ఫెడ్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఫెడ్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Published Wed, Nov 2 2016 9:51 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM
ఫెడరల్ రిజర్వు మీటింగ్ భయాందోళనతో దేశీయ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయ సంకేతాలు సైతం మార్కెట్లను కుప్పకూల్చాయి. 270 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్, మరింత పడిపోతూ 27,594వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 95.15 పాయింట్ల నష్టంతో 8,513గా ట్రేడ్ అవుతోంది. ఫెడ్ రిజర్వు బ్యాంకు రెండు రోజుల పాలసీ సమావేశం నేడు ముగియనుంది. దీంతో ఫెడ్ రిజర్వు రేట్లపెంపుపై ఎలాంటి ప్రకటన చేస్తుందోనని పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఫెడరల్ సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లను పెంచదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ డిసెంబర్లో రేట్ల పెంపు సంకేతాలను ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
అటు ఆసియన్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై వాల్స్ట్రీట్ చేస్తున్న భయాందోళన ప్రకటన ఆసియన్ మార్కెట్లకు దెబ్బకొట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు చేరువలో ఉన్నారని వాల్స్ట్రీట్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, సీఐఎల్ లాభాలను గడిస్తున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా కోల్పోయింది. మంగళవారం 66.71గా ముగిసిన రూపాయి, నేడు 66.78గా ప్రారంభమైంది.
Advertisement