న్యూయార్క్ నగరం- ఫ్రీడం టవర్
బార్సిలోనా : ప్రపంచంలోనే అత్యంత ఆకర్షయణీయ నగరం(స్మార్ట్ సిటీ)గా న్యూయార్క్ నిలిచింది. స్పెయిన్‌కు చెందిన ప్రఖ్యాత ఐఈఎస్‌ఈ బిజినెస్ స్కూల్ పరిశోధన సంస్థ విడుదల చేసిన ఐఈఎస్‌ఈ సిటీస్ ఇన్ మోషన్ ఇండెక్స్- 2018 ప్రకారం ‘బిగ్ ఆపిల్ సిటీ’ వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించింది. ఐఈఎస్‌ఈ విడుదల చేసిన జాబితా ప్రకారం లండన్, పారిస్, టోక్యో, రెజావిక్, సింగపూర్, సియోల్, టొరంటో, హాంగ్‌కాంగ్, ఆమ్‌స్టర్‌డామ్ నగరాలు టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాయి. కాగా యూరప్ నుంచి 12, ఉత్తర అమెరికా నుంచి 6, ఆసియా నుంచి 4 నగరాలు టాప్ 25 స్మార్టెస్ట్ సిటీలుగా నిలిచాయి.
మెరుగైన నగరాల కోసం...
తొమ్మిది ప్రామాణిక అంశాల ఆధారంగా సుమారు 80 దేశాలకు చెందిన 165 సిటీల నుంచి 25 స్మార్ట్ సిటీలను ఎంపిక చేసినట్లు ఐఈఎస్‌ఈ తెలిపింది. సుస్థిరాభివద్ధి, ప్రతిభావంతులైన మానవ వనరులు, శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ, వివిధ సామాజిక నేపథ్యాలు, పర్యావరణం, పాలన, పట్టణ ప్రణాళిక, అంతర్జాతీయ సంబంధాలు, సాంకేతికత, రవాణా తదితర అంశాల్లో టాప్‌గా నిలిచిన న్యూయార్క్‌ను స్మార్టెస్ట్ సిటీగా గుర్తించినట్లు ఐఈఎస్‌ఈ పేర్కొంది. గత నాలుగేళ్లుగా ర్యాంకులను ప్రకటిస్తున్నామన్న ఐఈఎస్‌ఈ ప్రతినిధులు.. ఐదో ఎడిషన్‌లో(2018) నూతన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఉగ్రదాడుల సంఖ్య, తలసరి ఆదాయం, ఉష్ణోగ్రత పెరుగుదల వంటి అంశాలు ఈ జాబితా ఎంపికలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ర్యాంకింగ్ వ్యవస్థ వల్ల పాలకుల్లో పోటీ ఏర్పడుతుందని, తద్వారా మెరుగైన నగరాలు రూపుదిద్దుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment