మార్కెట్ పంచాంగం
వడ్డీ రేట్ల పెంపును ప్రస్తుతానికి వాయిదా వేయడంతో పాటు భవిష్యత్తులో రేట్ల పెరుగుదల నెమ్మదిగానే వుంటుందని గత గురువారం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించినా, భారత్ మినహా మిగతా ప్రపంచ మార్కెట్లన్నీ క్షీణించాయి. చైనా మందగమన ప్రభావం అమెరికాపై కూడా పడుతుందన్న ఆందోళనను ఫెడ్ వ్యక్తంచేయడంతో, ఇన్వెస్టర్లు తిరిగి అనిశ్చితిలో పడ్డారు. ఈ కారణంగానే శుక్రవారం అమెరికా మార్కెట్ బాగా నష్టపోయింది. అయితే ఇక్కడ రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలతో గతవారం మార్కెట్ పటిష్టంగా ముగిసినా, అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే ఈ వారం కదలికలు వుండవచ్చు. ఇక భారత్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
సెప్టెంబర్ 18తో ముగిసిన వారంలో క్రమేపీ ర్యాలీ జరిపిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 26,472 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. చివరకు 26,219 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 24న సెన్సెక్స్ భారీగా నష్టపోయినపుడు రికార్డు ట్రేడింగ్ పరిమాణంతో 26,730 స్థాయి నుంచి పతనం జరిగింది. అటు తర్వాత ఆగస్టు నెల చివరి రెండు రోజుల్లో 26,500-26,700 పాయింట్ల మధ్య పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. గత శుక్రవారం కూడా దాదాపు ఇదే శ్రేణి వద్ద భారీ ట్రేడింగ్ పరిమాణం నమోదుకావడంతో పాటు ఆ స్థాయి నుంచి 1 శాతం క్షీణించి, ముగిసింది. ఈ కారణంగా 26,500-26,700 పాయింట్ల శ్రేణికి ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే 30,025 పాయింట్ల రికార్డుస్థాయి నుంచి ఇటీవలి 24,833 పాయింట్ల కనిష్టస్థాయివరకూ జరిగిన పతనంలో 38.2 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్ స్థాయి 26,816 పాయింట్లు.
ఈ స్థాయికి సైతం సాంకేతిక ప్రాధాన్యత వుంది. ఈ రెండు అంశాల వల్ల సమీప భవిష్యత్తులో సెన్సెక్స్‌కు 26,500-26,816 పాయింట్ల శ్రేణి గట్టి అవరోధం కల్పించవచ్చు. పెద్ద అనుకూల వార్త వెలువడితేనే ఈ శ్రేణిని దాటే అవకాశం వుంటుంది. ఈ శ్రేణిని అధిగమించినా, ఆగస్టు 24 నాటి క్రాష్ సందర్భంగా ఏర్పడిన గ్యాప్ (26,730-27,130) కూడా ఇదే శ్రేణి వద్ద వున్నందున, ఈ గ్యాప్ నుంచి కూడా సెన్సెక్స్ వెనుతిరిగే అవకాశాలెక్కువ. రానున్న వారాల్లో 27,130 పాయింట్లపైన స్థిరపడితేనే సూచీ తిరిగి అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశించగలదని చార్టులు వెల్లడిస్తున్నాయి. ఈ వారం మార్కెట్ క్షీణిస్తే 25,800 స్థాయి వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఆ లోపున వేగంగా 25,530 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే తిరిగి 24,830 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.
నిఫ్టీ నిరోధం 8,060-మద్దతు 7,850
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,055 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత చివరకు 193 పాయింట్ల లాభంతో 7,982 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 24నాటి పతనం రోజున, అటు తర్వాత ఆ నెల చివరి రెండు రోజుల్లోనూ 8.060-8,090 శ్రేణి మధ్య తీవ్రస్థాయిలో అమ్మకాలు జరిగాయి. అటుతర్వాత అత్యధిక ట్రేడింగ్ టర్నోవర్ సెప్టెంబర్ 18నే నమోదయ్యింది. అలాగే 9,119 పాయింట్ల రికార్డు నుంచి ఇటీవలి 7,539 పాయింట్ల కనిష్టస్థాయివరకూ జరిగిన పతనంలో 38,2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి 8,142 పాయింట్లు.
పైన ప్రస్తావించిన స్థాయిలకు వున్న సాంకేతిక ప్రాధాన్యత దృష్ట్యా రానున్న రోజుల్లో 8,060-8,142 పాయింట్ల శ్రేణి నిఫ్టీని గట్టిగా నిరోధించవచ్చు. ఆగస్టు 24నాటి పతన సందర్భంలో ఏర్పడిన 8,225-8,060 పాయింట్ల గ్యాప్ కూడా ఇదే శ్రేణి వద్ద వుంది. అంటే..8,060-8,142 శ్రేణిని దాటినా, 8,225 పాయింట్ల వరకూ నిఫ్టీ పదే పదే నిరోధాన్ని చవిచూసే ప్రమాదం వుంటుంది. ఇక ఈ వారం క్షీణత సంభవిస్తే 7,850 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 7,760 పాయింట్ల మద్దతు శ్రేణికి పతనం కావొచ్చు. ఈ శ్రేణిని కోల్పోతే మరోదఫా 7,540 పాయింట్ల స్థాయి వద్దకు తగ్గవచ్చు.
నిరోధ శ్రేణి 26,500-26,800
Published Mon, Sep 21 2015 4:33 AM | Last Updated on Mon, Oct 1 2018 5:28 PM
Advertisement
Advertisement