రేటు విని.. గుండె జారి గల్లంతయిందే
కొన్నిసార్లు షాపింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే కొన్ని వస్తువులు విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఆ వస్తువులను కొనడానికి సరిప డేంత డబ్బులేనప్పుడు.. వాటిని కాసేపు పట్టుకొని చూసి అక్కడ పెట్టేసి రావడం చేస్తుంటారు కొందరు. సరిగ్గా ఇలాచేసే ఓ చైనా మహిళ స్పృహ తప్పి పడిపోయింది! యునాన్ ప్రావిన్స్ రూయిలి పట్టణంలో ఓ షాపులోకి వెళ్లిన మహిళ.. పచ్చరాయితో చేసిన బ్రాస్లెట్ను చూసి ముచ్చటపడింది. కొనకపోయినా పర్లేదు కనీసం చూద్దామని చేతిలోకి తీసుకుంది. అయితే అదికాస్తా జారి కిందపడటంతో 2 ముక్కలైంది. ఈ విషయాన్ని గమనించిన షాప్ యజమాని బ్రాస్‌లెట్‌కు డబ్బు చెల్లించాల్సిందిగా దాని ఖరీదును ఆ మహిళకు చెప్పాడు.
అంతే ఆ రేటు విన్న మహిళ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపు ఫిట్స్ వచ్చినట్లు నేలపై పడి కొట్టుకుంది. అక్కడివారు మొహం మీద కాసిన్ని నీళ్లు చల్లాక లేచి కూర్చున్న ఆ మహిళ.. బ్రాస్లెట్ రేటు 3,00,000 యువాన్లు (రూ. 28.60 లక్షలు) అని వినగానే స్పృహ తప్పానని చెప్పింది. ఆ మహిళ తరఫువారు 70,000 యువాన్లు రూ. (6.67 లక్షలు) చెల్లిస్తామని చెప్పినా యజమాని ఒప్పుకోకపోవడంతో చివరకు 1,80,000 యువాన్ల (రూ. 17.16 లక్షలు)కు బేరం కుదుర్చుకొని పగిలిపోయిన బ్రాస్లెట్ను పట్టుకెళ్లారు.