గత ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలించలేదు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పంటలకు చీడపీడలు, దోమపోటు.. అరకొర పంటలు చేతికొచ్చినా గిట్టుబాటు ధర దక్కలేదు. పెట్టుబడి అప్పులకు వడ్డీ పెరిగి తడిసి మోపెడయింది. దీనికితోడు కాంప్లెక్స్ ఎరువుల ధర పెంపు నిర్ణయం రబీ ఆశలపై నీళ్లు చల్లింది. వెరసి రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది.
బూర్గంపాడు : ఖరీఫ్ కలిసిరాకపోవడంతో రైతులు ఆశలన్నీ రబీపై పెట్టుకుని సాగుకు ఉపక్రమించారు. తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచేందుకు ఆయా కంపెనీలు నిర్ణయించడంతో ఆందోళన మొదలైంది. ఫిబ్రవరి నుంచి ఎరువుల ధరలు పెరుగుతాయని డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వపరంగా ఎరువుల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఎరువుల తయారీలో వినియోగించే ముడిసరుకు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరగటంతో ఎరువుల కంపెనీలు ధరలను పెంచేందుకు నిర్ణయించుకున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరలను సుమారు 10శాతానికి పైగానే పెంచేందుకు కంపెనీలు నిర్ణయించాయి.
డీఏపీ ధర ప్రస్తుతం రూ. 1100 వరకు ఉంది. దీని ధర సుమారు రూ.125 వరకు పెరిగే అవకాశముంది. రైతులు అధికంగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువు 20:20:00:13 ధర బస్తా ప్రస్తుతం రూ 900 వరకు ఉంది. దీని ధర సుమారు రూ 100 వరకు పెరిగే అవకాశముంది. 28:28:00 ధర కూడా రూ.125 వరకు పెరగవచ్చు. వీటితో పాటు 14:35:14 ధర రూ. 130, 10:26:26 ధర రూ 110 వరకు, 17:17:17 ధర రూ 70 వరకు పెరిగే అవకాశాలున్నట్లు డీలర్లు రైతులకు ముందుగానే తెలియపరుస్తున్నారు. పెరగనున్న ధరలు రబీసాగు రైతులకు భారం కానున్నాయి.
రైతులకు పెరగనున్న పెట్టుబడి భారం
జిల్లావ్యాప్తంగా రబీలో సుమారు 11 వేల హెక్టార్లలో వరిపంట సాగుచేస్తున్నారు. 1200 హెక్టార్లలో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఇవిగాక కూరగాయలు, అపరాలు మొత్తం కలిపి మరో 2500 హెక్టార్లలో రబీలో సాగుచేస్తున్నారు. రబీ పంటల సాగు మొదలై కేవలం నెలరోజులు కావస్తోంది. రైతులు మొదటిధపా ఎరువులు మాత్రమే వేసుకున్నారు. ఇంకా రెండో, మూడో విడతల్లో పంటలకు ఎరువులు వేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచితే రైతులపై ఎకరాకు కనీసం రూ.400కు పైగానే భారంపడే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎరువులను పాతధరలకే విక్రయించాల్సిఉంది. కొత్తగా వచ్చేటువంటి ఎరువుల స్టాక్ మాత్రం కొత్తరేట్లలో అమ్మకాలు చేయాల్సిఉంటుందని డీలర్లు చెబుతున్నారు. పెట్టుబడులకు కటకటలాడుతున్న సమయంలో ఎరువుల ధరలు పెంచితే సాగు భారమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలను పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment