కిరాయి అడిగాడని కొట్టి చంపేశారు  | Five accused arrested in murder case | Sakshi
Sakshi News home page

కిరాయి అడిగాడని కొట్టి చంపేశారు 

Published Sun, May 12 2019 2:10 AM | Last Updated on Sun, May 12 2019 2:10 AM

Five accused arrested in murder case  - Sakshi

శనివారం మీడియాకు కేసు వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: మాట్లాడుకున్నంత కిరాయి ఇవ్వాలన్న ఆటోడ్రైవర్‌ను చితకబాది క్రూరంగా చంపేశారు. అనంతరం ఆటోను తగలబెట్టేశారు. ఈనెల 1న ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు నిందితులను హైదరాబాద్‌ సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్‌ మీడియాకు వెల్లడించారు. ఈనెల 1న పహాడీషరీఫ్‌ సరస్సు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్‌ 30 నుంచి టి.సాయి నాథ్‌ అనే వ్యక్తి కనిపించడంలేదంటూ మే 2న చందానగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక మే 3న రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని చింతల్‌మెట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆటోను దగ్ధం చేశారని కేసు నమోదైంది. ఈ  ఘటనలన్నీ వెంటవెంటనే చోటుచేసుకోవడం.. అవి సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్లతో ముడిపడినవి కావడంతో సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు..దర్యాప్తు చేసి చిక్కుముడిని ఛేదించారు.  

ఆటో నంబర్‌ ద్వారా దొరికిన లింక్‌.. 
మే 1న జల్‌పల్లి చెరువు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురికావడంతో స్థానిక పోలీసులు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో కాలిపోయిన ఆటో నంబర్‌ సాయంతో దాని యజమాని ఆర్‌సీ పురానికి చెందిన మహమ్మద్‌ ఇస్మాయిల్‌గా గుర్తించారు. అతడితో మాట్లాడటంతో ఈ 3 ఘటనలకు లింకు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. తన ఆటో (టీఎస్‌15యూసీ–4194)ను టి.సాయినాథ్‌ కు అద్దెకు ఇచ్చినట్లు చెప్ప డంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. లింగంపల్లి నుంచి పహాడీషరీఫ్‌ వరకు ఉన్న 40 కిలోమీటర్ల మేర సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. 4 రోజులపాటు 5 టెరాబైట్స్‌ వీడియోలను విశ్లేషించడంతో నిందితులు ఎవరనే విషయం తెలిసింది. 

రూ.200 కోసం గొడవ పడి.. 
మల్లేపల్లికి చెందిన ఎస్‌కే ఇస్మాయిల్‌ అలియాస్‌ అదిల్, షాహీన్‌నగర్‌కు చెందిన ఎస్‌.కె.అమీర్, మరో మైనర్‌ బాలుడు స్నేహితులు. ఈ ముగ్గురికి నేరచరిత్ర ఉంది. గత నెల 30న రాత్రి 7.20కి వీరు ముగ్గురూ టోలిచౌకీలో కలుసుకున్నారు. వీళ్ల స్నేహితుడు షేరా కూడా అక్కడికి వచ్చాడు. షేరాకు లింగంపల్లిలో ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు రావాల్సి ఉంది. దీంతో నలుగు రూ టోలిచౌకీ నుంచి ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యం సేవించి రాత్రి 11 గంటలకు లింగంపల్లి చేరుకున్నారు. అక్కడ రావాల్సిన డబ్బులు తీసుకున్న తర్వాత సాయినాథ్‌తో కిరాయి మాట్లాడుకున్నారు. లింగంపల్లి నుంచి రాజేంద్రనగర్‌ చింతల్‌మెట్‌ వరకు రూ.700 కిరాయి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని అతడి ఆటో ఎక్కారు. టోలిచౌకీలో షేరా, మైనర్‌ బాలుడు దిగి వెళ్లిపోయారు. ఇస్మాయిల్, అమీర్‌లు రాజేంద్రనగర్‌లో ఆటో దిగాక కిరాయి కింద రూ. 500 ఇవ్వబోయారు. అయితే, తనకు మొత్తం కిరాయి రూ.700 ఇవ్వాలని సాయినాథ్‌ అడగడంతో మద్యం మత్తులో ఉన్న ఇస్మాయిల్, అమీర్‌లు సాయినాథ్‌ను చితకబాదారు. అహ్మద్‌ అలీఖాన్‌కు ఫోన్‌ చేసి కత్తి తీసుకొని రమ్మంటూ సూచించారు. అతడు కత్తి తీసుకుని రాగానే సాయినాథ్‌ను జల్‌పల్లిలోని చెరువు పక్క∙ ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్యచేశారు. 

చింతల్‌మెట్‌లో ఆటోదహనం..
సాయినాథ్‌ను హత్య చేసిన తర్వాత అతడి ఆటో తీసుకుని ఇస్మాయిల్, అమీర్, అహ్మద్‌లు వట్టేపల్లిలోని మైనర్‌బాలుడి ఇంటికి వెళ్లారు. తిరిగి చింతల్‌మెట్‌కు బయలుదేరారు. ఆ బాలుడు బైక్‌పై వారిని అనుసరించాడు. మార్గమధ్యంలో పెట్రోల్‌ తీసుకొని చింతల్‌మెట్‌లో ఆటోను కాల్చేశారు. తమ సెల్‌ఫోన్లతో పాటు మృతుడి సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని టోలిచౌకీ వెళ్లి మహ్మద్‌ అబ్దుల్‌ సమీర్‌ ఇంట్లో దాచిపెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement