కామారెడ్డిలో పట్టుబడ్డ గుట్కా (ఫైల్)
కామారెడ్డి క్రైం: ఉమ్మడి జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. లాభాలు దండిగా ఉండటంతో అక్రమార్కులు ఈ దందాను వీడటం లేదు. పోలీసుల దాడులు సైతం అంతంత మాత్రంగానే ఉండటంతో అడ్డదారిలో గుట్కా సరఫరా యథేచ్చగా సాగుతుందనే విమర్శలున్నాయి. గడిచిన వారం రోజుల వ్యవధిలో పలు చోట్ల టాస్‌్కఫోర్సు అధికారులు లక్షల విలువైన గుట్కా, ఇతర నిషేధిత వస్తువుల నిల్వలను పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం.
మన రాష్ట్రంలో గుట్కాను ప్రభుత్వం గతంలోనే నిషేధించింది. కానీ చుట్టు పక్కల రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో జిల్లాలోని కొందరు అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి మెదక్, నిజామాబాద్, నిర్మల్, బాన్సువాడ లాంటి పట్టణాలకు గుట్కా సరఫరా చేస్తున్నారు. అక్కడ నుంచి కామారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర పట్టణాలు, మండల కేంద్రాలకు సరఫరా జరుగుతున్నట్లు గతంలో గుట్కా పట్టుబడిన ఘటనల్లో వెల్లడైంది. మెదక్, నిజామాబాద్‌లకు చెందిన కొందరు బడా వ్యాపారులు ఈ దందాను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పాలవ్యాన్‌లు, ఆటోలు ఇతర వస్తువుల సరఫరా రూపంలో ఎవరికీ తెలియకుండా ఉండేలా గుట్కా రవాణాలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.
పోలీసుల నిఘా అంతంతే..
జిల్లాలో గుట్కా సరఫరా, విక్రయాలు జరుగుతున్నా పోలీసులు నిఘా అంతంతమాత్రంగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి కిరాణం, పాన్‌షాప్‌లలో విచ్చలవిడిగా గు ట్కా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు ఉమ్మడి జిల్లాలో పలుసార్లు పోలీసులు దాడులు నిర్వహించి గుట్కా ను స్వా«దీనం చేసుకున్నప్పటికీ ఆయా కేసుల్లో ప్రధాన నిందితులు తమ పలుకుబడితో, రాజకీయ ప్రమేయంతో తప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుశాఖ నిఘా పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది.
మామూళ్ల మత్తులో యంత్రాంగం..
నిషేధిత గుట్కా, ఇతర పొగాకు పదార్థాలకు అలవాటు పడి ఎందరో యువత తమ విలువైన ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. గుట్కా అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. గుట్కా వ్యాపారంపై ఇటీవల కొందరు బడాబాబులు సైతం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పెద్దమొత్తంలో గుట్కా వ్యాపారం చేసే వ్యాపారులు పోలీసు, ఇతర శాఖల్లోని ప్రధాన అధికారులకు మాముళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. అందుకే కొందరు అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఉమ్మడి జిల్లాలో గుట్కా వ్యాపారాన్ని కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment