కూతురు జాడ కోసం తుది శ్వాస వరకు ఆరాటపడ్డ ఓ తల్లి వ్యథ! | Unsolved Mystery Stories: What Happened To Coconut Groves Amy Billig In 1974 - Sakshi
Sakshi News home page

Amy Billig Mystery: కూతురు చనిపోయిందో లేక బతికుందో అర్థంకాక ఓ తల్లి పడిన వ్యథ! నేటికి అంతు చిక్కని మిస్టరీ ఆ మిస్సింగ్‌ కేసు

Published Tue, Oct 24 2023 9:28 AM | Last Updated on Tue, Oct 24 2023 11:47 AM

Unsolved Mystery: What Happened To Coconut Groves Amy Billig - Sakshi

అమీ, సుసానీ(1973 నాటి ఫైల​ ఫోటో

కాలం ఎప్పుడూ.. బంధాల కోసం పాకులాడే అనురాగాలతో పాటు, ఆ బలహీనతలతో ఆటలాడుకునే నైజాన్ని సరితూకమేస్తుంది. జరిగినదాంట్లో పాపపుణ్యాలను పక్కనపెడితే చివరికి మిగిలిన వ్యథే.. ఎన్నో హెచ్చరికలను జారీ చేస్తుంది. సుమారు యాభై ఏళ్ల క్రితం అదృశ్యమైన ‘అమీ బిల్లిగ్‌’ అనే అమ్మాయి ఉదంతం అలాంటిదే.

అమెరికా, ఫ్లోరిడాలోని మయామిలో ‘కోకోనట్‌ గ్రోవ్‌’ సమీపంలో నివసించే నెడ్‌ బిల్లిగ్, సుసాన్‌ బిల్లిగ్‌ దంపతులు.. కూతురు అమీ, కొడుకు జోస్‌తో కలసి సంతోషంగా జీవించేవారు. తండ్రి నెడ్‌ ఆర్ట్‌ గ్యాలరీ నడుపుకుంటుంటే.. తల్లి సుసాన్‌  ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తూ .. వచ్చినదానితోనే పిల్లల్ని ప్రాణంగా చూసుకునేవారు. జోస్‌ కంటే అమీ సుమారు పదేళ్లు పెద్దది. అమ్మాయికి యుక్త వయసు వచ్చేనాటికి.. ఆ కుటుంబాన్ని ఊహించని ఉపద్రవం ముంచెత్తింది.

అది 1974 మార్చి 5, మధ్యాహ్నం 12 దాటింది. పదిహేడేళ్ల అమీ.. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చింది. రాగానే ఆర్ట్‌ గ్యాలరీకి కాల్‌ చేసి.. తండ్రితో మాట్లాడింది. ‘డాడ్‌.. నేను మా స్నేహితులతో కలసి హోటల్లో లంచ్‌కి వెళ్తున్నా.. నాకు 2 డాలర్లు కావాలి’ అని కోరింది. ‘సరే.. గ్యాలరీకి వచ్చి తీసుకెళ్లమ్మా’ అన్నాడు నెడ్‌. వెంటనే రెడీ అయ్యి.. కెమెరా పట్టుకుని.. ‘అటు నుంచి అటే వెళ్తా మమ్మీ’ అని తల్లికి చెప్పి.. తండ్రి దగ్గరకు బయలుదేరింది అమీ. ఇంటి నుంచి గ్యాలరీకి పావుగంట పడుతుంది. దాంతో కాసేపట్లో కూతురు వస్తుందని నెడ్‌ ఎదురు చూడసాగాడు. గంటదాటినా రాలేదు. ‘ఒకవేళ డబ్బులు వద్దనుకుని వెళ్లిపోయిందేమో’ అని సరిపెట్టుకున్నాడు నెడ్‌.

సాయంత్రం ఇంటికెళ్లి చూస్తే.. కూతురు ఇంకా ఇల్లు చేరలేదు. మధ్యాహ్నం వెళ్లిన అమ్మాయి.. రాత్రి కావస్తున్నా రాకపోయేసరికి భయమేసింది. పైగా అమీ డబ్బులు తీసుకోవడానికి తన దగ్గరకు కూడా రాలేదనే భర్త మాటలు విని.. సుసాన్‌కి గుండె ఆగినంత పనైంది. వెంటనే ఆమె స్నేహితుల్ని ఆరా తీస్తే.. తెలియదనే సమాధానమే వినిపించింది. పోలీసుల్ని ఆశ్రయిస్తే.. ‘ఈ రోజుకి చూడండి.. రేపటికీ రాకపోతే కేసు నమోదు చేసుకుందాం’ అనే బదులొచ్చింది. మరునాడు కూడా అమీ అడ్రస్‌ లేకపోయేసరికి.. అన్నమాట ప్రకారం పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వెతుకులాటలోనే వైల్డ్‌వుడ్‌ ఎగ్జిట్‌ అనే హైవే రోడ్‌లో అమీ తీసుకెళ్లిన కెమెరా దొరికింది. దానిలోని ఏ ఫొటో.. తదుపరి విచారణకు సహకరించలేదు.

కొన్ని రోజులకు.. నెడ్‌ దంపతులకు ఓ నంబర్‌ నుంచి బెదిరింపు కాల్స్‌ రావడం మొదలయ్యాయి. ఆ కాల్స్‌లో ప్రతిసారి.. ‘మమ్మీ, డాడీ కాపాడండి’ అంటూ ఏడ్చే అస్పష్టమైన అమ్మాయి స్వరం వారిని వణికించింది. ‘పోలీసులకు చెప్పకుండా 30 వేల డాలర్లు ఇస్తే.. మీ అమ్మాయిని వదిలిపెడతాం.. లేదంటే చంపేస్తాం’ అనే హెచ్చరిక.. వారి కన్నపేగును మెలిపెట్టింది. దాంతో వారు చెప్పిన సమయానికి.. అడిగినంత డబ్బు పంపించేశారు. అయితే రోజులు గడిచినా అమీ తిరిగి రాలేదు. కనీసం ఆ నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ కూడా లేవు. తిరిగి కాల్‌ చేస్తే కలవలేదు. దాంతో నెడ్‌ దంపతులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కూపీ లాగిన పోలీసులు.. ఆ బెదిరింపు కాల్స్‌ చేసింది చార్ల్స్, లారే గ్లాసర్‌ అనే కవలలని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. చివరికి వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే అలా చేశారని.. అమీ మిస్సింగ్‌కి వాళ్లకి ఏ సంబంధం లేదని తేలింది. అమీ తల్లిదండ్రుల ఎమోషన్స్‌తో ఆడుకున్నందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. మరికొన్ని రోజులకు.. ‘ది అవుట్‌లాస్‌’ అనే మోటర్‌సైకిల్‌ గ్యాంగ్‌.. అమీని కిడ్నాప్‌ చేసుండొచ్చు అనే కొందరు స్థానికుల అనుమానం.. నెడ్‌ దంపతుల్ని బెదరగొట్టింది. దాంతో నెడ్‌ ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఒకరు.. పోలీసులతో సంబంధం లేకుండా.. ఓ అనుమానిత బైక్‌ ముఠా సభ్యులతో నెడ్‌ కుటుంబానికి రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. అమీ ఫొటోలు చూసిన ఆ ముఠా సభ్యుల్లో కొందరు.. ‘మేము అమీనైతే చూడలేదు.

కానీ, గతంలో కొందరు అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేసి అమ్ముకున్న మాట వాస్తవమే’ అని ఒప్పుకున్నారు. అందులో కొందరు కేవలం క్రెడిట్‌ కార్డ్స్‌ కోసం, బైక్స్‌ కోసమే అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేసి, విక్రయించినట్టు చెప్పారు. అమీ వివరాలు ఇతర బైకర్స్‌ నుంచి సంపాదిస్తామని నెడ్‌ ఫ్యామిలీకి మాటిచ్చారు. కానీ వాళ్ల నుంచి ఆ తర్వాత ఎలాంటి సహాయమూ అందలేదు, సమాచారమూ రాలేదు. అయితే అంతకు ఐదేళ్ల క్రితం బైకర్‌ ముఠాకు చిక్కిన ‘గినా ఆండ్రూ’ అనే అమ్మాయి తప్పించుకుని క్షేమంగా తిరిగి రావడంతో.. అమీ కూడా అలాగే తిరిగి వస్తుందని ఆశపడింది నెడ్‌ కుటుంబం. కానీ అలా జరగలేదు.

అమీ తల్లి సుసాన్‌.. కూతురి ఫొటోలు పట్టుకుని పిచ్చిదానిలా చాలా చోట్ల వెతికింది. ఆ క్రమంలోనే తమ ఇంటికి 160 మైళ్ల దూరంలో ఉన్న ఒక కన్వీనియెన్స్‌ స్టోర్‌ మేనేజర్‌ని కలిసింది. అమీ ఫొటో చూసి గుర్తుపట్టిన ఆ మేనేజర్‌.. ‘అమీ ఇద్దరు బైకర్స్‌తో కలసి చాలాసార్లు మా స్టోర్‌కి వచ్చింది. ఆమె వెజిటేరియన్‌ కావడంతో తను నాకు బాగా గుర్తుంది’ అని చెప్పాడు. అతని మాట విన్న కొన్ని పత్రికలు.. అమీ తన ఇష్టప్రకారమే కుటుంబానికి దూరంగా పారిపోయిందనే కథనాలను అల్లాయి. ఆ ఊహాగానాల్లో ఏడాది గడిచిపోయింది. సుసాన్‌ మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదు. ఎవరి మాటలూ నమ్మలేదు. ఒకరోజు ఓ కొత్త నంబర్‌ నుంచి నెడ్‌ కుటుంబానికి కాల్‌ వచ్చింది. ‘నా పేరు జాన్సన్‌.. అమీ గురించి మరచిపొండి, తనని వెతకొద్దు.. నేనో సెక్స్‌ రాకెట్‌ సభ్యుడ్ని. తనని బంధించింది నేనే’ అని బెదిరించాడు అవతలి వ్యక్తి.

కాసేపటికే ఫోన్‌ కట్‌ అయ్యింది. అతడి నుంచి వరసగా కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. కానీ అతడు పబ్లిక్‌ బూత్‌ నుంచి కాల్స్‌ చేస్తుండడంతో పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆ బెదిరింపు కాల్స్‌ నెడ్‌ కుటుంబాన్ని మరింత కుంగదీశాయి. ‘అమీ మాట వినలేదని నాలుక కత్తిరించాం. మీరు ఇలానే అమీ కోసం వెతుకుతూ ఉంటే ఆమెను చంపేస్తాం. అమీని కిడ్నాప్‌ చేసినట్లే.. నిన్ను కూడా కిడ్నాప్‌ చేస్తాం’ అని సుసాన్‌ని వీలు చిక్కినప్పుడల్లా హడలెత్తించాడు జాన్సన్‌. అసభ్యకరమైన పదజాలంతో హింసించేవాడు. వేధింపులు ఎక్కువైనా.. ఏదో ఒకరోజు జాన్సన్‌.. అమీ గురించి నిజం చెబుతాడేమోనన్న ఆశతో ఫోన్‌ నంబర్‌ మార్చలేదు నెడ్‌ కుటుంబం.  

 ఇక 1975 చివరిలో డేవిడ్‌ అనే ఒక ముఠా సభ్యుడు సుసాన్‌ని వ్యక్తిగతంగా కలిశాడు. ‘ఒక వార్తాపత్రికలో అమీ ఫొటో చూసి, గుర్తుపట్టి వచ్చాను. ఆమె నాకు బాగా తెలుసు’ అని చెప్పాడు. ‘ఎలా తెలుసు?’ అని అడిగితే.. ‘చట్టవిరుద్ధంగా ఒక ముఠాకి కొంత డబ్బు ఇచ్చి.. కొన్ని నెలలకుగాను అమీని నేను కొన్నాను. ఆమె నా దగ్గరున్నంత కాలం దిగులుగానే ఉంది. మూగది కావడంతో తన బాధ నాకు అర్థం కాలేదు’ అని చెప్పాడు. ఆ అమ్మాయి మూగది అనడంతో.. జాన్సన్‌ మాటలు గుర్తొచ్చాయి సుసాన్‌కి. అమీ ఒంటిమీదుండే రహస్య పుట్టుమచ్చల వివరాలు డేవిడ్‌ నోట వినడంతో.. తన నమ్మకం బలపడింది. అయితే సుసాన్‌ ఆవేదన చూడలేకపోయిన డేవిడ్‌.. అమీని వెతకడంలో సాయం చేస్తానని మాటిచ్చాడు.

ఆ మాట ప్రకారమే డేవిడ్‌.. ఒకరోజు సుసాన్‌ని అసాంఘిక ప్రదేశానికి తీసుకెళ్లి.. అక్కడున్న ఓ ముఠా దగ్గర అమీ గురించి ఆరా తీశాడు. తీరా వారికి డేవిడ్‌ మీద అనుమానం వచ్చి దాడికి దిగారు. అదృష్టవశాత్తూ సుసాన్‌ తప్పించుకోగలిగింది. సరిగ్గా ఐదువారాలకు కాళ్లు, చేతులకు కట్లతో డేవిడ్‌.. సుసాన్‌ దగ్గరకు వచ్చాడు. ఓక్లహామా, తుల్సాలోని ఒక బార్‌లో అమీ పనిచేస్తున్నట్లు తెలిసిందని సమాచారమిచ్చి వెళ్లిపోయాడు. తిరిగి ఎప్పుడూ సుసాన్‌ని అతడు కలుసుకోలేదు. కూతురు మీద బెంగతో సుసాన్‌కి గుండెపోటు వచ్చింది. అయినా సరే.. కూతురి కోసం తుల్సా వెళ్లి.. అక్కడే కొన్ని నెలల పాటు ఉండి.. సమీపంలోని బార్లు, టాటూ సెంటర్స్‌ అన్నీ వెతికింది. అయితే అమీ ఫొటో చూసిన కొందరు.. డేవిడ్‌ చెప్పినట్లే ఆమె మూగ అమ్మాయిగా గుర్తు చేసుకున్నారు.

ఏళ్లు గడిచాయి. జాన్సన్‌ వేధింపులూ ఆగలేదు. సుసాన్‌కి మరో రెండుసార్లూ గుండెపోటు వచ్చింది. అమీ మిస్‌ అయిన నాటికి బాలుడిగా ఉన్న జోస్‌ పెద్దవాడయ్యాడు. తల్లితో పాటు తన అక్క కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇక తండ్రి నెడ్‌ 1993లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడ్డాడు. చనిపోయే ముందు చివరిసారిగా అమీని చూడాలని ఆరాటపడ్డాడు. జాన్సన్‌  కాల్‌ కోసం ఎదురు చూసిన సుసాన్‌.. నెడ్‌ పరిస్థితి వివరించి.. తన కూతుర్ని చూపించమని వేడుకుంది. అయినా జాన్సన్‌ నుంచి సమాధానం రాలేదు. చివరికి నెడ్‌ తన కోరిక తీరకుండానే మరణించాడు.


                                        హెన్రీ(ఎడమవైపు), అమీ(కుడివైపు)                                ​​​​​​

సుమారు 20 ఏళ్లకి.. పోలీసులు జాన్సన్‌ని అదుపులోకి తీసుకోగలిగారు. అయితే అతడి పూర్తిపేరు హెన్రీ జాన్సన్‌ బ్లెయిర్‌ అని.. కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. తీరా అధికారులు తమదైన శైలిలో విచారిస్తే.. ‘అమీ నాకు తెలియదు. కేవలం సెక్సువల్‌ ప్లెజర్‌ కోసమే నెడ్‌ కుటుంబానికి అలా బూటకపు కాల్స్‌ చేసేవాడ్ని’ అని చెప్పాడు. అతడో ‘మానసిక రోగి, మద్యానికి బానిస’ అని అతడి సన్నిహితులు తెలిపారు. అతడు మరికొందరికి చేసిన ఇలాంటి బూటకపు కాల్స్‌ అధికారికంగా నిరూపితమయ్యాయి. దాంతో నెడ్‌ కుటుంబానికి హెన్రీ జాన్సన్‌ కలిగించిన మనోవ్యథకు జైలు శిక్ష పడింది.

అయితే హెన్రీ జాన్సన్‌.. అమీకి సుపరిచితుడేనని తేల్చాయి కొన్ని ఆనవాళ్లు. అమీ ఫొటోస్‌లో ఉన్న ఒక తెల్ల కారు.. హెన్రీ జాన్సన్‌ దగ్గరుంది. అలాగే అమీ తన డైరీలో ఒక చోట ‘హంక్‌ అనే స్నేహితుడు నన్ను దక్షిణ అమెరికా తీసుకెళ్తా అన్నాడు’ అని రాసుకుంది. ఆశ్చర్యకరంగా కస్టమ్స్‌ ఏంజెంట్‌గా హెన్రీ జాన్సన్‌ మారుపేరు హంక్‌. అయితే స్పష్టమైన మరే ఇతర సాక్ష్యాలు లేకపోవడంతో హెన్రీ ఈ కేసు నుంచి బయట పడ్డాడు. ఇక 1997లో ఒక మహిళ.. పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి ‘పాల్‌ బ్రాండ్‌’ అనే వ్యక్తి నా భర్త, మోటర్‌సైకిల్‌ ముఠా మాజీ సభ్యుడు, అతడు చనిపోతూ అమీ వివరాలు చెప్పాడు’ అని షాకిచ్చింది.

ఆమె మాటలకు అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. పాల్‌ ఆమెతో చెప్పిన మాటల సారాంశం ఇలా ఉంది. ‘ఒకసారి అమీ.. మోటర్‌సైకిల్‌ ముఠా సభ్యులను అవమానించిందనే కక్షతో ఆమెను కిడ్నాప్‌ చేసి, ఫ్లోరిడా ఎవర్‌గ్లేడ్స్‌ పార్టీకి తీసుకెళ్లాం. ఆమెపై పలుమార్లు లైంగికదాడి చేశాం. ఆమెను లొంగదీసుకోవడానికి చాలాసార్లు డ్రగ్స్‌ ఇంజెక్ట్‌ చేయడంతో ఆమె చనిపోయింది. దాంతో ఆ రాత్రికే ఓ చిత్తడి నేలలో ఆమెను పూడ్చిపెట్టాం’ అని చనిపోయే ముందు భార్యతో చెప్పాడట పాల్‌. దీన్ని నమ్మేందుకు ఒక ఆధారం ఉంది. అమీ మిస్‌ అయిన కోకోనట్‌ గ్రోవ్‌కి.. పాల్‌ చెప్పిన క్రైమ్‌ జరిగిన ఎవర్‌గ్లేడ్స్‌కి మార్గం మధ్యలోనే అమీ తీసుకెళ్లిన కెమెరా దొరికింది.

మొదట పాల్‌ మాటల్ని నమ్మిన సుసాన్‌ కుటుంబం.. అమీకి స్మారక చిహ్నం కూడా కట్టించింది. కానీ పాల్‌ పబ్లిసిటీ కోసం ఈ కథను సృష్టించి ఉంటాడేమో అనే ఆలోచన రావడంతో మళ్లీ అమీ కోసం వెతకడం మొదలుపెట్టింది ఆ కుటుంబం. దురదృష్టవశాత్తు సుసాన్‌ .. 2005, జూన్‌  7న ఎనభై ఏళ్ల వయసులో మరణించింది. ఇప్పుడు అమీని వెతికే బాధ్యతను.. జోస్‌ అందుకున్నాడు. అసలు.. అమీ ఎవరినైనా గుడ్డిగా నమ్మి మోసపోయిందా? లేక బలవంతంగా అపహరణకు గురైందా? హెన్రీ జాన్సన్‌ మాటల్లో వాస్తవమెంత? పాల్‌ తన భార్యకు చెప్పింది నిజమేనా? డేవిడ్‌ ఏమయ్యాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే.
∙సంహిత నిమ్మన 

(చదవండి:

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement