వెలుగులో ప్రభుత్వ బ్యాంకు షేర్లు
♦ ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
♦ ప్రభావం చూపిన ఫెడ్, బ్రిటన్ రిఫరెండం
మే నెలలో టోకు ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు అంతర్జాతీయ అంశాల కారణంగా ఇన్వెస్టర్లు జాగురూకత వహించడంతో మంగళవారం స్టాక్ సూచీలు దాదాపు ఫ్లాట్‌గా ముగిసాయి. రోజంతా పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 1 పాయింటు క్షీణతతో 26,396 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల క్షీణతతో 8,109 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రిటైల్ టోకు ద్రవ్యోల్బణాలు రెండూ పెరగడంతో రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయన్న నిరుత్సాహం ఇన్వెస్టర్లలో ఏర్పడిందని విశ్లేషకులు చెప్పారు.
ప్రపంచ మార్కెట్లలో ఆందోళన...
మంగళవారం ప్రారంభమై రెండురోజులపాటు జరగనున్న అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కోసం ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ ఆందోళనతో వేచిచూస్తున్నాయని, దీనికి తోడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలా, వద్దా అనే అంశమై జూన్ 23న జరిగే రిఫరెండం పట్ల మార్కెట్లో భయాలు వున్నాయని విశ్లేషకులు వివరించారు. దాంతో జపాన్, హాంకాంగ్, సింగపూర్ తదితర ఆసియా మార్కెట్లు 1 శాతంవరకూ క్షీణించగా, యూరప్ సూచీలు 2-3 శాతం మధ్య పతనమయ్యాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు క్షీణతతో ట్రేడవుతున్నాయి.
పీఎన్‌బీ 8 శాతం అప్...
ఇక దేశీయంగా సూచీలు ఫ్లాట్‌గా క్లోజయినా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు జోరుగా పెరిగాయి. కంపెనీల రుణ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి బ్యాంకుల కేటాయింపులు, తదితర అంశాల్లో రిజర్వుబ్యాంక్ నిబంధనల్ని సరళీకరించడంతో పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అన్నింటికంటే అధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8 శాతం ర్యాలీ జరిపి రూ. 90 వద్ద ముగిసింది. ఎస్‌బీఐ 2.65 శాతం పెరగ్గా, ఓరియంటల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 4 శాతం చొప్పున, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2 శాతం చొప్పున ఎగిసాయి.