బద్వేలు అర్బన్ : రెండేళ్ల క్రితం బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఓ మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇటీవల జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ జిల్లాలోని మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రూరల్ పోలీసులు విచారణ చేపట్టగా సంచలన నిజాలు వెలుగు చూశాయి.
సదరు తప్పిపోయిన మహిళ పొలానికి వేసిన విద్యుత్ కంచె తగులుకుని మృతిచెందగా పొలం యజమానితో పాటు మరికొందరు కలిసి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టినట్లు తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ ఎస్.ఆర్.వంశీధర్‌గౌడ్ వివరించారు.
బద్వేలు మండలం మల్లంపేట గ్రామానికి చెందిన బొల్లా రామసుబ్బమ్మ (49) అనే మహిళ తన భర్తతో ఏర్పడిన విభేదాలతో సిద్దవటం మండలం జ్యోతి సమీపంలోని గొల్లపల్లె గ్రామంలోని ఆమె సోదరుని ఇంటి వద్ద నివసిస్తుండేది. అయితే 2020వ సంవత్సరం జూలై 9వ తేదీన తమ తల్లి కనిపించడం లేదని ఆమె కుమారుడు శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్ని నెలల పాటు విచారించి ఆచూకీ లభించకపోవడంతో పెండింగ్ కేసుగా ఉంచారు. ఇటీవల కాలంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ జిల్లాలోని మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి తిరిగి విచారణ చేయాలని ఆదేశించడంతో తన పర్యవేక్షణలో రూరల్ సీఐ హనుమంతనాయక్, ఎస్‌ఐ చంద్రశేఖర్, సబ్ డివిజన్ ఐడీపార్టీ సిబ్బందితో కలిసి విచారణ ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో సిద్దవటం గొల్లపల్లె గ్రామంలోని జ్యోతిరామకృష్ణారెడ్డికి చెందిన పొలానికి అమర్చిన విద్యుత్ తీగల కంచె తగులుకుని ఓ మహిళ మృతి చెందిందని సమాచారం లభించింది. దీనిపై సదరు పొలం యజమానిని పూర్తిస్థాయిలో విచారించగా అసలు విషయం బయటపడింది. పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగులుకుని మహిళ మృతి చెందడంతో మరికొందరి సహాయంతో సిద్దవటం సమీపంలోని పెన్నానదిలో పూడ్చినట్లు విచారణలో తేలింది. తర్వాత పెన్నానదిలో పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీసి మృతదేహానికి ఉన్న చీర, జాకెట్ ఆధారంగా మృతురాలు అప్పట్లో తప్పిపోయిన రామసుబ్బమ్మగా నిర్ధారణకు వచ్చిఏడుగురిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనలో పొలం యజమాని రామకృష్ణారెడ్డితో పాటు ఇందుకు సహకరించిన లక్షుమయ్య, వెంకటయ్య, కొండయ్య, వెంకటరమణ, వెంకటసుబ్బయ్యలను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచామని, ఈ కేసులో మరొక నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ హనుమంతనాయక్, ఎస్‌ఐ చంద్రశేఖర్, ఏఎస్‌ఐలు రాజశేఖర్‌రెడ్డి, నరసింహారావు, ఐడీపార్టీ ఏఎస్‌ఐలు రాంభూపాల్‌రెడ్డి, నాగేంద్ర, కానిస్టేబుళ్లు శివ, అమరేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌లను జిల్లా ఎస్పీ, మైదుకూరు డీఎస్పీలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment