ కొత్త ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్‌బీఐ డాలరు నిల్వల్ని పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇందుకు తోడు ట్రంప్ విధానాలు, ఫెడ్ రేట్ల పెంపు కారణంగా 2017 ప్రధమార్థంలో 70 స్థాయికి రూపాయి మారకపు విలువ తగ్గవచ్చు
– అనింద్య బెనర్జీ, కరెన్సీ విశ్లేషకుడు, కొటక్ సెక్యూరిటీస్
ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే భారత్ రూపాయి మెరుగ్గానే వుంటుందని అంచనావేస్తున్నాం. కానీ డాలరు బలం కారణంగా రూపాయి కూడా తగ్గవచ్చు. అయితే ఈ క్షీణత ఇతర ఆసియా కరెన్సీలకంటే తక్కువగానే వుంటుంది. 70 వరకూ భారత్ కరెన్సీ తగ్గవచ్చు
– ఐరేన్ చూంగ్, కరెన్సీ స్ట్రాటజిస్ట్, ఏఎన్‌జడ్
గరిష్టంగా 66.05 స్థాయికి పెరగవచ్చు. అనూహ్య పరిస్థితుల్లో 69.80/70 స్థాయికి పతనం కావొచ్చు.
– హిరేన్ శర్మ, సీనియర్ కరెన్సీ విశ్లేషకుడు