అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల రోడ్‌మ్యాప్‌కు అవసరమైన ఆ దేశపు డేటా ప్రపంచ ఇన్వెస్టర్లను అయోమయానికి లోనుచేస్తున్న సమయంలోనే ఫెడ్ చైర్‌పర్సన్ జానెట్ యెలెన్ తాజాగా ఒక బాంబు పేల్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టత తగ్గిపోతున్నద న్న ఆందోళన ఫెడ్ కమిటీ సభ్యుల్లో నెలకొన్నదని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాల్సివుందంటూ గత శుక్రవారం ఒక కార్యక్రమంలో ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఆర్థికాభివృద్ధి బావుందంటూ చెపుతూ వచ్చిన యెలెన్ హఠాత్తుగా చేసిన ఈ కామెంట్‌పై భిన్నమైన అంచనాలు తిరిగి మార్కెట్లో ఏర్పడ్డాయి.
వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ కఠినవైఖరి వహించదన్న కారణంతో మార్కెట్లు పెరుగుతాయన్న అంచనాలు కొన్నయితే...అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందన్న సంకేతాలు అందుతున్నందున, మార్కెట్లు క్షీణిస్తాయన్న అంచనాలు మరోవైపు విశ్లేషకుల్లో ఏర్పడుతున్నాయి. ఇదిలా వుండగా...అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ సమీపిస్తున్నది. ఈ అంశాల నేపథ్యంలో రానున్న 3-4 వారాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాలు...
అక్టోబర్ 14తో ముగిసిన మూడురోజుల ట్రేడింగ్‌వారంలో 27,548 పాయింట్ల కనిష్టస్థాయివరకూ తగ్గిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 387 పాయింట్ల నష్టంతో 27,674 వద్ద ముగిసింది. గతవారం మార్కెట్ పంచాంగంలో సూచించిన 27,715 కీలకస్థాయికి దిగువన వరుసగా 2 రోజులపాటు సెన్సెక్స్ ముగిసిందున, ప్రస్తుత కరెక్షన్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. వెనువెంటనే 28,043-28,068 పాయింట్ల శ్రేణిని (అక్టోబర్ 13నాటి గ్యాప్‌డౌన్ శ్రేణి) దాటకపోతే సెన్సెక్స్ మరింత క్షీణించే ప్రమాదం వుంటుంది.
ఈ వారం మార్కెట్ పెరిగితే పైన ప్రస్తావించిన శ్రేణి వద్ద తొలి అవరోధం కలగవచ్చు. ఆపైన పటిష్టంగా ముగిస్తే క్రమేపీ 28,480 స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం మార్కెట్ క్షీణిస్తే 27,550 సమీపంలో చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 27,350 వద్దకు పతనం కావొచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే కొద్ది వారాల్లో 26,563 పాయింట్ల వరకూ (ఫిబ్రవరి కనిష్టస్థాయి 22,495 పాయింట్ల నుంచి సెప్టెంబర్ గరిష్టస్థాయి 29,077 వరకూ జరిగిన ర్యాలీకి 38.2% రిట్రేస్‌మెంట్ స్థాయి) పతనమయ్యే ప్రమాదం వుంటుంది.
అవరోధ శ్రేణి 8,681-8,704
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,746 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 8,541 కనిష్టస్థాయివరకూ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 115 పాయింట్ల నష్టంతో 8,583 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 8,681-8,704 శ్రేణి (అక్టోబర్ 13నాటి గ్యాప్) వద్ద గట్టి నిరోధాన్ని చవిచూడవచ్చు. ఈ శ్రేణిపైన ముగిసే క్రమేపీ తిరిగి 8,810-8,820 (సెప్టెంబర్ 26నాటి గ్యాప్) కీలక అవరోధ శ్రేణిని చేరవచ్చు. రానున్న రోజుల్లో ఈ రెండో శ్రేణిని దాటితేనే నిఫ్టీ తిరిగి అప్‌ట్రెండ్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ వుంటుంది.
ఈ వారం మార్కెట్ క్షీణిస్తే 8,540 పాయింట్ల సమీపంలో చిన్న మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును పరిరక్షించుకోగలిగితే పైన ప్రస్తావించిన తొలి అవరోధ శ్రేణి ని చేరే అవకాశాలుంటాయి. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 8,475 వ ద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 8,355 పాయింట్ల వరకూ క్షీణించే ప్రమాదం వుంటుంది. ఈ వారం మార్కెట్లో క్షీణత కొనసాగితే రానున్న వారాల్లో 8,150 వరకూ పతనమయ్యే అవకాశాలుంటాయి.
28,068 దాటకపోతే, మరింత క్షీణత..
Published Mon, Oct 17 2016 12:31 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement