
సాక్షి, గుంటూరు : జిల్లాలో ఈ ఉదయం దారుణం చోటు చేసుకుంది. భారీ పేలుడు సంభవించగా.. ఓ బాలుడు మృతి చెందాడు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామం గంగానమ్మపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కొండ ప్రాంతంలో నాగరాజు కుటుంబం నివసిస్తోంది. ఆదివారం ఉదయం నాగరాజు తన ఇంటి ముందు పడేసి ఉన్న ఓ పెయింట్ బకెట్‌ను చూశాడు. ఇంట్లో వాడుకునే ఉద్దేశంతో దానిని తీసుకొచ్చి మూత తెరవాలని యత్నించాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారు. మూత తెరవగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బాలుడు గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగరాజు, భవానీ, నాగమణి తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని 108లో హుటాహుటిన విజయవాడకు తరలించారు. రంగు డబ్బానే అయినప్పటికీ రసాయనాలు ఉండటంతో పేలుడు సంభవించి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ, పోలీసులు మాత్రం కొండ ప్రాంతాలను పేల్చేందుకు వాడే బాంబులు అందులో ఉండి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment