Unsolved Mysteries: US Michigan Joann Matouk Death Mystery And Shocking Facts In Telugu - Sakshi
Sakshi News home page

Joann Matouk Death Mystery: దిమ్మలపై పేరుకున్న మంచు రక్తికట్టించే కథను చెప్పింది! నేటికీ..

Published Wed, Nov 30 2022 6:36 PM | Last Updated on Wed, Nov 30 2022 8:03 PM

US Michigan Joann Matouk Death Mystery Shocking Facts In Telugu - Sakshi

తల్లి జోవాన్‌ ఫొటోతో మిషెల్‌ (PC: Detroit Free Press)

అది 2010 జనవరి 12, రాత్రి ఎనిమిది కావస్తోంది. పన్నెండు డిగ్రీల వాతావరణంలో మంచు.. వానలా కురిసే రోజులవి. అమెరికాలోని మిషిగన్‌లో సెయింట్‌ పాల్‌ కేథలిక్‌ చర్చ్‌కి, క్లెయిర్‌ సరస్సుకు మధ్యలో వన్‌–వే ఎగ్జిట్‌ డ్రైవ్‌వేలో పెట్రోలింగ్‌ చేస్తున్న లెఫ్టినెంట్‌ ఆండ్రూ దృష్టి.. ఆగి ఉన్న ఓ సిల్వర్‌ కలర్‌ కారు మీద పడింది. అది సరస్సుకు వంద అడుగుల దూరంలో ఉంది.

దగ్గరకు వెళ్లిన ఆండ్రూ కారుని పరిశీలనగా చూశాడు. కారులో ఎవరూ లేరు. ఆ చుట్టుపక్కలా ఎవరూ లేరు. ‘ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌’లో కారు నంబరు చెక్‌ చేసి, కారు మిషెల్‌ అనే అమ్మాయి పేరు మీద ఉన్నట్లు నిర్ధారించుకున్నాడు. కారుకి ఏదైనా సమస్య వచ్చి వదిలారనుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

మరో గంట తర్వాత పెట్రోలింగ్‌లో ఉన్న పబ్లిక్‌ సేఫ్టీ ఆఫీసర్‌ కీత్‌ దృష్టి కూడా ఆ కారు మీదే పడింది. కారు ముందు సీట్‌లో హ్యాండ్‌ బ్యాగ్‌ ఉండటంతో అతడికి అనుమానం మొదలైంది. మంచునేలపై కొన్ని అడుగుల ఆనవాళ్లు.. కారు నుంచి సరస్సు వైపు దారిని చూపడంతో, కీత్‌ వాటినే అనుసరించాడు. సుమారు 75 అడుగుల తర్వాత రెండు విరిగిన దిమ్మలపై పేరుకున్న మంచు మరింత రక్తికట్టించే కథను చెప్పు కొచ్చింది.

ఒక దిమ్మపై మనిషి కూర్చున్నట్లు, మరో దిమ్మపై మనిషి జారి సరస్సులో పడినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. వాటిని గమనించిన కీత్, వెంటనే ఆండ్రూ సాయం కోరాడు. తక్షణమే రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగింది.

కారు నంబర్‌ ఆధారంగా.. అడ్రెస్‌ పట్టుకుని.. తొమ్మిదిన్నర అయ్యేసరికి మిషెల్‌ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. కాలింగ్‌ బెల్‌ కొట్టగానే.. ‘ఇంత ఆలస్యమా?’ అన్నట్లు మిషెల్‌ ఆత్రంగా తలుపు తీసింది. అప్పటి దాకా సరస్సులో పడింది మిషెల్‌ అనుకున్న పోలీసులు, తలుపు తీసింది స్వయంగా ఆమేనని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వచ్చింది తన తల్లి జోవాన్‌ అనుకున్న మిషెల్‌.. పోలీసులను చూసి షాక్‌ అయ్యింది.

కారు జోవాన్‌(50) తీసుకుని వెళ్లిందని తెలుసుకున్న పోలీసులు, ‘మీరు ఆమెతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు మిషెల్‌కి గుండె ఆగినంత పనైంది. వెంటనే తల్లి ఫోన్‌కి వరసగా డయల్‌ చేస్తూనే ఉంది. ‘దిస్‌ నంబర్‌ ఈజ్‌ అవుటాఫ్‌ స్టేషన్‌’ అనే మాటలు వణుకు పుట్టించాయి.

రాత్రి పది దాటేసరికి మిషెల్, తన చెల్లెలు కెల్లీ, తమ్ముడు మైకేల్‌ ముగ్గురూ కలిసి బిక్కు బిక్కమంటూ పోలీసుల వెంట సరస్సు దగ్గరకు వెళ్లారు. కారు చుట్టూ ఉన్న క్రైమ్‌ సీన్‌ టేప్‌ వాళ్లని మరింత భయపెట్టింది. ఎటు చూసినా పోలీసులే! వారిలో ఒక పోలీస్‌ ‘జోవాన్‌ మీ మదరా? ఆవిడ ఈ లేక్‌లో పడిపోయారు’ అన్న మాటలు చుట్టూ చెలరేగే శబ్దాలను నిశబ్దం చేస్తూ ఒక్కసారిగా వారిని దుఃఖంలో ముంచెత్తాయి.

కోస్ట్‌ గార్డ్‌ హెలికాప్టర్లలతో, లేక్‌ షోర్‌ డ్రైవ్‌లతో సరస్సు మొత్తం జల్లెడపడుతున్నాడు. మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు సర్చ్‌ ఆపేసి, కారును పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. ఏదైనా సమాచారం అందితే చెబుతామంటూ మిషెల్‌ వాళ్లని ఇంటికి పంపించేశారు.

జోవాన్‌ 1980లో డేవిడ్‌ రోమైన్‌  అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన ఇరవై ఐదేళ్లకి విడాకులు ఇచ్చి, తన ముగ్గురు పిల్లలతో కలిసి బతకడం మొదలుపెట్టింది. అయితే విడిపోయే వరకూ ఇద్దరి మధ్య చాలా గొడవలు నడిచాయి. జోవాన్‌కు స్నేహితులు ఎక్కువ. ఎప్పుడూ పార్టీలు, గెట్‌ టుగెదర్‌ అంటూ జీవితంలో తనకు తానే సంతోషాన్ని సృష్టించుకునేది.

అలాంటి మనిషి అకస్మాత్తుగా కనిపించకపోవడం ఆమె పిల్లలకే కాదు, ఆమె సన్నిహితులకు కూడా మింగుడుపడలేదు. జోవాన్‌ తప్పకుండా తిరిగి వస్తుందనే వారంతా నమ్మారు. మర్నాడే కారు స్పేర్‌ కీతో హ్యాండ్‌ బ్యాగ్‌ బయటికి తీశారు పోలీసులు. అందులో 15 వందల డాలర్లు సురక్షితంగా ఉండటంతో, ఈ కేసు కుట్రపూరితం కాదని తేల్చేశారు.

సరిగ్గా డబ్భై రోజులకు బోబ్లో దీవిలో డెట్రాయిట్‌ నదిలో మత్స్యకారుల వలలో ఓ మృతదేహం చిక్కింది. అది జోవాన్‌దేనని తేలింది. ఆ దీవి.. క్లెయిర్‌ సరస్సుకు 35 మైళ్ల దూరంలో ఉంది. పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే, ‘మా మామ్‌ని ఎవరో కావాలనే చంపేశారు. కేసు తారుమారు చేయడంలో పోలీసుల పాత్ర కూడా ఉంది, తను మిస్‌ అవ్వడానికి ముందురోజుల్లో తనను ఎవరో ఫాలో అవుతున్నారని భయపడింది’ అంటూ కోర్టుకెక్కారు జోవాన్‌ పిల్లలు.

ఆ రోజు కారు సమీపంలో, సరస్సు చుట్టు ప్రక్కల పాదముద్రలు కానీ, సరస్సులో పడిన ఆనవాళ్లు కానీ లేవని చీఫ్‌ జెన్సన్‌ తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది. పోలీసులపై నమ్మకం లేని మిషెల్‌.. రాండాల్‌ అనే ప్రైవేట్‌ ఇన్వెస్టిగేటర్‌ని నియమించుకుంది. అతడు చర్చిలో చాలామంది సాక్షులతో మాట్లాడాడు.

ఆ రోజు చర్చి నుంచి బయటికి వచ్చే సమయంలో జోవాన్‌ కారు నుంచి అలారం మోగిందని, పొరబాటున టచ్‌ అయ్యి ఉంటుందనుకున్నామని కొందరు, సమీపంలో ఓ నల్లటి వ్యాన్‌ని, నల్ల కండువా ధరించిన మనిషిని చూశామని మరికొందరు చెప్పుకొచ్చారు. మరి జోవాన్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చర్చికి వెళ్లేముందు ఎందుకు కారులో గ్యాస్‌ని ఫుల్‌ ట్యాంక్‌ చేయించింది?

గ్యాస్ట్‌స్టేషన్‌ మేనేజర్‌తో ఎందుకంత సంతోషంగా మాట్లాడింది? సరసులో గంటల తరబడి వెతికినా దొరకని మృతదేహం అంతదూరం నీటిలో ఎలా వెళ్లింది? వంటి ఎన్నో అనుమానాలను లేవనెత్తాడు రాండాల్‌.

జోవాన్‌ శవపరీక్షలో పాల్గొన్న డాక్టర్‌ జెంట్‌జెన్‌.. మృతదేహం కనుగొన్నప్పుడు ఆమె ఊపిరితిత్తులలో నీరు లేదని, అంటే నీటిలో పడకముందే ఆమె ప్రాణాలు పోయాయని ధ్రువీకరించాడు. అయితే అది ప్రమాదమా? హత్యా? ఆత్మహత్యా? అనేది తేల్చలేకపోయాడు. మృతదేహం కోటు జేబులోనే అసలు కారు కీస్‌ దొరికాయి. జోవాన్‌ అదృశ్యం కావడానికి నెల్లాళ్ల ముందు.. కారుతో పాటు ఇంటి స్పేర్‌ కీస్‌ కూడా కనిపించడం లేదని కూతురు మిషెల్‌తో చెప్పింది.

అయితే పోలీసులకు కారు స్పేర్‌ కీ ఎలా అందింది అనేది అనుమానాస్పదమే. మరోవైపు జోవాన్‌ మృతదేహాన్ని పరిశీలించిన మిషెల్, ‘మా మామ్‌ ఎప్పుడూ కోటును ఇలా గడ్డం వరకూ జిప్‌ చేసుకోదు. అలాగే తను ఎప్పుడూ హ్యాండ్‌ బ్యాగ్‌ని ఎడమ చేతికే వేసుకునేది. అదే చేతికి రెండు చిన్నచిన్న గాయాలు ఉన్నాయి, హ్యాండ్‌ బ్యాగ్‌కి చిరుగులు ఉన్నాయి.

పైగా అది పదిరోజుల క్రితం కొన్న కొత్త బ్యాగ్‌. బహుశా కిల్లర్‌కి, మామ్‌కి మధ్య జరిగిన పెనుగులాటలో ఆ డ్యామేజ్‌ జరిగి ఉంటుంది’ అని ఆరోపించింది. హత్యకు కారకులుగా.. తండ్రి డేవిడ్, మేనమామలు జాన్, బిల్‌లతో పాటు జోవాన్‌ కజిన్‌ టిమ్‌ మటౌక్‌లపై అనుమానం వ్యక్తం చేసింది మిషెల్‌. తన తల్లికి తండ్రితో ఉన్న వ్యక్తిగత తగాదాలతో పాటు మిగిలిన వారితో ఉన్న ఆర్థిక తగాదాలను కారణంగా చూపించింది.

జోవాన్‌కి సంబంధించిన రోజరీ (మెడలో వేసుకునే శిలువ), సెల్‌ఫోన్‌ ఇప్పటికీ దొరకలేదు. స్కాట్‌ లూయీ అనే మరో ప్రైవేట్‌ ఇన్వెస్టిగేటర్‌ సాయంతో.. మిషెల్‌ నేటికి ఆన్‌లైన్‌ పిటిషన్స్‌ వేస్తూ.. తల్లి కోసం న్యాయం పోరాటం చేస్తూనే ఉంది. సుమారు పన్నెండేళ్లుగా జోవాన్‌ మరణం మిస్టరీగానే మిగిలింది.
-సంహిత నిమ్మన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement