
మూడువారాల కనిష్టానికి సూచీలు
ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్
ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచడంతో ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ క్షీణించాయి. ఈ ట్రెండ్‌లో భాగంగా భారత్ సూచీలు కూడా తగ్గి...మూడు వారాల కనిష్టస్థాయి వద్ద ముగిసాయి. 31,229 పాయింట్ల గరిష్టస్థాయి వద్ద ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆ స్థాయి నుంచి 200 పాయింట్ల మేర పతనమై..31,026 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. ముగింపులో కాస్త కోలుకుని..చివరకు 80 పాయింట్ల తగ్గుదలతో 31,075 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,621 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 9,560 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత..చివరకు 40 పాయింట్ల నష్టంతో 9,578 పాయింట్ల వద్ద ముగిసింది.
మే నెల 26 తర్వాత ఇంత కనిష్టస్థాయిలో సూచీలు ముగియడం ఇదే ప్ర«థమం. ఫెడ్ పావుశాతం రేట్ల పెంపు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే వుందని, అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా వున్నప్పటికీ, ఈ ఏడాది మరోదఫా రేట్లను పెంచుతామన్న సంకేతాల్ని ఫెడ్ ఛైర్మన్ వెల్లడించడంతో మార్కెట్లు తగ్గాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మరోవైపు జీఎస్‌టీ అమలులోకి కానున్న నేపథ్యంలో ఆయా రంగాల్లో షేర్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఆయన వివరించారు. ఫెడ్ ప్రకటన తర్వాత డాలరుతో రూపాయి మారకపు విలువ 24 పైసలు తగ్గడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని విశ్లేషకులు చెప్పారు.
టీసీఎస్ డౌన్, రిలయన్స్ అప్...
సెన్సెక్స్–30 షేర్లలో ఐటీ దిగ్గజం టీసీఎస్ అత్యధికంగా 2.42 శాతం క్షీణించి రూ. 2,415 సమీపంలో ముగిసింది. క్రితం రోజు 3 శాతంపైగా పెరిగిన రిలయన్స్ తాజాగా మరో 2 శాతం ర్యాలీ జరిపి రూ. 1,383 వద్ద ముగిసింది. జియో చందాదారులు పెరిగారన్న వార్తతో మొదలైన రిలయన్స్ ర్యాలీ, బీపీతో కలిసి రూ. 40,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికను వెల్లడించిన నేపథ్యంలో మరింత ఎగిసిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఆరు రోజులపాటు వరుసగా క్షీణించిన విప్రో షేరు ట్రెండ్ మార్చుకుని 1.86 శాతం పెరిగింది. ఫార్మా షేర్లు డాక్టర్ రెడ్డీస్ లాబ్, సిప్లా, సన్‌ఫార్మాలు 1 శాతంపైగా పెరిగాయి. నిఫ్టీలో భాగమైన అరబిందో ఫార్మా ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించడంతో...ఈ షేరు 6 శాతం మేర ర్యాలీ జరిపింది.
ప్రపంచ మార్కెట్లు డౌన్..: ఫెడ్ రేట్ల పెంపు ప్రభావంతో ప్రపంచ ప్రధాన మార్కెట్లు తిరోగమించాయి. కడపటి సమా చారం అందే సరికి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.