
చిలకలూరిపేటరూరల్: తన భార్యను బైక్‌పై ఎక్కించుకోవడంతో అవమానంగా భావించిన భర్త.. పథకం ప్రకారం అంజనీరాజును హత్య చేశాడని రూరల్ సీఐ యు.శోభన్‌బాబు చెప్పారు. స్థానిక పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
అనుమానంతో కక్ష పెంచుకుని..
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లికి చెందిన నూతలపాటి అంజనీరాజు(25) చిలకలూరిపేటలో నివసిస్తూ.. మండలంలోని యడవల్లి గ్రానైట్ క్వారీలో ఆపరేటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురిజేపల్లి గ్రామంలోని వరసకు సోదరుడైన రామాంజనేయులు భార్యను గత సంవత్సరం సెప్టెంబర్ ఆరో తేదీన అంజనీరాజు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని వెళ్లాడు. ఏడో తేదీన సమీపంలోని కమ్మవారిపాలెం గ్రామ శివారులో వదిలిపెట్టాడు. స్థానికులు గమనించి రామాంజనేయులుకు సమాచారమిచ్చారు. దీనిని అవమానకరంగా భావించిన రామాంజనేయులు ఎలాగైనా అంజనీరాజును హత మార్చాలని కక్ష పెంచుకున్నాడు. దీని కోసం తన పొలాన్ని విక్రయించేందుకు నిర్ణయించాడు. విషయం తెలుసుకున్న అంజనీరాజు తన కుటుంబంతో కలిసి ఈ ఏడాది మేలో చిలకలూరిపేట వచ్చాడు.
హత్యకు రూ. 10 లక్షల కిరాయి
అంజనీరాజును హత్య చేయాలని నిర్ణయించుకున్న రామాంజనేయులు..తన బంధువులైన నూతలపాటి అంజయ్య, నూతలపాటి కోటేశ్వరరావులకు విషయం చెప్పాడు. వీరు ముగ్గురు కలిసి బల్లికురవ గ్రామానికి చెందిన సాదు బాబును హత్యకు సహాయం కోరారు. ఈ మేరకు సాదుబాబు ఈ ఏడాది మే నెలలో బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామానికి చెందిన క్వారీ మిషన్ ఆపరేటర్ సాదు రమేష్‌ను రామాంజనేయులుకు పరిచయం చేశాడు. అంజనీరాజును హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు. ఈ మేరకు రమేష్ రూ. 10 లక్షలు కిరాయి కోరటంతో అప్పుడే అడ్వాన్స్‌గా మూడు లక్షలు చెల్లించారు. సాదు రమేష్ చిలకలూరిపేట సంజీవ్‌నగర్‌కు చెందిన జంగా అచ్చిబాబు, వైఎస్సార్ కాలనీకి చెందిన దావల యేసుబాబులను హత్యకు సహకరించాలని కోరాడు. ఈ మేరకు ఆగస్టు రెండో తేదీన మరో రెండు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. నిందితులు చిలకలూరిపేటలోని పాత ఇనుపకొట్టులో రెండు జింక్ పైపులు కొనుగోలు చేశారు.
గ్రానైట్ అధికారిగా పరిచయం....
ఈ నెల మూడో తేదీ రాత్రి సాదు రమేష్ యడవల్లి గ్రామంలో అంజనీరాజు పని చేసే కిషోర్ గ్రానైట్ క్వారీ వద్దకు వెళ్లాడు. తాను మైనింగ్ శాఖకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. అంజనీరాజు డ్యూటీ పూర్తయ్యే వరకు రమేష్ అక్కడే ఉన్నాడు. అనంతరం రాత్రి రెండు గంటల సమయంలో ఇద్దరూ వేర్వేరు బైక్‌లపై చిలకలూరిపేట బయలుదేరారు. నిందితులు పథకం ప్రకారం కృపా గ్రానైట్స్ వద్దకు కాపు కాశారు. రాత్రి 2.40 గంటలకు కృపా గ్రానైట్స్ సమీపంలో రాగానే సాదు రమేష్.. అంజనీరాజు మోటార్ సైకిల్‌కు తన వాహనాన్ని అడ్డుపెట్టాడు. అప్పటికే కాపు కాసి ఉన్న ఆరుగురు నిందితులు జింక్ పైపులతో అంజనీరాజుపై దాడి చేయడంతో కింద పడిపోయాడు. బండరాయితో తలపై కొట్టి హత్య చేశారు. దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహం పక్కనే బండరాయిని పెట్టి వెళ్లిపోయారు.
మిస్టరీ వీడిందిలా..
అంజనీరాజు మృతదేహం తలకు ఎదురుగా నిందితులు బండరాయిని పడేశారు. కానీ మృతుని తలకు వెనక వైపు గాయం కావడంతో పోలీసులకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు మిస్టరీ ఛేదించారు. నిందితుల వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రెండు జింక్ పైపులు, ఆరు సెల్‌ఫోన్‌లు, రూ. 54 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండో నిందితుడైన జంగా అచ్చిబాబుపై నాదెండ్ల, యడ్లపాడు, నరసరావుపేట, చిలకలూరిపేట పట్టణాల్లో వివిధ కేసులు ఉన్నాయి. రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు సూచనల మేరకు డీఎస్పీ కే నాగేశ్వరరావు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసినట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదనకు కృషి చేసిన రూరల్ ఎస్‌ఐలు పీ ఉదయ్‌బాబు, అదనపు ఎస్‌ఐ పవన్‌కుమార్, హెచ్‌సీలు వెంకటేశ్వర్లు, బీ శ్రీనివాసరావు, ఎండీ జిలానీ, ప్రసాద్, కే వెంకటేశ్వర్లును అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment