ఢిల్లీ/చెన్నై: ఎనిమిదేళ్ల కిందటి భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఏఎన్-32 మిస్సింగ్ మిస్టరీ వీడింది. బంగాళా ఖాతం అడుగున విమాన శిథిలాల్ని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇందులో ప్రయాణించిన 29 మంది సజీవంగా లేరనేది దాదాపుగా నిర్ధారణ అయ్యింది.
2016లో బంగాళాఖాతం మీదుగా 29 మందితో వెళ్తున్న విమానం జాడ లేకుండా పోయింది. అయితే అది సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఓ అంచనాకి వచ్చిన అధికారులు.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించిన ఆటానమస్ యుటిలిటీ వెహికల్(AUV) ద్వారా అన్వేషణ ప్రారంభించారు. చివరకు.. ఇన్నేళ్ల తర్వాత చెన్నై తీరానికి దాదాపు 310 కి.మీ దూరంలో సముద్రగర్భంలో కూలిపోయిన విమానం శిథిలాలు కనిపెట్టారు.
అత్యాధునిక సాంకేతికను ఉపయోగించిన జరిపిన అన్వేషణలో పలు అంశాల పరిశీలన తర్వాత.. సముద్రం అడుగున కనిపించిన శిథిలాలు ఏఎన్-32వేనని అధికారులు నిర్ధారించుకున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
జూలై 22, 2016 ఉదయం ఏం జరిగిందంటే..
ఉదయం 8.30ని ప్రాంతంలో IAF ఆంటోనోవ్ An-32, చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరింది. మూడు గంటల తర్వాత అది గమ్యస్థానం అయిన అండమాన్ ,నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌కు చేరాల్సి ఉంది. ఎఎన్-32 రకానికి చెందిన విమానాలు చాలా బరువుతో పాటు బలంతో ఉంటాయి. పర్వతాలు, ఎడారుల్లో ఈ ఫ్లైట్ అధికంగా సంచరిస్తుంది. వారానికోసారి పోర్ట్‌బ్లెయిర్‌కు ఈ రవాణా విమానం వెళ్లాల్సి ఉంది. ఆతేదీ సిబ్బందితో సహా మొత్తం 29 మంది బయల్దేరారు.
అయితే పోర్ట్ బ్లెయిర్‌లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయిన INS ఉత్క్రోష్‌లో అది ల్యాండ్ కాలేదు. బయల్దేరిన 15 నిమిషాలకే చెన్నై ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు ధృవీకరించుకుని రంగంలోకి దిగారు. అదృశ్యమైన విమానం కోసం భారతదేశం తీవ్రంగా వెతికింది. భారత వైమానిక దళం అణువణువు గాలించినా ఫలితం లేకపోవడంతో.. సెప్టెంబర్‌లో బాధిత కుటుంబ సభ్యులకు ‘‘విమానాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని, విమానంలో ఉన్నవారిని చనిపోయినట్లు భావించి ప్రకటించడం తప్ప వేరే మార్గం లేద’’ని లేఖలు రాసింది. అలా.. విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చునని అధికారులు అప్పుడు భావించారు.
విమానం కోసం ఐదు యుద్ధనౌకలు సముద్ర జలాల్లోకి గాలింపు చర్యల నిమిత్తం బరిలోకి బయల్దేరాయి. వీటితో పాటు 13 ఫుల్ స్పీడ్ పడవలను కూడా పంపారు. అయితే జాడను గుర్తించేందుకు ఉపయోగపడే పరికరాలను ఎయిర్‌క్రాఫ్ట్ మోసుకెళ్లలేదనే విషయం దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సెర్చ్ ఆపరేషన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది. అలా.. ఎయిర్‌క్రాఫ్ట్ కోసం భారత్ జరిపిన అతిపెద్ద గాలింపు చర్యగా మిగిలిపోయింది ఈ ఆపరేషన్.
Comments
Please login to add a commentAdd a comment