హత్యా ఘటన స్థలంలో విచారణ జరుపుతున్న పోలీసులు (ఫైల్)
‘దిశ’ హత్యాచారం ఘటనతో దేశం మొత్తం అట్టుడికిపోయింది. నిందితులను తక్షణమే ఉరితీయాలనే డిమాండ్ అన్ని వర్గాలనుంచి వినిపించింది. సరిగ్గా అదే సమయంలో కామారెడ్డిలోనూ ఓ మహిళ హత్యోదంతం వెలుగుచూసింది. అయితే ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికీ ఆ కేసు మిస్టరీగానే ఉంది.
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రానికి సమీపంలోని పెద్ద చెరువు మత్తడి వాగు కాలువలో గతనెల 25న ఓ మహిళ మృతదేహం కనిపించింది. తల లేదు. మొండెం మాత్రమే ఉంది. అదీ కుళ్లిపోయి ఉంది. ఒంటిపైన జాకెట్ బట్ట తప్ప వేరే దుస్తులు లేవు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి.. 25 నుంచి 30 ఏళ్ల గుర్తు తెలియని మహిళ.. పది రోజుల క్రితమే హత్యాచారానికి గురై ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆధారాల కోసం సంఘటన స్థలంలో చుట్టుపక్కల వెతికారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించినా ప్రయోజనం లేకపోయింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకునేందుకుగాను టవర్ డంప్ ఏర్పాటు చేశారు. అయితే లక్షల ఫోన్ కాల్స్ ఉండడంతో విచారణలో అడ్డంకులు చోటు చేసుకున్నాయి. ఎక్కడో చంపి తలను వేరు చేసి, మొండాన్ని పెద్ద చెరువు మత్తడి వాగు కాలువలో పడేసి ఉంటారని భావిస్తున్నారు.
హతురాలు ఎవరో తెలిస్తేనే..
ఎంతటి నేరస్తుడయినా ఏదో ఒక తప్పు చేసి పోలీసులకు చిక్కుతుంటారు. చిన్న క్లూ దొరికినా పోలీసు విచారణ ముందుకు సాగుతుంది. అయి తే మహిళను హత్య చేసిన వ్యక్తులు.. ఆమె వివరాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. హతురాలు ఎవరో తెలిస్తే పోలీసులకు దొరికిపోతామనే ఆలోచనలతో తల తీసేసి, బట్టలు, ఇతర వస్తువులు, ఆనవాళ్లు లేకుండా చేశారు. హత్యకు గురైన మహి ళ చేతివేళ్లను సైతం చెక్కినట్లు తెలుస్తోంది. వేలిముద్రలు నమోదు కాకుండా ఉండేందుకు ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది. ఇది ఒకరితో సాధ్య మయ్యే పనికాదనీ, హంతకులు ఒకరికి మించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతు రాలి తలను సంఘటన స్థలానికి సమీపంలో ఐదు రోజుల తర్వాత గుర్తించారు. కానీ అప్పటికే కుళ్లిపోవడంతో ఎలాంటి వివరాలు తెలియ లేదు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటున్న పోలీసులు.. మిస్సింగ్ కేసుల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. కామారెడ్డితో పాటు చు ట్టు పక్కల ప్రాంతాల్లో ఇటీవల అదృశ్యమైన మహి ళల వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి మగ్గురు మహిళల మిస్సింగ్ కేసులను పరిశీలించగా వారిలో ఇద్దరు మహిళల ఆచూకీ ఉన్నట్లుగా తెలిసింది. మరో మహిళ మిస్సింగ్ కేసుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, పాత కేసులను పరిశీలిస్తున్నారు.
ఈ ‘దిశ’కు న్యాయం జరిగేదెప్పుడో?
హత్యకు గురైన మహిళ ఎవరనేది తెలియకపోవడంతో హంతకులు ఎవరో కనుక్కోవడం కష్టసాధ్యంగా మారింది. ఈ కేసును జిల్లా పోలీసులు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పన్నెండు రోజులు గడిచినా సరైన ఆధారాలు లభించకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. షాద్‌నగర్‌లో ‘దిశ’పై క్రూరంగా లైంగిక దాడి చేసి హతమార్చిన సమయంలోనే కామారెడ్డి పెద్ద చెరువు మత్తడి వాగులో మహిళ మృతదేహం కనిపించింది. ఆ ఘటనలో బలైన ‘దిశ’ ఆత్మ శాంతించేలా నలుగురు నిందితులూ శుక్రవారం ఎన్‌కౌంటర్ అయ్యారు. కానీ ఇక్కడ మాత్రం కేసు ముందుకు సాగడం లేదు. ఈ ‘దిశ’ ఆత్మ శాంతించేది ఎప్పుడో?
చదవండి: హత్యకు గురైన మహిళ తల లభ్యం
Comments
Please login to add a commentAdd a comment