
ఫోర్బ్స్ కార్యసాధకుల జాబితాలో మనోళ్లు
ఫోర్బ్స్ కార్యసాధకుల జాబితాలో 45 మంది భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు స్థానం దక్కించుకున్నారు.
న్యూయార్క్: ఫోర్బ్స్ కార్యసాధకుల జాబితాలో 45 మంది భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు స్థానం దక్కించుకున్నారు. 30 ఏళ్లలోపు వయసు ప్రాతిపదికగా వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు, వృద్ధికి కృషిచేసిన వారి ఆధారంగా ఫోర్బ్స్ ఈ వార్షిక జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో మొత్తం 600 మంది చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి కన్సూమర్ టెక్ విభాగంలో ఓవైఓ రూమ్స్ సీఈవో రితేశ్ అగర్వాల్ (వయసు 22), స్ప్రింగ్ మొబైల్ యాప్ రూపకర్తలు గగన్ బియాని, నీరజ్ బెర్రీ, ఆల్ఫాబెట్స్ గూగుల్ ఎక్స్ ఉద్యోగిని కరిష్మా షా (25) స్థానం పొందారు. ఇక హాలీవుడ్, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో లిల్లీ సింగ్(27) స్థానం దక్కించుకున్నారు.
ఇంకా భారత్ నుంచి స్థానం పొందిన వారిలో ఫైనాన్స్ విభాగంలో సిటీగ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నీలా దాస్ (27), వికింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ప్రముఖ ఇన్వెస్టర్ అనలిస్ట్ దివ్య నెట్టిమి(29), హెడ్జ్ ఫండ్ మిలీనియమ్ మేనేజ్‌మెంట్ సీనియర్ అనలిస్ట్ వికాస్ పటేల్ (29), కాక్స్‌టన్ అసోసియేట్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్ నీల్ రాయ్ (29) ఉన్నారు. వెంచర్ క్యాపిటల్ విభాగంలో గ్రేక్రాఫ్ట్ పార్ట్‌నర్స్ సీనియర్ అసోసియేట్ విశాల్ లుగాని (26), న్యూ ఎంటర్‌ప్రైజ్ అసోసియేట్స్ సీనియర్ అసోసియేట్ అమిత్ ముఖర్జీ (27) స్థానం దక్కించుకున్నారు.
మీడియా విభాగంలో ఎంఎస్‌ఎన్‌బీసీ సోషల్ మీడియా మేనేజర్ నిశా చిట్టల్ (27), నౌదిస్ మీడియా సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ అశిష్ పటేల్ (29) స్థానం పొందారు. తయారీ రంగంలో ఎంఐటీ విద్యార్థి సంప్రీతి భట్టాచార్య(28), సెంట్రిక్స్ సీఈవో సాగర్ గోవిల్ (29) స్థానం దక్కించుకున్నారు. సామాజిక ఎంట్రప్రెన్యూర్లలో శానిటేషన్, హెల్త్ రైట్స్ వ్యవస్థాపక డెరైక్టర్ అనూప్ జైన్ (28) స్థానం పొందారు.
లా అండ్ పాలసీ విభాగంలో ఫెడరల్ రిజర్వు బోర్డులో మానిటరీ పాలసీ నిపుణుడు అశిష్ కుంభ త్ (26), ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ అడ్వైజర్ దిపయన్ ఘోష్ (27), అనిశా సింగ్ (28) తదితరులు స్థానం దక్కించుకున్నారు. సైన్స్ విభాగంలో కాలిఫోర్నియా బార్కిలీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంజమ్ జార్జ్ (29) స్థానం పొందారు.